22, జనవరి 2011, శనివారం

కులాంతర, మతాంతర పెళ్ళి




ఆవుల గోపాల క్రిష్న మూర్తి కులాంతర, మతాంతర పెళ్ళిళ్ళు 100 కు పైగా చేయించి మానవవాద ఉద్యమాన్ని ముందుకు తీసుక వెళ్ళారు. ఆయన చేయించిన చివరి పెళ్ళి టీచర్ ఎన్. వెంకతేస్వరరావ్ ది. చీరాల దగ్గర గొనిసపూడిలో 1966 లో చక్కటి ఉపన్యాసముతో ఆకట్టుకున్న పెళ్ళి అది.
పెళ్ళి జరిపిస్తుండగా చిత్రం ఇక్కడ చూడవచ్చు.

21, జనవరి 2011, శుక్రవారం

సాహిత్యంలో ఔచిత్యం

ఆవుల గోపాలకృష్ణమూర్తి

మా ఆలోచనలు

ఆవుల గోపాలకృష్ణమూర్తి భావప్రచారకుడు. సాంఘిక ప్రయోజనాన్నుద్దేశించి సాహిత్య పరిశీలన చేశాడు. అంటే సాహిత్యంలో మరో ఔచిత్యాన్వేషణ మొనరించాడు. భావమునకు బలమున్నదనే నమ్మకము గలవాడు గనుక, సాహిత్య భావముల బలము సంఘముపై జాస్తి గనుక, కొంత నిశిత పరిశీలన చేసినాడు. నిశిత పరిశీలనకు నిలబడు సాహిత్యము అల్పముగదా మనకు.
ఆవుల సాహితీ రచనలు అనేక విధములు. భావస్పందన కలుగగా మెదలిన ఆలోచనలకు రూపకల్పన చేసిన రచనలు సహజములు. “సాహిత్యములో ఔచిత్యము” తత్ఫలితమే. కొన్ని లభ్యముగాక యిందు జేర్చలేక పోవుటచే క్షంతవ్యులము.
భావములోవలె భాషయందునూ ఔచితి పరిశీలన అవసరము కదా. హేతువాది గోపాలకృష్ణమూర్తి గ్రాంథికవాది (వీరగ్రాంథికవాది కాదు) కారణాంతములచే వీర వాడుకవాదియై “గోపాక్రిష్నమూర్తి”, “సుబ్రమన్యం”, “రొండు” అనే పదములు వాడిననూ, క్రమేణా “రొండు” మాత్రమే మిగిల్చినాడు. సాహిత్య వ్యాసములలో గ్రాంథిక వాసనలు మెండు.
సాంఘీక ప్రయోజనమునకు వాడుక భాష దగ్గర దారియని, గ్రాంథికము వలన కాలహరం జరుగుననీ భావించుటయూ కద్దు. ఇందలి హేతువు చింత్యము. భాషకు నియమము గావలయుననిన అది గ్రాంథికమే. సరళగ్రాంథికము గావచ్చును. వాడుకభాష నియమము తప్పినట్టిది. కనుకనే గోపాలకృష్ణమూర్తి గ్రాంథిక వాసనలు వీడజాలక, వాడుకలోకి దిగజారలేక, డోలాందోళిత మనస్కుడై, రాగా రాగా గ్రాంథో వ్యవహారికము ననుసరించినాడు.
వాదోపవాదములలో ఆవుల దిట్ట. ఆయిననూ కొందరి దృష్టిలో వాదములు పాక్షికములు. కనుక అట్టివి కావలయునని వదిలివేసితిమి.
మొత్తము మీద సాహిత్య రుచులు గలవాడైననూ, గోపాలకృష్ణమూర్తి దానిపై నొక్కు బెట్టనట్లు, రచనలవలన స్పష్టము. కొన్నిటి యెడల ప్రతిభావ్యుత్పన్నత ద్యోతకమగును. భావమునకుగల బలము భాషకు లేకపోవుట ఆయన గొప్ప లోపము. సృజనాత్మకశక్తిని సద్వినియోగమొనర్చలేదనే చెప్పవలయును సాహితీరంగములో. ఆ ప్రయత్నమేదో మొగ్గయందే వాడిపోవుట బాధాకర విషయము. దాని భావనలే చివరివరకు మిగిలినవి.
ఆవుల గోపాలకృష్ణమూర్తికి సంబంధించిన హాలాహలాన్ని కంఠస్థమొనరించి, అమృతాన్ని మాత్రమే అందజేయ ప్రయత్నించిన మా గురువులు ఎలవర్తి రోశయ్యగారి సలహాలు శిరోధార్యములుగ స్వీకరించి యీ గ్రంథమును వెలువరించితిమి. వారికి మా నమభినందనాలు. ఇతరత్రా తోడ్పడిన ఎ.జి.కె. అభిమానులు తోటకూర శ్రీరామమూర్తి, మాధవరావు, పోలు సత్యనారాయణ, వెలిది వెంకటేశ్వర్లు మన్నన పాత్రులు. తమ గ్రంథములలో గోపాలకృష్ణమూర్తి రచనలు పునర్ముద్రించుకొనుటకు తక్షణమే అంగీకరించిన అమ్మిసెట్టి లక్ష్మయ్య, గౌరిబోయిన పోలయ్య, కలపాల సూర్యప్రకాశరావుగారలకు, తమ తమ పత్రికల నుండి పునర్ముద్రణకు అనుమతించిన సంపాదకులకు ధన్యవాదములు.
ఎ.జి.కె.పై అవ్యాజానురాగము చూపుచు, మేము కోరినదే తడవుగా గ్రంథ ప్రచురణకు మమ్ములనే తొందరజేసి ప్రచురించిన “తెలుగు విద్యార్థి” సంపాదకులు కొల్లూరి కోటేశ్వరరావుగారు సాహిత్యాభిలాషనేగాక, భావసాహసమును ప్రదర్శించి, మా ప్రేమపాత్రాభిమానులైరి. వారి సేవలు మాన్యములు.
                                                                             ఇట్లు
                                                ఎం. శ్రీరామమూర్తి
                                                 ఎన్. ఇన్నయ్య

