ఆవుల గోపాలకృష్ణమూర్తి
1958లో ఎ.సి.కళాశాల గుంటూరు ఆంధ్ర భాషా సమితి నుద్దేశించి చేసిన ప్రసంగం
తెలుగు సాహిత్యం ప్రాఙ్నన్నయకాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో ఉజ్జ్వలంగా వుంది. అయితే మధ్య మధ్యలో కొన్ని దిగజారిపోయిన ఘట్టాలు లేకపోలేదు. సాహిత్యం సమాజానికి ప్రతిబింబం. “మీ సాహిత్యాన్ని మాకు చూపించండి. మీ జీవిత విధానాలను మీ ఆచార వ్యవహారాలను నేను చెబుతాను” అని ఠాగూరు అన్నాడు. అందువల్ల సాహిత్యంలో సమాజం ఎప్పుడైనా ప్రతిఫలించక తప్పదు. నవ్య సాహిత్యం చూస్తే 1900 దాటిన తర్వాత ప్రారంభమైనది అని బాగా చెప్పవచ్చు. ప్రారంభ కాలంలో శ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి వంటివారున్నారు. తరువాత నవ్య సాహిత్యం సంగతి, అభ్యుదయ, ప్రజా తెలంగాణా సాహిత్యాలు ఏర్పడ్డాయి. గత ఇరవై సంవత్సరాల్లోనూ సాహిత్యోత్పత్తి బాగానే జరిగింది. ఒప్పుకోవాలి. ఇందులోని ఔచిత్యాన్నిబట్టి చూస్తే సాహిత్యమేదో, సాహిత్యం కానిదేదో మనకు స్పష్టమౌతుంది.
“సాహిత్య ప్రయోజనం విశ్వశ్రేయస్సు అనుకొందాం. అప్పుడు విశ్వానికి శ్రేయస్సును కలిగించేవి ప్రాచీన సాహిత్యమంతటిలోను రెండు మూడు వందల గ్రంథాలు తేలుతాయి. పట్టుపట్టి కూర్చుంటే వీటిని నాలుగైదు మాసాల్లో చూడవచ్చు. తరువాత మన అభిమాన గ్రంథాలు అయిన వాటిని శ్రద్ధగా చదువుకోవచ్చు.”
“ప్రభుత్వం సాహిత్యానికి అండగా నిలవదు. సాహిత్యకులు ప్రజల ముందుకు రావాలి. తాము వ్రాసేది ప్రజలకు తెలిసేటట్లు చెయ్యాలి. అప్పుడే సాహిత్యానికి జీవనం వుంటుంది. పరిషత్తుల వంటివి పనిచేస్తాయి అనుకోవటం భ్రమ. వాటి అవసరం మనకు లేదు. పూర్వులకూ మనకూ అభిరుచులలో తేడా ఉంది. ఆనాటి వారికి తెలియని ఎన్నో విషయాలు ఈనాడు మనకు తెలుసు. అనేక రంగాల్లో ప్రసరించటంవల్ల మన పాండిత్యం పలచబడింది. పూర్వులకు మల్లే ఏ విషయంలోనూ మనకు కూలంకష పాండిత్యం లేదు. పూర్వం కంటే ఈనాడు రచయితల సంఖ్య బాగా పెరిగింది. రాజకీయాల్లో సంఖ్యా బలాన్ని బట్టి గుణబలం పెరుగుతుందని ఒక విశ్వాసం వుంది. కానీ, సాహిత్య విషయంలో ఆ విధంగా ఔతుందని నాకు నమ్మకం లేదు”“మంచి సాహిత్యానికి జనంతో నిమిత్తం లేదని పూర్వులూ, నవ్యులలో కొందరూ అన్నారు. అలా అనుకోడం అనుచితం. అంతకు ముందు ఒక్క చోటనే వున్నదనుకున్న చిక్కు సాహిత్యంలో కూడా ప్రవేశించింది. సినిమా రంగంలో అసూయ పెరిగి పెరిగి సాహిత్యంలో చోటు చేసుకుంది. ఇటువంటి సందర్భంలో కవిశేఖరులైన తిరుపతి వెంకటేశ్వరుల మార్గం అనుసరణీయం. వీరు సాహిత్యాన్ని దేశం ముందుకు తీసుకువచ్చారు. దేశమంతటిలోనూ పద్యమంటే అభిమానం కలగజేసింది వీరే. ఆంగ్లంలో చెప్పాలంటే వీరు కవిత్వాన్ని “డెమోక్రటైజ్” చేశారు.
