15, మార్చి 2013, శుక్రవారం

AGK speical introduction to Koganti Radhakrishna Murthy`s articles of M N Roy


యమ్.యన్.రాయ్ వ్యాసాలు
పునరావృత్తం

ఈ గ్రంథం రాయ్ ఆంగ్లంలో వ్రాసిన కొన్ని గ్రంథాల నుండి సేకరింపబడిన వ్యాసానువాదం. లోగడ న్యాయాన్యాయాలు, ‘యమ్.యన్.రాయ్ వ్యాసాలు’ అన్న పేర్లతో వెలువరింపబడినవి. తిరిగి యేక సంపుటిగా ప్రచురింపబడినవి, చివరి భాగాల్లో కొన్ని చేర్పులు, కూర్పులు జరిగినవి.
2
నరేంద్రనాథ భట్టాచార్యుడు 1887 ఏప్రిల్ లో తల్లిగారి గ్రామమైన ఆర్బాలియాలో జన్మించాడు. తండ్రి దీనబంధు భట్టాచార్యుడు, తల్లి బసంత కుమారి, రాయ్ ద్వితీయ కళత్రపు నాల్గవ కాన్పు. బెంగాలులోని యిరువది నాల్గు పరగణాలనే జిల్లా అది. తండ్రి 1905లో, తల్లి 1908లో మరణించారు. అమెరికాలో లాలాలజపతిరాయ్ నరేంద్రభట్టాచార్య నామకరణాన్ని మానవేంద్రనాథరాయ్ (ఎమ్.ఎన్.రాయ్)గా మార్చాడు.
1901 నాటికే, తన 14వ యేట, రాయ్ హరికుమార్ చక్రవర్తి, అమరేంద్రనాథ్ చటర్జీ, జతీన్ ముఖర్జీలు నడుపు టర్రరిస్టు ఉద్యమంలో ప్రవేశించాడు. వివేకానందుని రచనలు చిన్నతనంలో రాయ్ ని ఆకర్షించినవి, బ్రహ్మబంధ్ ఉపాధ్యాయ రచనలు రాయ్ ని ఉత్తేజపరచినది. వినాయక సావర్కార్ మీద రాయ్ కి మోజు కలిగింది. తండ్రి మరణం, బెంగాల్ విభజన ఒకేసారి జరగడంతో రాయ్ తీవ్రంగా రాజకీయాల్లోకి దూకిపోయాడు.
కలకత్తాకు 12 మైళ్ళ దూరంలోని చింగిపోత అన్నచోట 1907లో రాయ్ నాయకత్వాన మొదటి లూఠీ జరిగింది. అరెస్టు చేయబడినా, పిల్లవాడని మేజిస్ట్రేట్ రాయ్ ని వదిలివేశాడు. బెంగాల్ విభజనోద్యమ ఫలితంగా ఏర్పడ్డ ‘జాతీయ కళాశాలలో’ ప్రవేశ పరీక్షా విద్యార్థి రాయ్. 1908 నుంచి 1915 దాకా రహస్య రాజకీయదళాల్లో విశేషంగా రాయ్ పాల్గొన్నాడు.
1910లో హౌరా కుట్రకేసులో  అరెస్టు కాబడినాడు. కేసు కొట్టి వేశారు. 1910లో ‘గార్డెన్ రీచ్’ దోపిడీ కేసులో తిరిగి అరెస్టు చేశారు. ఆ రోజుల్లోనే బ్రిటీషు వారిమీద తిరుగుబాటుకు, జాతీయస్థాయిలో కృషి ప్రారంభించాడు. జర్మనీ వారితో కలసి, ఆయుధాలు సంపాదించి, బ్రిటిష్ వారిమీద తిరుగుబాటుకు, స్వాతంత్ర్య సముపార్జనకు ప్రయత్నించాడు.
1915 ఏప్రిల్ లో రాయ్ ‘జావా’ వెళ్ళి, జర్మనీవారితో సంప్రదించి, ఆయుధాల్ని సేకరించ ప్రయత్నించాడు. 1915 సెప్టెంబరులో జతీన్ టెర్రరిస్టు దాడుల్లో మరణించగా, వుద్యమం దెబ్బతిన్నది.