విషయసూచిక
1.    సాహిత్యం – ఔచిత్యం
1958లో ఎ.సి.కళాశాల గుంటూరు ఆంధ్ర భాషా సమితి నుద్దేశించి చేసిన ప్రసంగం
2.    భారత సంస్కృతి
1958 జనవరిలో ఆంధ్ర పత్రిక నుండి పునర్ముద్రితం, దీని విస్తృత పాఠం            శ్రీ కొల్లా శ్రీకృష్ణారావుగారి రారాజు కావ్యంలో పీఠికగా చూడనగును.
3.    ఆంధ్ర భాషా ప్రాశస్త్యము
ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆంధ్రాభ్యుదయ వారోత్సవాల ప్రారంభోపన్యాసం 1960లో
4.    కావ్య ప్రయోజనం
రేపల్లె శ్రీ శారదా విద్యాపీఠంలో చేసిన ప్రసంగం 1958లో
5.    కావ్యలోకం – రైతు విప్లవం
శ్రీ అమ్మిసెట్టి లక్ష్మయ్య (తణుకు) గారి రైతు కల్యాణమునకు పీఠిక 1948
6.    సాహిత్యములో సాంఘిక విప్లవము
శ్రీ గౌరిబోయిన పోలయ్య (ఇంకొల్లు, గుంటూరు జిల్లా) గారి పిలక రాయుళ్ళు గ్రంథానికి పరిచయం.
7.    ఏటుకూరి వేంకటనరసయ్య
స్మారక సంచికనుండి
8.    చల్లా పిచ్చయ్యశాస్త్రిగారి ప్రతిభావ్యుత్పత్పులు
ఆంధ్ర పత్రిక నుండి
9.    రవీంద్రనాథ ఠాగూరు
1960లో చీరాల సాంస్కృతిక సమితిలో చేసిన ఉపన్యాసం
10.  మన కవి కాటూరి
కవి అస్తమించిన సమయములో వ్రాసినది ప్రజావాణి నుండి
11.  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
ఆంధ్ర భూమి నుండి, కవి మరణించిన సందర్భంగా వ్రాసినది 1960లో
12.  శ్రీ త్రిపురనేని రామస్వామి భావపరిణామం
కవిరాజదర్శనం నుండి
13.  సూతపురాణం
కవిరాజదర్శనం నుండి
14.  భారతీయ సంప్రదాయం – నవ్యతా ప్రభావం
1965లో కేరళ రచయితల సమావేశంలో చదివిన వ్యాసం

19, జనవరి 2011, బుధవారం

హ్యూమనిస్టుల దృక్పథం ఏమిటి ?

హ్యూమనిజం -3

 Photo courtesy: Prometheus Books

హ్యూమనిజం జాతీయవాదమా, లేక అంతర్జాతీయవాదమా అనే ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు. ‘ఏదీ కాద’ని సమాధానమిస్తే ఆశ్చర్యంతో కొందరూ నిస్పృహతో మరికొందరూ చూస్తారు. ‘ఏదీ కాక మరేమిటి, నిజంగా ఏమీ కాదేమో’నని నవ్వే వారూ లేకపోలేదు. పోతే హ్యూమనిజం ఏ వాదం?
జాతీయవాదం రమారమి పెట్టుబడిదారీ విధానంతో ప్రారంభమైందని చెప్పాలి. పెట్టుబడిదారీ విధానం ఆర్థిక రూపమైతే, జాతీయవాదం దాని రాజకీయ-సాంస్కృతిక రూపంగా యెంచబడింది. అంతకుముందు రాజ్యాలు, పెద్ద విస్తీర్ణ పరిపాలనలూ ఉన్నా – పెట్టుబడిదారీ విధానపు రాకతో జాతీయవాదం ఉత్పన్నమైంది. పెట్టబడిదారీ దేశం పొలిమేరల్లో ముందు నాల్గు మూలలా క్రమ్మి, తాను తయారు చేసే వస్తువులు ‘స్వదేశవస్తువు’అని, వాటిని కొనటం, వాటి అభివృద్ధికి పాటుపడటం, వాటి విస్తరణకు తోడుపడటం ప్రతి దేశీయుని విధిగా ప్రచారం చేసింది. జాతీయవాదం నుంచి దేశభక్తి, దేశభక్తి నుంచి భాషాప్రాంత నిర్మాణ విభాగపద్ధతి బయలుదేరాయి.

జాతీయ వాదానికి ప్రాతిపదిక దేశం. ఆ దేశంలో ఉన్న జాతి. అందువల్లే జాతీయవాద నిర్మాణ ప్రణాళికలన్నీ “దేశాన్ని” యూనిట్.గా తీసుకొని నిర్మించబడతాయి. జాతీయవాదం ఒక దేశపు ఔన్నత్యాన్ని, వికాసాన్ని ఆకాంక్షించి, దానికై కృషి చేస్తుంది. జాతి ప్రతిభ విస్తరణ కోసం పనిచేస్తుంది. ‘నీ జాతి ఔన్నత్యం కోసం నువ్వు ఏమైనా త్యజించాలి. అవసరమైతే నిన్ను నువ్వే త్యజించా’లని జాతీయవాదం ప్రచారం చేస్తుంది. హిట్లర్, ముస్సోలినీ, టోకో, ఫ్రాంకో ప్రభృతులంతా విశేష జాతీయవాదులు, స్వతంత్ర దేశాలలోని జాతీయవాదులు. పోతే ఛాంక్ కై షేక్, గాంధీ, కెమాల్ పాషా మొదలైనవాళ్ళు అస్వతంత్రంగా వుండిన దేశాల్లోని జాతీయవాదులు. రెంటిలో కొంత తేడా వుంది. కాని అస్వతంత్ర దేశాలు స్వతంత్రంకాగానే, ఆ తేడాలు క్రమేణా మాసిపోతై, ఈనాడు తూర్పు దేశాల్లో చేస్తున్నదదే.

జాతీయవాదాన్ని సంకుచిత దృక్పథమని విమర్శించి, అంతర్జాతీయవాదం బయలుదేరింది. ప్రపంచమంతా ఒకటే, జాతీయవాదం హేయం, దానివల్ల యుద్ధాలు వస్తున్నాయి. అంతర్జాతీయ వాదాన్ని స్వీకరిస్తే యుద్ధాలు పోతాయి. జాతీయవాదం సృష్టించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రచారం సాగించింది.

ఈ అంతర్జాతీయవాదంలో చాలా రకాలున్నాయి. వాటిలోకల్లా విశేషస్థానాన్ని స్వీకరించగలిగింది మార్క్సు మొదలైన కమ్యూనిస్టులు చేసిన సిద్ధాంత ప్రచారం.  పెట్టుబడిదారీ విధానం జాతీయ వాదాన్ని సృష్టించింది. సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ వాదాన్ని సృష్టించిందని  చెప్పవచ్చు. జాతీయ దృష్టితో చూస్తే సార్థపరత్వం ఎదురుతగిలి, విశేషంగా చిక్కు సమస్యలు వస్తున్నాయనీ, అంతర్జాతీయ వాదంతో విశాల దృష్టి ఏర్పడి, స్వార్థం నశించి, వివిధ సమస్యలు పరిష్కారం కాగలవనీ చెప్పాడు. మతాన్నే మార్క్సు మత్తు మందుగా విమర్శిస్తే ఈ అంతర్జాతీయ వాదులు జాతీయతను గూడా ఒక మత్తుమందుగా నిందించారు.

ఈనాడు మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రపంచంలో అన్ని మూలలా పరిశీలించి చూస్తే – జాతీయవాదం, అంతర్జాతీయవాదం చేసిన, చేస్తున్న పనులన్నీ తేలిగ్గా అవగాహన చేసుకోవచ్చు. ఆ ప్రయత్నాన్ని హ్యూమనిజం చేసింది, ఇతరులు చేయటానికి గూడా కావలసినంత సరంజామా యిచ్చింది.