“సాహిత్యానికి, జీవితానికి అవినాభావ సంబంధం ఉందని నా విశ్వాసం. సాహిత్యం లేకపోతే జీవితం లేదు. అయితే “సాహిత్యం తెలియకపోయినా కోటానుకోట్లు బ్రతుకుతూ వున్నారు కదా” అని కొందరు ప్రశ్నిస్తారు. నిజమే ప్రాచీనకాలంలో సాహిత్యం తెలియకపోయినా పురాణ శ్రవణంవల్ల ఆనాటి ప్రజలకు సాహిత్య పిపాస కలిగేది. సాహిత్య సౌందర్యాన్ని ఆరాధించ గలిగేవారు. ఈనాడు ఆ స్థానాన్ని రేడియోవారు ఆక్రమించుకున్నామని అహంభావపడుతున్నారు.కాని ఒకప్పుడు జాషువాగారు “పాడకమ్మ నీవు పాత పాట” అని రేడియోను సంబోధిస్తూ కొన్ని పద్యాలు చెప్పారు. అయితే ఈనాడు వారూ, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారూ, పింగళి లక్ష్మీకాంతంగారూ రేడియోలోనే పని చేస్తున్నారు. కాబట్టి పాతపాటల స్థితి మార్చి కొత్త కొత్త కార్యక్రమాలు అందజేస్తారని ఆశిద్దాం. ఏమైనా రేడియో పురాణ శ్రవణం స్థానాన్ని ఆక్రమించగలదని నాకు నమ్మకం లేదు.”
“వీలున్నన్ని చోట్ల సాహిత్య గోష్ఠులు జరగాలి. కాలేజి విద్యార్థులు సెలవు రోజులలో దగ్గరి ప్రదేశాల్లో సాహిత్య గోష్ఠులు జరిపించాలి. అప్పుడే సాహిత్యానికి రినైజాన్స్, ఇప్పుడు మన సాహిత్యం కొనేవాళ్ళు లేరు. అందులోనూ పద్య గ్రంథమైనవి అసలెవరూ చదువరు. “నీవు వ్రాసినది మంచి గ్రంథం” అని మెచ్చుకుంటేనే కవికి ఆనందం. అప్పుడే అతడు ఇంకా ఉత్సాహంతో కావ్యసృష్టి చెయ్యగలడు. ఇప్పుడు మనం సంధియుగంలో వున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలోనే నాలుగువందల మంది కవులైనా మన్నికతో వ్రాయగలవారున్నారు. ఈ ఆసక్తినంతటినీ చదువులోకి మార్చితే మంచి సాహిత్యం వస్తుంది. అప్పుడే ఔచిత్యం గురించిన ఆలోచన.”
“ప్రాక్పశ్చిమ సాహిత్యాలలో విమర్శ సాహిత్యం ఒక ప్రత్యేక స్థానాన్ని గణించుకున్నది. తెలుగులో మాత్రం ఇంచుమించుగా విమర్శ సాహిత్యం లేదనే చెప్పాలి. రామలింగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి నడకుదుటి వీర్రాజు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ ప్రభృతులు కొంత కాలం క్రితం విమర్శలు చేశారు. ఈనాడు పై మెట్టుకు వచ్చిన విమర్శకులు ఎవ్వరూ లేరు. శ్రీ హనుమంత రావు వంటివారు ఈనాడు మంచి విమర్శలే చేస్తూవున్నారు.”
“విమర్శకునికి బాగా కావ్యపఠనం కావాలి. మంచి సాహిత్యం కావాలి. కవికంటే కూడా విమర్శకునికి బాధ్యత ఎక్కువ. కవి ఊహను, సమాసాన్ని భేదించగల శక్తివుంటేనే విమర్శకుడు చేసే విమర్శ మంచి విమర్శ ఔతుంది. ఈనాటి యువకవులలో చాలామందికి కవితాశక్తి బాగావుంది. కానీ రచనలో కుదురు కనిపించటంలేదు. ఈ విషయాన్ని విమర్శకుడు స్పష్టంగా చెప్పి సరిదిద్దాలి. సాహిత్య గోష్ఠులలో కవులు పాల్గొనేటప్పుడు వాళ్ళతోపాటు విమర్శకులు కూడా వెళ్ళాలి. లేకపోతే నాలుగైదు గోష్ఠులలో పాల్గొన్న వెంటనే కవి గొప్పవాడినైపోయాననుకుంటాడు. అతడ్ని సవరించి మంచి మార్గాలలో పెట్టవలసిన బాధ్యత విమర్శకుడిది.”