రాయ్, యిది తెలిసి యిండియాకు తిరిగిరాక, చైనావెళ్ళి డా.సన్ యట్ సేన్ ను కలిశాడు. జపాన్ చేరాడు. ఇండియా విముక్తి వుద్యమానికి సహాయంకోసం ఆ ప్రాంతంలో తిరుగాడాడు. ఫాదర్ మార్టిన్ అను పేరుతో 1916లో అమెరికా చేరాడు. కాలిఫోర్నియాలో కొన్నాళ్ళు గడిపాడు. ఎల్ విన్ అన్న విద్యార్థిని కలిసి, ఆమెను తరువాత వివాహమాడాడు. ఆమె 1925-26 వరకు రాయ్ తో కలిసి వుంది.
అక్కడ తిరిగి జర్మనీయులతో కలిసి యిండియాకు సహాయం కోసం ప్రయత్నిస్తూ వుండగా, అమెరికన్ పోలీసులు రాయ్ ని అరెస్టు చేశారు. తప్పించుకొని మార్చి 1917లో మెక్సికోకి పరారయినాడు.
మెక్సికోలో సోషలిస్టు వర్గాలను కలసి, అధ్యక్షుడు కరంజాకు ఆంతరంగీకుడైనాడు. మార్క్సిస్టు సిద్ధాంతాల్ని పఠించి, స్పానిష్ భాషలో గ్రంథాల్ని వ్రాసి, 1919లో మెక్సికన్ సోషలిస్టు పార్టీ మహాసభాధ్యక్షుడైనాడు. బోరోడిన్ తో పరిచయం కలిగింది. 1919 ఆగస్టులో మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీని రాయ్ స్థాపించి, నవంబరులో వి.గ్రేషియా అన్నమారు పేరుతో లెనిన్ ఆహ్వానం మీద రష్యా ప్రయాణం కట్టాడు. మెక్సికోలో ఉండగా ‘ఎల్ హెరాల్డో’ అన్న స్పానిష్ పత్రికకు సంపాదకుడుగా వున్నాడు.
దారిలో జర్మనీలో ఆగి, అక్కడి కమ్యూనిస్టు పార్టీ పెద్దలయిన ఆగస్టు తాలిమీర్, హీన్ రిచ్ బ్రాండ్లర్, రోజాలగ్జంబర్గ్ గార్ల పరిచయం చేసికొన్నాడు. రష్యా చేరగానే, ద్వితీయ ప్రపంచ కాంగ్రెస్లో మాస్కోలో 1920 ఆగస్టులో ప్రధాన పాత్రవహించాడు. ‘వలస రాజ్య కమీషన్’లో సభ్యుడైనాడు. రాయ్ కి లెనిన్ తో అభిప్రాయభేదం వలసరాజ్య సమస్య మీద వచ్చింది. లెనిన్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా మరో సిద్ధాంతాన్ని రాయ్ ప్రతిపాదించాడు.
రాయ్ అంతర్జాతీయ కమ్యూనిస్టు కౌన్సిల్ సభ్యుడుగా యెన్నికవటమేగాక, రష్యాలోని ‘పాలిట్ బ్యూరో’లో కేంద్ర కూడలిలో పనిచేశాడు. కేంద్ర ఆసియాబ్యూరో సభ్యుడైనాడు. 1921 ఏప్రియల్ లో కమ్యూనిస్టు విశ్వవిద్యాలయానికి టెష్ కండ్ లో వుపాధ్యక్షుడైనాడు. 1922లో, నాల్గవ పార్టీ కాంగ్రెస్ లో కేంద్ర సంఘ సభ్యుడుగానూ, 1924లో సోవియట్ ప్రెసిడియం సభ్యుడుగానూ ఎన్నికైనాడు. అంతర్జాతీయ కమ్యూనిస్టు సంఘానికి కార్యదర్శి సభ్యుడు గూడా అయినాడు. ‘వాన్ గార్డ్’, ‘మాసెస్’ అన్ పత్రికలకు సంపాదకుడైనాడు. యెన్నో గ్రంథాలు వ్రాశాడు. తూర్పు దేశాల్లో కమ్యూనిస్టు వుద్యమ వ్యాప్తికి, పోర్టుఫోలియో లేని మంత్రిగా వ్యవహరిస్తూ, యిండియాలో కమ్యూనిస్టుపార్టీని స్థాపించి, దానికి ప్రణాళిల్ని అందించాడు.
రాయ్ కృషి బాగా ఆనుపానులు చేకూర్చుకొంటున్న రోజుల్లో, బ్రిటిష్ ప్రభుత్వం కాన్పూర్ కుట్రకేసు పెట్టింది. అది 1924 ఫిబ్రవరిలో, రాయ్ పరోక్షంగా మొదటి ముద్దాయిగా చేర్చబడ్డాడు.