పెట్టుబడిదారీ విధానం జమీందారీ విధానంకన్నా మొదట్లో అభివృద్ధికరమైన శక్తిగా ఈనాటి-ఆనాటి అంతర్జాతీయవాదులు గూడా పరిగణించారు. అందువల్ల దాని రాజకీయ ప్రతిచ్ఛాయగా తయారైన జాతీయవాదం కూడా ఒకప్పుడు ఒక దేశపు పొలిమేరల్లో వున్న వివిధ ప్రాంతాలని కలిపి ఏక ప్రాంతంగా చేసి, ఒక బలవత్తర శక్తిగా ఏక పరిపాలనలోకి తెచ్చినప్పుడు  - అభివృద్ధికర శక్తిగానే ఎంచబడింది. కానీ పెట్టుబడిదారీ విధానం కాలం గడిచినకొద్దీ అభివృద్ధి నిరోధక శక్తిగా తయారై, తన స్థితిని ఘనీభవింపచేసుకునే ప్రయత్నంలో పడగానే, దాని ప్రతిచ్ఛాయ అయిన జాతీయ వాదం కూడా అభివృద్ధి నిరోధక శక్తిగా తయారైంది. ఒక దేశంలోని పెట్టుబడిదార్లు యింకో దేశంలోని పెట్టుబడిదార్లతో ఢీకొనగా, జాతీయవాదం యుద్ధవాదంగా తయారైంది. పెట్టుబడిదారీ విధానం ప్రాయికంగా జాతీయవాదమైనా, అదీ అంతర్జాతీయ స్వరూపాన్ని కొంతకు కొంత పొందింది. అన్యదేశాలకు వ్యాపించిన పెట్టుబడిదారీ విధానాన్నే “సామ్రాజ్యవాద” మంటారు.

సామ్రాజ్యవాదమంటే విజయవంతంగా ఉన్న జాతీయవాదమన్నమాట. దీనినే అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానమనీ చెప్పవచ్చు.కాని,సోషలిస్టు ఆర్థికవ్యవస్థ అంతర్జాతీయ వాదానికి ప్రాతిపదికగా వుంది. సోషలిజంలో ‘జాతిపరం చేయటం’ ప్రధాన వివాదం. అంటే జాతీయ దృష్టి అంతర్జాతీయ వాదాలలో యిమిడి ఉంది. అట్లాగే కొంత అంతర్జాతీయ దృష్టి జాతీయ వాదంలో యిమిడి వుంది కూడాను.
అంతర్జాతీయ వాదం ఒక “దేశాన్ని” ప్రధానమైన యూనిట్.గా తీసుకోరు. “ఒక వర్గాన్ని” ప్రధానమైన యూనిట్.గా తీసుకుంటుంది.  అది శ్రామిక వర్గం అన్ని దేశాల్లోనూ ఉంది కనుక. ఈ అన్నిటిలోనూ వున్న శ్రామికవర్గ సమస్యలన్నీ యించుమించు ఒకేరకమైన పరిష్కారమార్గంతో స్థిమితపడతాయి కనుక – అంతర్జాతీయ వాదం సర్వసమస్యా పరిష్కార మార్గంగా ప్రచారం చేయబడింది. దీన్ని జాతీయవాదంకన్నా ఎంతో మంచి దానిగా ప్రచారం సహజంగా చేశారు.
కాని, కొంచెం పరిశీలించి చూస్తే, రెండు జాతులయొక్క, లేక రెండిటికి మించిన జాతులయొక్క పరస్పర సంబంధాల్ని గురించి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ’ మంటాము. కాబట్టి అంతర్జాతీయ వాదానికి కూడా పునాది ‘జాతి’ అని తేలుతుంది.

జాతీయవాదం పెట్టుబడిదారీ విధానం మీద ఆధారపడి వుంటే, అంతర్జాతీయ వాదం సోషలిస్టు ఆర్థిక వ్యవస్థమీద, అంటే, పెట్టుబడిదారీ విధాన నిర్మూలనమీద ఆధారపడి ఉంటుంది. మన అనుభవంలో, జాతీయవాదం యెంత యుద్ధోద్ధతి వాదంగా వుందో, అంతర్జాతీయ వాదం కూడా అట్లాగే ఉంది.

పెట్టుబడిదారీ విధానం క్షీణదశకు రాగానే దౌర్జన్యయుతంగా తన స్థితిని స్థిమితం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ దౌర్జన్య స్వరూపాన్నే ఫాసిజం అంటారు. అంటే, దుడుకుగా వున్న జాతీయవాదం ఫాసిజమన్నమాట. ఫాసిజం నియంతృత్వమని మనకందరకూ సిద్ధాంత రీత్యానేగాక,  అనుభవంతో కూడా తెలుసు. నియంతృత్వం తప్పనిసరిగా నిరంకుశంగా ఉంటుంది. అయితే, ఫాసిజం కలవారి నియంతృత్వం పై వర్గాల నియంతృత్వం.

సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ కూడా సమస్యలు సరిగా పరిష్కరించలేకపోయింది. ఆ పరిష్కార మార్గానికి కూడా ఒక విధమైన నియంతృత్వం కావాలని మార్క్సు మొదలు స్టాలిన్ వరకూ ప్రవచించి, ప్రచారం చేస్తూనే వచ్చారు. కాని ఆ నియంతృత్వం శ్రామిక నియంతృత్వం – అంటే, క్రింది వర్గాల నియంతృత్వం, నియంతృత్వం ఏదైనా  నిరంకుశత్వమేగదా!
అందువల్ల, యిటు జాతీయవాద పరిపాలనా విధాన క్రమం, అటు అంతర్జాతీయ వాద పరిపాలనా విధాన క్రమం నియంతృత్వం మీద ఆధారపడిగానీ, నియంతృత్వానికి దారితీస్తూ గాని ఉన్నాయి. అందువల్ల జాతీయ వాద దృష్ట్యా గానీ నియంతృత్వం గనుక నిరంకుశ రాజకీయ విధానాలు, అందువల్ల “దేశ” దృష్టితో వున్నా, “వర్గ” దృష్టితో వున్నా గ్రాహ్యం కాదని హ్యూమనిజం అంటుంది.

హ్యూమనిజం తన నిర్మాణ విధానాలకు జాతీయవాదం మాదిరిగా “దేశాన్ని”గాని, అంతర్జాతీయ వాదం మాదిరిగా “వర్గాన్ని”గానీ ప్రాతిపదికగా అంగీకరించదు. దేశం పేరుతో వర్గాన్నేగాక వ్యక్తినీ జాతీయవాదం, వర్గం పేరుతో దేశాన్నేగాక ‘వ్యక్తినీ’ అంతర్జాతీయవాదం – భంగపరుస్తున్నాయని హ్యూమనిజం వాదిస్తుంది. అందువల్ల దేశాన్నిగాని, వర్గాన్నిగాని కాకుండా ‘వ్యక్తిని’ నిర్మాణ విధానాలకు ప్రాతిపదికగా అంగీకరిస్తుంది. వ్యక్తి వికాసం, వ్యక్తి భద్రత, వ్యక్తి స్వేచ్ఛలేని జాతీయతా, అంతర్జాతీయతా పనికిరావంటుంది. అందువల్లే జాతీయవాదంగా గానీ, అంతర్జాతీయవాదంగా గానీ కాక – “మానవ వాదంగా” హ్యూమనిజం ఆచరణలోకి రావటానికి కృషి చేస్తుంది.