“ఈనాడు వామపక్ష రాజకీయ సిద్ధాంతాలు వచ్చిన తరువాత సాహిత్యంలో కొత్త ప్రమాదం వచ్చింది. సాహిత్యం సాహిత్యంగా కాక రాజకీయ వాసనతో వస్తూవుంది. దానిని మనం గట్టిగా ప్రతిఘటించాలి. ప్రభుత్వం స్థాపించిన “అకాడమీ” నిజంగా వర్థిల్లితే రాజకీయపు ప్రమాదం మనకు గలుగవచ్చు. రష్యా దేశంలోనూ, ఇంకా ఇతర దేశాల్లోనూ ప్రభుత్వం సాహిత్యాన్ని ఆదేశిస్తుంది. ఇక్కడ కూడా అదే కావచ్చు. అప్పుడు మనం ఔచిత్యం అంటే శృంగభంగం అవుతుంది.”
“ఔచిత్య విషయంలో పెద్దకవులే తప్పులు చేస్తారు. కవికి జీవితశాస్త్రం కూడా రావాలి. నన్నయభట్టు వినత తన అండాన్ని చిదిపివేసినప్పుడు “ఉత్తరార్థకాయ సహితుండును అయిన అసురుడు పుట్టాడని” అన్నాడు. కాని పిండోత్పత్తి అట్లా జరగదు. మొదట ఉత్తరార్థం యేర్పడి తరువాత పూర్వార్థం ఏర్పడుతుందని ఆనాటివాళ్లు అనుకునేవారేమో! ఇది నన్నయ్యచేసిన ఔచిత్యభంగం, తెనాలి రామకృష్ణుడు నిగమశర్మ తల్లిదండ్రులను వర్ణిస్తూ, “వడవడవడకు వృద్ధులు” అని అంటాడు. కాని నిగమశర్మకు తమ్ములున్నారని, వాళ్ళు నేలలో వెడలని తమ్ముగుఱ్ఱాలని అంటాడు. ఆవార్థక్యానికి ఈ శిశువులకు సంబంధమా బుద్ధులు చెపుతూ శీలగుణోన్నతిగలిగిన విప్రకన్యలను సహస్రమయినా వరించి రమించమంటుంది. ఆ విధంగా చెప్పటమే ఔచిత్యభంగం, పైగా ఈ నిగమశర్మను శీలగుణోన్నతి కల్గిన కన్యలు ఎట్లా పెండ్లిచేసుకుంటారూ? చేసుకుంటే శీలగుణోన్నతి ఎక్కడ వుంటుంది? మెలకువలు ఔచిత్యంతో పోషణ చెయ్యటానికి శ్రద్ధకావాలి”
“నవ్యసాహిత్య నిర్మాతలలో ఒకరైన కందుకూరి శకుంతల నాటకంలో ‘అనాఘ్రాతం పుష్పం’ అనే శ్లోకాన్ని అనువదిస్తూ, వాసన చూడనట్టి ప్రసవమ్ము అని చివరంటా బాగా వ్రాసుకొచ్చాడు. కాని చివర ‘భుజింప విరించి వ్రాసెనో’ అని అనౌచిత్యానికి పాల్పడ్డాడు. తెలుగులో స్త్రీని భుజించటం అని అనరు. అది సంప్రదాయానికి విరుద్ధం. సంస్కృతంలో ఉన్న “భోక్తు” అనేదానికి భుజించుట అనువాదం. కేతన దశకుమార చరిత్ర వ్రాసి కవిబ్రహ్మ అయిన తిక్కన్నకు అంకితం చేశాడు. నాకావ్యాన్ని కవి బ్రహ్మ పుచ్చుకున్నాడు. ఇంక నా కావ్యం గురించి నేనెందుకు చెప్పుకోవాలి అని అన్నాడు. సౌందరనందంలో పింగళి కాటూరి “కేతనతోడి పొత్తునకు కాదని చెబుతూ తమ కావ్యమును తమ గురువైన వెంకట శాస్త్రిగారికి అంకితం చేశారు. తరువాత సీసపద్యం కేతన తిక్కన గురించి వ్రాసినదే. కొద్ది అక్షరాల మార్పులతో వీరూ వుపయోగించుకున్నారు. అంటే తమ గురువు తిక్కన అంతటివాడు. తాము మాత్రం కేతన అంతటి వాళ్ళు కాదని భావం. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ “అల నన్నయ్యకు లేదు తిక్కన్నకు లేదు” అని చెబుతూ తన గురించి, ఎక్కువగా చెప్పుకున్నాడు. అంటే నన్నయ్యకు తిక్కన్నకు తనవంటి శిష్యుడుంటే, చెళ్ళపిళ్ళ అంతటి వాళ్ళు అయ్యేవారన్నమాట. ఇది తప్పని అనటం లేదు. ఔచిత్యంలో అంతస్థులు యిలా వుంటాయి.”