1924 జనవరిలో రాయ్ ని జర్మనీ నుండి బహిష్కరించారు. రాయ్ తన కృషి కేంద్రాన్ని జూరిచ్, ఆన్సీ, పారిస్ పట్టణాలకు తరలిస్తూ వుండవలసి వచ్చింది. 1924 జూన్ లో అయిదవ కమ్యూనిస్టు కాంగ్రెస్ లో, కేంద్రసంఘ పూర్తి సభ్యునిగా, ప్రెసిడియం సభ్యునిగా, స్టాలిన్ తోపాటు వలసరాజ్య కమిషన్ లో సభ్యునిగా యెన్నుకొన్నారు. 1925 జనవరిలో పారిస్ లో అరెస్టు చేయబడి, దేశబహిష్కారం పొందాడు. యిండియాలోని కమ్యూనిస్టు వుద్యమాన్ని తన అదుపు ఆజ్ఞల్లో వుంచుకోజూచిన బ్రిటిష్ పార్టీతో రాయ్ కి వివాదు వచ్చింది.
1927 ప్రారంభంలో రాయ్ ని చైనాకు పంపిన రాయబార వర్గాధినేతగా యెన్నుకున్నారు. చైనా కమ్యూనిస్టుపార్టీకి సలహాకోసం పంపారు. కూమింటాంగును బలపరచటమా, లేక, వ్యావసాయక విప్లవానికి కృషి చేయటమా అన్న విషయం తేలని క్లిష్టసమస్యకాగా, రాయ్ ని పంపారు. 1926 డిశంబరులో జరిగిన కేంద్రసంఘం సమావేశంలో రాయ్ తన అభిప్రాయాల్ని మాస్కోలో వ్యక్తం చేశాడు. యిండియాలో వలెనే, చైనాలో గూడా, బుర్జువాల సహకారంతో సామ్రాజ్యవాదం మీద ఐక్య సంఘటనలు పనికిరావన్నాడు. బూర్జువాల సహాయం  హానికరమన్నాడు. చైనా కమ్యూనిస్టులు వ్యావసాయిక విప్లవంకోసం, రైతాంగాన్ని బలపరచాలన్నాడు. కూమింగ్ టాంగ్ ను వ్యతిరేకించాలన్నాడు. బోరోడిన్ యీ సూచనలను వ్యతిరేకించాడు. రాయ్ సూచనలను చైనా కమ్యూనిస్టులు తిరస్కరించారు. దాని ఫలితంగా చైనా పార్టీ చావుదెబ్బ తిన్నది. 1927 ఆగస్టులో రాయ్ మాస్కో తిరిగి వచ్చాడు.
స్టాలిన్, ట్రాట్క్సీల మధ్య అధికారం కోసం పోరు ఘోరమైంది. 1927 అక్టోబరులో ట్రాట్క్సీ, జినోవీవ్ లను పార్టీ కేంద్రసంఘం నుండి బహిష్కరించారు. స్టాలిన్ కు ఆప్తస్నేహితుడే అయినా, రాయ్ యీ కొత్త పన్నాగాలను వ్యతిరేకించి, తీవ్రవాదం పేరుతో స్టాలిన్ వేసిన పథకానికి, భిన్నపథకాన్ని యిస్తూ, జర్మనీలో నాజీల విజయానికిది తోడ్పడగలదన్న భయాన్ని వ్యక్తం చేశాడు. ఆసియాలో, యూరప్ లో అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ విధానాల్ని వ్యతిరేకించాడు.
1928 ఫిబ్రవరిలో రాయ్ కి జబ్బుచేసి, మార్చి 1928కి బెర్లిన్ చేరుకొన్నాడు. స్టాలిన్ రాయ్ మీద అప్పటికే శీతకన్ను వేశాడు. రాయ్ మారుపేరుతో బెర్లిన్ చేరాడు.
సెప్టెంబరు 1928లో జరిగిన ఆరవ పార్టీ కాంగ్రెస్ స్టాలిన్ తీవ్రవాద విధానాల్ని బలపరచటంతో, రాయ్ వాటిని బహిరంగంగా యెదుర్కో మొదలిడినాడు. కమ్యూనిస్టు పార్టీ పత్రికలు అప్పటివరకూ రాయ్ వ్యాసాల్ని ప్రచురిస్తూ, అంతలో మానివేయగా, రాయ్ బ్రాండ్లర్ పెట్టిన పత్రికలో అంతర్జాతీయ కమ్యూనిస్టు వుద్యమంలోని క్లిష్టస్థితిని గురించి తూర్పారపట్టాడు. దాంతో, వారికీ ఆ సంస్థకూ తెగతెంపులు, విడాకులు జరిగినై.