దేశంకన్నా, వర్గంకన్నా ముందు “మానవుడు”, సర్వానికీ మానవుడే అధినేత. తాను అధినేతగా ఉన్న సర్వానికీ తననే ప్రాతిపదికగా తేవటానికి కావలసిన సామగ్రిని, పరిజ్ఞానాన్ని, వాతావరణాన్ని యివ్వటానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సమస్యలన్నిటినీ యీ దృష్ట్యా పరిష్కారం చేసుకోవాలని కోరుతుంది.  

14, జనవరి 2011, శుక్రవారం

హ్యూమనిజం -2


 M.N.Roy



హ్యూమనిజం ఎందుకు వచ్చింది?


హ్యూమనిజం ఒక ఫిలాసఫీ, ఒక తత్వం, ఒక సిద్ధాంతం. అందువల్ల మానవుని జీవితంలో అన్ని రంగాలకూ సంబంధించి, సమగ్రమైన దృక్పథాన్ని యిస్తుంది. ఆ సమగ్ర దృక్పథం యెట్లా వుంటుందో నిర్వచనం చేయక పూర్వం నేటి పరిస్థితులు, సిద్ధాంతాలు హ్యూమనిస్టు సిద్ధాంత అవతరణకు యేవిధంగా కారణభూతాలో, ఆయా సిద్ధాంతాలు యెందువల్ల అసమగ్రంగా వుండిపోయి నేటి పరిస్థితులకు అనుకూలించక పోతున్నాయో కూలంకషంగా చర్చించి, అవగాహన చేసుకోవాలి.

సమకాలిక ప్రపంచాన్ని నాల్గు దిక్కులా పరికించి చూస్తే ఒక వైపు నుంచి కమ్యూనిజం, యింకో వైపునుంచి పెట్టుబడిదారీ విధానం, వీటికి మధ్యేమార్గంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనబడుతున్నాయి. ఎవర్ని చూచినా మావల్లే, మా మార్గంవల్లే అన్ని సమస్యలూ పరిష్కారం కావాలి, లేకపోతే యీ విషమ పరిస్థితి సనాతనంగా వుండిపోవలసిందే అంటారు.

మొత్తం మీద నేటి పరిస్థితులు విషమంగా వున్నవని అందరూ అంగీరిస్తారు. ఉన్న సిద్ధాంతాలు యేవేవో మార్గాలు చూపిస్తున్నాయి. ఈ సిద్ధాంతాలు, మార్గాలే నేటి పరిస్థితికి కారణమని విజ్ఞులంతా క్రమేణా గ్రహిస్తున్నారు. ఈ విధంగా యెంత ఎక్కువ మంది గ్రహించి తొందరగా ముందుకు రాగలిగితే, అంత తొందరగా ఈ విపత్తునుంచి – నేటి నాగరికతకు సంబంధించిన ఈ విపత్తు నుంచి మానవ సమాజం బయటికి రాగలదు.

మానవునిలో ఒక సహజ గుణం కనబడుతుంది. మానవుడు ప్రాయికంగా హేతువాది అని మనం అందరం వెంటనే అంగీకరించకపోయినా, మానవుడు మారాలన్నా, భావాల్ని మార్చుకోవాలన్నా గురుత్వాన్ని వదులుకోవాలన్నా చాలా కష్టమనీ, యెంతో బలవంతం మీద గానీ మారడనీ మనలో చాలామంది అంగీకరిస్తారు. మన అనుభవానికి కూడా ఇది దగ్గరే! అంటే, మానవుడు సహజంగా కొంత సనాతనవాదిగా కనబడతాడు.

అందువల్లే – సిద్ధాంతం పాతదైనా, పరిస్థితులు మారినా మార్పు రానిదే మనటం కష్టమైనా,యీ సిద్ధాంతాల వెంట మనవాళ్లు అంతతొందరగా మారరు. సిద్ధాంతాలు మత్తు మందుగా పనిచేసేది యీ గుణాన్ని అనుసరించే. పందొమ్మిదవ శతాబ్ద ప్రారంభం నుంచీ పెట్టుబడిదారీ విధానం విస్తరించ నారంభించింది. దానిని రాజకీయ సిద్ధాంతంగా “లిబరల్ ప్రజాస్వామ్యం”యెదిగివచ్చింది.రాజకీయంగా మానవులందరూ ఒకటే అన్న ప్రధాన సూత్రమే లిబరల్ సిద్ధాంతానికి జీవగర్ర. అందుకనే ‘తలా ఒక వోటు’ అన్న నినాదాన్ని ఆనాటి లిబరల్ సిద్ధాంతకారులు లేవదీశారు. దీనికి ఆర్థిక అనుబంధంగా ‘స్వేచ్ఛా వ్యాపారం’ అన్న సూత్రాన్ని ప్రతిపాదించారు. ‘ఎవడి ఓపిక కొద్దీ వాడు’ ప్రయత్నం చేసుకోవటంగా భావించారు. స్త్రీ పురుష సమాన ప్రతిపత్తీ యిందులోనుంచే వచ్చింది. సాంఘికంగా ‘వ్యక్తి తాహతునుబట్టి గౌరవం’ అన్న పద్ధతి చలామణిలోకి వచ్చింది.  లిబరల్ ప్రజాస్వామ్య సిద్ధాంతమే రానురాను పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతంగా వ్యాప్తిలోకి వచ్చింది. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికరమైన పాత్ర నిర్వహించినన్నాళ్ళూ లిబరల్ ప్రజాస్వామ్యం సజావుగానే నడిచింది. ఆర్థిక రంగంలో క్లిష్టత యేర్పడేసరికి, ఇతర రంగాల్లో కటకట సాగింది.

1914-18 యుద్ధంనాటికి, ముఖ్యంగా యుద్ధాంతంతో లిబరల్ ప్రజాస్వామ్యం నైతికంగా గూడా యూరప్.లో చావు దెబ్బతిన్నది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గుడుగుడు గుంచంలో బడింది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించి, బాధ్యతారహిత ప్రజాస్వామ్య విధానాన్ని త్యజించి, మార్గాన్ని శోధించాను. సంఘాన్ని రక్షిస్తాను. విప్లవ రక్తపాతాలు లేకుండా చేస్తానని ‘ఫాసిజం’ తలెత్తనారంభించింది.

పెట్టుబడిదారీ విధానాన్ని దుబారించి, దోపిడీ విధానాన్ని ఆపివేసి, ప్రజాస్వామ్యంలోని మెత్తదనాన్ని కడిగివేసి, సంఘాన్ని రక్షిస్తాను, జనాన్ని మన్నిస్తానని ‘కమ్యూనిజం’ రష్యానుండి రంకెలు మొదలుపెట్టింది.

1918 నుంచి – 1939లో ద్వితీయ ప్రపంచ సంగ్రామం మొదలుపెట్టబడేంత వరకూ ఏ దేశ చరిత్ర జూచినా – ఏ మూల కథవిన్నా – ప్రజాస్వామ్య సిద్ధాంతాల దిగజారుడు, కొన్ని దేశాల్లో ఫాసిజం రేగటం, కొన్ని దేశాల్లో కమ్యూనిజ తలెత్తటం కనబడుతుంది. సిద్ధాంతాలు రాద్ధాంతాలుగా చేయబడి, రాద్ధాంతాలు సిద్ధాంతాలుగా  చిత్రింపబడిన రోజులు, మానవకోటి తన చరిత్రలో ఎన్నడూ కనీవినీ యెరుగనంతగా సిద్ధాంతాల తర్జనభర్జనలు, రగడలు, ప్రచారాలు, అపచారాలు రేగిన రోజులు, మానవకోటి చూస్తూ చూస్తూ మారణ హోమాలకు, సిద్ధాంత యుద్ధాలకు, దేశాల నులిమివేతకు తయారౌతున్న రోజులు, ‘బలము గలవాడిదే రాజ్యం, కండగలవాడే మనిషి’గా ఇటు ఫాసిజం, అటు కమ్యూనిజం రాటు తేరుతున్న రోజులవి.
ఈ రెండు భయానక శక్తుల మధ్యా ఉక్కిరిబిక్కిరి అయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలు గిజగిజ కొట్టుకొంటూ, తమ మొగ్గును ‘ఫాసిజం’ వైపుకే తేల్చుకున్న రోజులవి.

“ఆడవాళ్లకు పిల్లల్ని కనటం ఎంత స్వభావసిద్ధమో, ఫాసిస్టు దేశాలకు యుద్ధం చేయటం అంత స్వభావసిద్ధమని” ముసోలినీ ప్రవచించే రోజులు. “అంతర్జాతీయ కార్మికులారా, ఏకముకండి – మీకు పోయేదేమీ లేదు” అంటూ వర్గపోరాటాన్ని పెంపరికం చేయటానికి కమ్యూనిజం కాట్లాడే రోజులవి. ఇటు ఫాసిజంకాని, అటు కమ్యూనిజంకాని రెండూ యుద్ధవాదాలే, పై వర్గాన్ని సమీకరిస్తుంది ఫాసిజం, క్రింది వర్గాల్ని సమీకరిస్తుంది కమ్యూనిజం. ఫాసిజంలో నాయకత్వం పై వర్గాలకే ఉంటుంది, కమ్యూనిజంలో క్రింది వర్గం పేరుతో మధ్యతరగతివాళ్ళకుంటుంది.

ఈ రెండు బలాలు 1939 మొదలు 46 వరకు మారణ హోమాన్ని, నిత్యాగ్ని హోమాల్ని సాగించినై, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలు యుద్ధానంతరం నలిగిపోయి, శల్యావశిష్టంగా యుండి యుద్ధ వ్యతిరేకతవల్ల తప్ప మార్గం లేదన్న ధోరణిలో పడినై.

రష్యా రెండవ ప్రపంచ యుద్ధానంతరం, తనంత తాను బలీయంగా తయారు కాకపోయినా, అనుకూల పరిస్థితులవల్ల బ్రహ్మాండ శక్తిగా నిలిచింది. దీనికి యెదురుగా, అమెరికా, పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధిగా, పెత్తందారుగా నిలిచింది. రెండూ జనస్తోమత, ఆర్థిక సంపద బలీయంగా గల దేశాలే.

ఇంగ్లండు, పశ్చిమ యూరపు దేశాలు వీళ్ల సహాయం లేక బతక వీలులేని స్థితిలో చిక్కినై. ఈ కూటాన్ని యుద్ధ వ్యతిరేకత కూటంగా భావించవచ్చు. వీళ్ళు అమెరికా పెట్టుబడిదారీ విధానాన్నీ అంగీకరించరు. రష్యా కమ్యూనిస్టు నియంతృత్వాన్నీ సహించరు. వీళ్ళ పూర్వ సంప్రదాయాలుగాని, విజ్ఞానం గానీ  ఈ రెండు మార్గాల్లో దేనినీ బలపరచదు. రష్యా అమెరికాలు యుద్ధ దేశాలు. ఈ పశ్చిమ యూరపు దేశాలు యుద్ధ వ్యతిరేక దేశాలు. కానీ, ఆర్థిక సహాయాన్ని అపేక్షించి,రష్యా చేయని సహాయం అమెరికా చేస్తే, దాన్ని స్వీకరించినై.  ఈ దేశాలు స్థిమితంగా వుండి, బాగా తేరుకుంటే అసలు యుద్ధమే రాకుండా పోవచ్చు. లేకపోతే యుద్ధం తప్పకపోవచ్చు.

ఫాసిజం యుద్ధం తెచ్చిపెట్టిందని కమ్యూనిజం అంటుంది. లేనిగొడవలు తెచ్చి, తీరని పోరాటం పెట్టి యుద్ధాన్ని ప్రకోపింప జేసింది. కమ్యూనిజమే అని ఫాసిజం అంటుంది. ఏదైనా దూరంగా నుంచుని మన చుట్టూ జరిగే విధానాల్ని పరిశీలించి చూస్తే – పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించినట్టు కనబడ్డా, యుద్ధాల్లో దించి అసలుకే మోసం తెచ్చింది ఫాసిజం. ప్రజలకు శాంతీ తిండీ తెస్తానని బయలుదేరిన కమ్యూనిజం కూడా శాంతి తేలేకపోయింది. యుద్ధాల్నీ దోపిడీనీ ఆపలేకపోయింది. తానూ దోపిడీ చేస్తూనే వుంది. ప్రజలు భ్రాంతిపడ్డారు. తీరా చూస్తే, కమ్యూనిజంగూడా నేతిబీరకాయలోని నేతిలాగా తయారైంది.

ప్రజలకు దారీ తెన్నూ లేకుండా పోయింది. పూర్వపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలు 1914 నుంచి దిగజారుతూ,  ఈ యుద్ధం తర్వాత గూడా, సరిగా కోలుకోలేదు. వాటికి తగిన సిద్ధాంతబలం దొరకలేదు. ఫాసిజం యూరపు నుంచి పోయి అమెరికా ఆసియాలకు ప్రాకింది. రష్యా జాతీయవాదంలో కూడా దూరి కమ్యూనిజాన్ని దేశభక్తికీ, దేశభక్తిని కమ్యూనిజానికీ తాకట్టు పెట్టిస్తూ రగడగా తయారైంది. జనానికి మోక్షం లేదా ఏమి అన్న నిస్పృహతో దీనస్థితి ఏర్పడింది. 1939 యుద్ధానికి పూర్వం చేసిన యుద్ధ ప్రయత్నాలకు వందల రెట్లు ప్రయత్నాలు సాగుతున్నాయి. యుద్ధమే వచ్చి ఆటంబాంబులతో ప్రారంభమైతే, దేనితో అంతమౌతుందో, మానవకోటి ఏమౌతుందో, మానవ నాగరికత ఏమయిపోతుందో ఊహించటానికి వీలుగా లేకుండా పోయింది.

ఈ స్థితిలో ఇక యుద్ధోదతి తప్ప మార్గం లేదా? మానవకోటికి మోక్షం లేదా? నాగరికతకు రక్షణ లేదా? అంతా భస్మీపటలం కావలసిందేనా? మానవుడు మానవుణ్ణి రక్షించుకోలేడా? అన్న ప్రశ్నలు ప్రతి నాగరికునికీ రాకతప్పదు. ఆ ప్రశ్నలే వేసుకుని, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మేధాసంపన్నులు, వివిధరీతుల సమాధానాలు ఇస్తూ ఉన్నారు. అటువంటి ప్రశ్నలే లేవదీసి,          నాటికి మన దేశంలో యం.యన్.రాయ్, రాడికల్ హ్యూమనిస్టులు కొన్ని సమాధానాలిచ్చారు. వారి ప్రయత్న ఫలితమే రాడికల్ హ్యూమనిజం. ఈనాటి సాంఘిక వ్యవస్థలో రేగిన ప్రశ్నలకు వచ్చిన అడ్డంకులకు – మానవుడు వివిధ రంగాల్లో పొందిన విజ్ఞానాన్ని తరవెళ్ళు వేసి, నిగ్గుతేల్చి – సంజాయిషీ ఇచ్చి, మానవాభ్యుదయానికి మరో మార్గాన్ని చూపారు. అదే హ్యూమనిస్టుల కృషి.  ఈ యుద్ధంవల్లా తర్వాతి కథవల్లా వారు నేర్చిన గుణపాఠాల సారాంశమిదే. మానవునికి నవ్యమార్గాన్ని చూపి, అతడినే సర్వానికీ కేంద్రంగా పరిగణిస్తుంది గనుక – “నవ్యమానవవాదం”గా వ్యవహరింపబడుతుంది. అందుకే దాన్ని ఇంగ్లీషులో “హ్యూమనిజం” అన్నారు. ఇదీ – హ్యూమనిస్టు ఉద్యమం అవతరించిన కథ.

(ఇంకా ఉంది)

11, జనవరి 2011, మంగళవారం

హ్యూమనిజం -1


హ్యూమనిజం (వ్యాస సంపుటి)

ఆవుల గోపాలకృష్ణమూర్తి

కృతజ్ఞత

ఈ వ్యాస సంపుటిలో మొదటి నాలుగు వ్యాసాలు 1949లో తెలుగు స్వతంత్రలో ప్రచురితమైనవి. అవి పునర్ముద్రించటానికి అనుమతించిన గోరాశాస్త్రిగారికి, ముఖచిత్రం వేసిన గోలి శివరాంగారికి ధన్యవాదాలు. మిగిలిన వ్యాసాలు 1961 వేసవిలో చీరాలలో జరిగిన అధ్యయన శిబిరోపన్యాసాల కూర్పు. ఈ చిన్న పుస్తకానికి గోరాశాస్త్రిగారి కర్తవ్యప్రబోధం లభించినందుకు గర్విస్తున్నాం.

ఎం. శ్రీరామమూర్తి
ఎన్. ఇన్నయ్య

ఇందులో

నిజమైన అభిమానులకు
హ్యూమనిజం ఎందుకు వచ్చింది
హ్యూమనిస్టుల దృక్పథం ఏమిటి
హ్యూమనిజం మార్క్సిజం
హ్యూమనిజం – గాంధీజం
హ్యూమనిస్టు యేలుబడిరీతులు
ఎం.ఎన్.రాయ్ శాస్త్రీయ పరిణామం
సమకాలీన రాజకీయ సిద్ధాంతాలు
ఆవుల గోపాలకృష్ణమూర్తి – (స్కెచ్)



నిజమైన అభిమానులకు

పీఠాధిపతిగా ప్రకాశించడానికి కావలసిన సాధన సంపత్తి అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా స్వేచ్ఛా మేధావిగా, జిజ్ఞాసువుగా జీవితాంతమూ గడపడమూ, గడపడమేగాక అందులోనే సంతృప్తిని అందుకోవడమూ స్వర్గీయ ఆవుల గోపాలకృష్ణమూర్తిగారి ఉత్తమ సంస్కారానికి తిరుగులేని నిదర్శనం.  

పీఠాలను తమకు తామే బనాయించి, సగర్వంగా అధిష్ఠించి భక్తమండలిని చేర్చి తద్వారా దేశాన్ని విపరీతంగా ఉద్ధరిస్తున్నట్లు సంతృప్తిగా నిట్టూరుస్తుండడం తెలుగునాడులో ఆధునిక అభ్యుదయవాదుల సంప్రదాయం, వాళ్ళకు భక్తమండలి వినా మిత్రమండలి అక్కరలేదు. ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు “భక్తమండలి సమీకరణ సూత్రాన్ని తృణీకరించారు. అది ఆధునిక సంప్రదాయానికి విరుద్ధం. పాత సంప్రదాయాలను కూడా నిర్భీతంగా వ్యతిరేకించారు. పెక్కుమందికి ఆయనతో అక్కడే చిక్కువచ్చింది. ఏ విలువలకోసం ఆయనపాటుబడినట్లు? ఏదో ఒక సంప్రదాయానికి కట్టుబడాలిగాని అన్నింటినీ తృణీకరిస్తే ఎలా?

అందుకే యిప్పుడాయన మీద ఒకరకంగా కసి తీర్చుకుంటున్నారా అనిపిస్తుంది. జీవన్మనుష్యకోటి మధ్య ఉన్నంతకాలం ఎవరూ ఆయనను హక్కు భుక్తం చేసుకోలేకపోయారు. తమ కుటుంబీకుడేనని సంకుచితమైన ముద్రవేయలేకపోయారు. సహృదయులకు, జిజ్ఞాసువులకు ఆయన అకాలమరణం కలిగించిన బాధకంటె ఆయన స్మృతికి శ్రద్ధాంజలి పేరిట జరుగుతున్న ఆయనను స్వంతం చేసుకుని గోపాలకృష్ణమూర్తిగారి మూల ఆశయాలనే వమ్ము చేస్తున్నారు.

ఆయన ఏమిటి? ఆయన మూల ఆశయమేమిటి? అని ప్రశాంతంగా ప్రశ్నించినా, మూడు ముక్కల్లో సమాధానం చెప్పడం కష్టం. హేతువాది అనీ, మానవతావాది అనీ, నిరీశ్వరవాది అనీ, “రాడికల్ హ్యూమనిస్టు” అనీ ఏవేవో చెప్పవచ్చు. అవన్నీ కలిపినా అసమగ్రంగానే ఉంటుంది. రేషనలిస్టుల సిద్ధాంతాలు, ఎమ్.ఎన్.రాయ్ హ్యూమనిజం, వాటి ప్రభావం ఆయనపై అమితంగా ఉండవచ్చు. వాటిని ధ్యేయాలుగా తీసుకుని, మనసారా విశ్వసించి వాటి ప్రచార క్షేత్రంలో ప్రముఖపాత్ర వహించి అవిరళంగా కృషిచేసి ఉండవచ్చు.

ఐనప్పటికీ గోపాలకృష్ణమూర్తిగారు స్వేచ్ఛా భావుకుడు, వస్తుతహా నిశితమైన మేథావి. నిరంతర సత్యాన్వేషి. ఆయన మేథస్సు ఒక ఘట్టందాకా వచ్చి అక్కడ ఘనీభవించి పోలేదు. నిత్యపల్లవ శీలంగా వికసించేది. నిన్నటి ఆదర్శం నేటి అనర్థం. నేటి ఆశయం రేపటి అనర్థం కావచ్చు. ఆ సత్యాన్ని గ్రహించిన మనీషి. అందువల్ల ఏదో ఒక మూసలో యిమడిపోయి కాలక్షేపం చేయడం ఆయన మన.... ప్రవృత్తికే విరుద్ధం.

ఆ సత్యం ఆయన రచనల్లో స్ఫుటంగా కనబడుతుంది. ఆయన సంభాషణలలో, ఉపన్యాసాలలో స్పష్టంగా ప్రతిఫలించేది. ఆయనలో పెక్కు వ్యక్తిత్వాలు లేవు. అంతర్గతమైన వస్తుతత్వాన్ని ఎన్నడూ దాచుకోలేదు. “నేను పీఠాధిపతిని! ఎంత బాగా చెపుతున్నానో వినండి. నా ఘనతను గ్రహించండి” అనే భంగిమ ఆయనకు అసహ్యం. ఆలోచనలను చంపివేయడం కాక, ఆలోచనలను పురికొల్పడం ఆయన లక్ష్యం.

అందుకే ఆయన తన గురించీ, కీర్తి సముపార్జన గురించీ ఆలోచించకుండా, కేవలం జిజ్ఞాసువుగా, మేథావిగా, రచయితగా కృషిచేసి రాష్ట్రంలో నవచైతన్యం, భావ విప్లవం కలిగించడానికి యత్నించారు. ఎందరినో అవ్యాజంగా ఆకర్షించారు. స్వయంప్రతిభ ఉండి ఆత్మవంతుడైన ప్రతివ్యక్తికీ కొందరు ప్రత్యర్థులుంటారు. తీక్షమైన మేథాశక్తికి అదొక నిదర్శనం.

స్ఫురద్రూపం, స్నేహభండ హృదయం, నిండైన మానవత్వం, ఉత్తమ సంస్కారం- యిన్ని అపురూప గుణాలు మూర్తీభవించిన గోపాలకృష్ణమూర్తిగారు అకాల మృత్యువు వాతబడడం ఆంధ్రదేశపు దురదృష్టం. స్నిగ్ధ హృదయుడైన మేధావిని తమ వాడిగా హక్కుభుక్తం చేసుకోవాలనే కొందరి సంకుచిత ప్రయత్నం నెగ్గితే అది మరీ దురదృష్టం. రెండవ పరిణామాన్ని నివారించి సత్యాన్వేషులతో, మేథావి వర్గాలతో ఆయన బాంధవ్యాన్ని మన్నించి తద్విధంగా శ్రద్ధాంజలి ఘటించడం నిజమైన అభిమానుల కర్తవ్యం.
గోరాశాస్త్రి
(సశేషం)

8, జనవరి 2011, శనివారం

ఆవుల గోపాలకృష్ణమూర్తి

AGK last on right sitting, with M N Roy and Ellen in the middle
Jampala Syamsunder next to AGK
Meka Chakrapani among standing 4 from left





వ్యాసోపన్యాసక ఎ.జి.కె (1917-1966)

సాహిత్యంలో ఔచిత్యం వుండాలనేది ఆవుల గోపాలకృష్ణమూర్తి గట్టి అభిప్రాయం. ఆ దృష్టితోనే విశ్వనాధ సత్యనారాయణ మొదలు ప్రాచీన కవుల వరకూ తన విమర్శకు గురిచేశాడు. కవులు, రచయితలలో ఆవుల అంటే విపరీతాభిమానం గలవారు, తీవ్రంగా భయపడేవారు. రెండు వర్గాలుగా వుండేవారు. భయపడిన వారిలో విశ్వనాథ సత్యనారాయణ ప్రధముడు. ఆవుల వుంటే ఆ సభ కు విశ్వనాథ వచ్చేవాడు కాదు. వేయి పడగలు మొదలు రామాయణ కల్పవృక్షం వరకూ వుతికేసిన ఆవుల అంటే భయపడడం సహజం.

1941 ప్రాంతాలలో ఎజికె గాంధీజీ పై తీవ్ర విమర్శలతో కూడిన వ్యాసం ప్రచురిస్తే, ఎం.ఎన్. రాయ్ పక్షాన ఆంధ్రలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడుగా వున్న అబ్బూరి రామకృష్ణరావు అదిరిపడ్డాడు. ఎం.ఎన్. రాయ్ కు ఫిర్యాదు చేశాడు. కాని రాయ్ వ్యాసంలో విషయం తెలిసి ఎజికెని సమర్ధించాడు.

ఎ.జి.కె. ఎం.ఎ.ఎల్.ఎల్.బి. చదివి అడ్వొకేట్ గా తెనాలిలో ప్రాక్టీసు చేశారు. తెలుగు, ఇంగ్లీషు సాహిత్యం రంగరించి వడపోసారు. కవులను, సాహితీ పరులను ఎజికె ఎంతగా ఆకర్షించారో చెప్పజాలం. ఏ మాత్రం పలుకు వున్న దన్నా ఎంతో ప్రోత్సహించేవారు. సాహిత్య వ్యాసాలు కొద్దిగానే రాసినా, ఉపన్యాసాలు చాలా చేశారు. కవులను ప్రోత్సహించారు. రాయించారు.
ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా ఎ.జి.కె. ఆంధ్రలో ప్రధాన పాత్ర వహించారు. సొంత ఖర్చులతో పత్రికలు, రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, నడిపారు. ఇంగ్లీషు పత్రికలకు రాశారు. మానవవాద, హేతువాద ఉద్యమాలు తీవ్రస్థాయిలో నడిపించారు.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి నోట్లో అతి సామాన్యమైన పలుకు కూడా మాధుర్యం సంతరించుకుంటుందని మూల్పూరుకు చెందిన (ఎ.జి.కె. గ్రామం) వెనిగళ్ళ వెంకట సుబ్బయ్య అనేవారు.

1955 నుండీ ఎజికెతో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడింది. గుంటూరు ఎ.సి. కాలేజీలో చదువుతూ ఆయన ఉపన్యాసాలు ఏర్పరచాము. సాహిత్యంలో ఔచిత్యం అనే ఉపన్యాసం యివ్వగా, స్ఫూర్తి శ్రీ (బాస్కరరావు లెక్చరర్) రాసి, ఆంధ్ర పత్రికలో ప్రచురించారు. అది వాదోపవాదాలకు దారి తీసింది. అందులో నన్నయ్య ఆది పర్వం నుంచి అనేక మంది కవుల అనౌచిత్యాలను ఎజికె. విమర్శించారు.
పెళ్ళి ఉపన్యాసాలు కూడా ఎ.జి.కె. అద్భుతంగా చేసేవారు. సంస్కృత మంత్రాలు లేకుండా తెలుగులో అందరికీ అర్ధమయ్యేటట్లు ప్రమాణాలు చేయించి, వివరణోపన్యాసం చేసేవారు. అలాంటివి నేను ఎన్నో విన్నాను.
నా వివాహం 1964లో ఆయనే తెనాలిలో చేయించారు. ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు.
ఎ.జి.కె. పెళ్ళి ఉపన్యాసాలంటే అదొక సాహిత్య వ్యాసం అనవచ్చు. ప్రతి చోట ప్రత్యేక పాయింట్లు చెప్పేవారు.
ఎజికె చేత ఎందరో రచయితలు కవులు పీఠికలు రాయించుకున్నారు.

కొల్లా శ్రీకృష్ణా రావు
రారాజు
కావ్యానికి సుదీర్ఘ పీఠికలో ఎజికె నిశిత భారత పరిశీలన చేశారు.
వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య తెలుగు పుస్తకానికి ఇంగ్లీషులో సుదీర్ఘ పీఠిక రాశారు. ఎందుకంటే, ఎజికె వాడుక భాష నచ్చదని, ఆయన అలా రాయించు కున్నారు. తెనాలి దగ్గర వడ్లమూడి గ్రామానికి చెందిన ప్రౌఢ కవి ఆయన సంస్కృత రచనకు తెలుగు అనుసరణ ‘భామినీ విలాసం’. కొండవీటి వెంకట కవి, రావిపూడి వెంకటాద్రి, గౌరి బోయిన పోలయ్య యిలా ఎందరో రాయించుకున్నారు. వెంకటకవి నెహ్రూ ఆత్మకథ రాయడానికి తోడ్పడ్డారు. వందలాది టీచర్లు ఆయన వలన ప్రేరేపితులయ్యారు.

ఇంగ్లీషులో శామ్యుల్ జాన్సన్, మాథ్యూ ఆర్నాల్డ్, ఆర్ జి ఇంగర్ సాల్, ఎరిక్ ఫ్రాం, ఎం.ఎన్. రాయ్, రచనలు ఎజికె యిష్టప్రీతికాగా, రవీంద్రనాథ్ కవితల్ని పులుముడు రచనలుగా విమర్శించాడు. బెంగాలీ మానవ వాదులకు యిది ఒక పట్టాన మింగుడు పడేదికాదు. ఎలవర్తి రోశయ్య చాదస్తంతో గ్రాంథిక వాదిగా నన్నయ తిక్కన వంటి వారిని అంటి పెట్టుకోగా, ఎజికె ఆయన్ను మార్చగలిగారు. కవిత అంటే చెవిగోసుకునే రోసయ్యకు త్రిపురనేని రామస్వామి సూతపురాణం పద్యాలు చదివి, పేరు చెప్పుకుండా ఆకర్షించారు. అది చదివి రోసయ్య చాలా మారారు. పిలక పెంచుకున్న రోసయ్యను మార్చడానికి, ఒక అర్థరాత్రి హాస్టల్ లో నిద్రిస్తున్న రోసయ్యకు పిలక కత్తిరించారు. ఏటుకూరి వెంకట నరసయ్య కృషివలుడు రచన ఎజికెకు యిష్టం. అత్తోట రత్నం మొదలు జాషువా వరకూ ఎజికె సందర్శకులే. దళిత ఉద్దరణలో భాగంగా కవుల్ని ప్రోత్సహించాడు.

ఎం.ఎన్. రాయ్ మానవ వాద రచనను సరళంగా తెనిగించారు. నాచుట్టూ ప్రపంచం అనే శీర్షికతో వాహిని వారపత్రిక (విజయవాడ)లో రాశారు 1956 ప్రాంతాల్లో. గుంటూరు నుండి వెలువడిన ప్రజావాణిలో రాశారు. చిన్న పత్రికలవారడిగితే ఎజికె అరమరికలు లేకుండా రాసేవారు. వివేకానంద భావాల్ని ఆలోచనల్ని షూటుగా విమర్శించిన ఎజికెపై ఆనాడు ఆంధ్రప్రభ, నీలం రాజశేషయ్య సంపాదకత్వాన ధ్వజమెత్తింది, 1964లో. కానిఎజికె వెనుకంజ వేయలేదు.

బుద్దునిపై విశ్వనాథ సత్యనారాయణ చేసిన అనౌచిత్య విమర్శలపై ఎజికె పెద్ద ఉద్యమం చేశారు. 1956-57లో పాఠ్యగ్రంథాలనుండి, బుద్ధుణ్ణి రాక్షసుడుగా చిత్రించిన భాగాలు తొలగించే వరకూ నాటి విద్యామంత్రి ఎస్.బి.పి పట్టాభి రామారావుపై విమర్శలు చేశారు. వి.ఎస్. అవధాని, ఎం.వి. శాస్త్రి, పాలగుమ్మి పద్మరాజు, పెమ్మరాజు వెంకటరావు, ఎ.ఎల్. నరసింహారావు మొదలైన వారెందరో ఎజికె సలహాలు పొందుతుండేవారు. కవులకు ఆయన యిల్లు యాత్రాస్థలమైంది.
ఎజికె ప్రతిభను గుర్తించిన అమెరికా ప్రభుత్వం 1964లో ఆయన్ను ప్రభుత్వ అతిధిగా పర్యటించమని ఆహ్వానించింది.
అమెరికాలో ప్రధాని జవహార్ లాల్ నెహ్రూను ఎజికె విమర్శిస్తే, నాటి రాయబారి బి.కె. నెహ్రూ బెదిరించి ఎజికెను వెనక్కు పెంపిస్తానన్నారు. కాని ఎజికె తన విమర్శనా వాద పటిమ తెలిసినవాడుగనుక జంకలేదు. సాహిత్యంలోనే గాక, కళలు, సంగీతంలో కూడా చక్కని విమర్శలు, పరిశీలనలు ఎజికె చేశాడు. శాస్త్రీయ దృష్టితో పరిశీలన చేశాడు. బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాడు.

ఎజికె తన ఆరోగ్యం పట్ల హేతు బద్ధంగా వ్యవహరించలేదు. గుండెపోటు వస్తే అశ్రద్ధ చేసి, కోర్టు కేసులు పడకలోనే పరిశీలించాడు. ఆ సందర్భంగా బొంబాయి నుంచి ఎ.బి.షా. (అమృత్ లాల్ భిక్కు బాయ్ షా-సెక్యులర్ ఉద్యమ నాయకుడు), నేనూ తెనాలి వెళ్ళి హెచ్చరించి, చికిత్స కై మద్రాసు వెళ్ళమన్నాం. అలా చేయలేదు. ఆటల్లో, పాటల్లో, నాటకాల్లో ఆసక్తి, ప్రవేశం గల ఎజికె కోర్టులలో వాదిస్తుంటే, అదొక ఆకర్షణీయ దృశ్యంగా వుండేది. ఇంటగెలవని ఎజికె రచ్చగెలిచాడు. ఎం.ఎన్. రాయ్ తో సుప్రసిద్ధ రచయిత చలంను, త్రిపురనేని రామస్వామిని కలిపినా, నిరాశేమిగిలింది. రాయ్ స్థాయిని వారందుకోలేక పోయారు.
కాని 50 ఏళ్ళకే 1967లో ఎజికె చనిపోయారు.

రచనలు :

నా అమెరికా పర్యటన, సాహిత్యంలో ఔచిత్యం (సాహితీ వ్యాసాలు), హ్యూమనిజం. నవ్యమానవవాదం (రాయ్ రచనకు తెలుగు), పుంఖాను పుంఖంగా ఇంగ్లీషు, తెలుగు వ్యాసాలు, పీఠికలు.

తెనాలి దగ్గర మూల్పూరు స్వగ్రామం. లక్నోలో చదువు. ప్రాక్టీసు తెనాలిలో, అమెరికా, యూరోప్ పర్యటన 1964లో.

-ఎన్.ఇన్నయ్య