దీని అనంతరం రాయ్ మరో సంవత్సరం జర్మనీలో వుండి, చైనా మీద తన బృహద్గ్రంథాన్ని జర్మన్ భాషలో వ్రాశాడు. ఆ రోజుల్లోనే ఎల్లెన్ గోష్టాల్క్ ను రాయ్ కలిసికొన్నాడు. ఆమెగారే తరువాతి ఎల్లెన్ రాయ్.
1930 చివరలో రాయ్ ఇండియాకు ప్రయాణమై, డిశంబరులో బాంబే చేరాడు. దేశంలో నలుమూలలు తిరుగాడి, మార్చి 1931లో కరాచీ కాంగ్రెసుకు హాజరైనాడు. తన నూతన వుద్యమానికి తీవ్రకృషిచేస్తూ తిరిగి రాయ్ ని, 1931 జూలైలో లోగడి కాన్పూరుకు కుట్రకేసు పేరుతో అరెస్టు చేశారు. 1932 జనవరి తొమ్మిదవ తేదీన 12 సంవత్సరాల శిక్ష వేశారు. అపీలులో ఆరేళ్ళకు యీ శిక్షను తగ్గించారు. జైళ్ళలో మ్రగ్గి రాయ్ 1936 నవంబరు 20వ తేదీన విడుదల చేయబడ్డాడు.
కాంగ్రెసులో చేరాడు. 1937 ఏప్రిల్ 4వ తేదీన, యిప్పుడు ‘రాడికల్ హ్యూమనిస్టు’గా నడిచే ఇంగ్లీషు వారపత్రికను ‘ఇండిపెండెంటు ఇండియా’ అన్న పేరుతో బాంబేలో స్థాపించాడు.
కాంగ్రెసు ప్రాథమిక సంఘాలు చైతన్యయుత ప్రజాసంఘాలుగా మనగలగాలనీ, ‘రాజ్యాంగ సభ’ ద్వారా మన రాజ్యాంగాన్ని యేర్పరచాలనీ ప్రచారం ప్రారంభించారు. 1939 జూన్ లో రాడికల్ కాంగ్రెసు వాదుల లీగ్ స్థాపించాడు.
రెండో యుద్ధం రాకతో, 1940 డిశంబరులో రాడికల్ డెమోక్రాటిక్ పార్టీని, లేబర్ ఫెడరేషన్ ను స్థాపించాడు. 1944 ఏప్రిల్ లో ప్రజా ప్రణాళికను, డిశంబరు 1944లో స్వతంత్ర భారతరాజ్యాంగ ముసాయిదాను రాయ్ యిచ్చాడు. 1946లో హ్యూమనిస్టు వుద్యమ ప్రాతిపదికల్ని వేసి, 1948 రాడికల్ పార్టీని రద్దుచేసి, రాడికల్ హ్యూమనిస్టు వుద్యమాన్ని స్థాపించాడు. 1954 జనవరి 25వ తేదీ రాత్రి మరణించాడు.
3
రాధాకృష్ణమూర్తి రైతు కుటుంబంలో పుట్టి, పట్టభద్రుడై, మొదటి నుంచీ రాజకీయ చైతన్యం కలిగి రాయ్ భావాలకే ప్రోదిచేస్తూ వచ్చాడు. 1939 నుంచే, రాడికల్ కాంగ్రెసు లీగ్ నాటినుంచే, రాధాకృష్ణమూర్తి ‘రాయిస్టు’.
రాయ్ మొదటి పుస్తకాలు తెలుగులోకి రావటానికి రాధాకృష్ణమూర్తి ప్రధాన కారకుల్లో ఒకరు. రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ జిల్లా ప్రధాని, రాష్ట్ర ప్రముఖల్లో  ఒకరు. 1946లో పార్టీ తరఫున శాసనసభకు తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. 1946 డెహరాడూన్ రాజకీయ పాఠశాలకు వెళ్ళారు. రాడికల్ పత్రిక సంపాదకులుగా, ‘సమీక్ష’ పత్రిక సంపాదకులుగా, రచయితగా, అనువాదకుడుగా ప్రఖ్యాతి గడించాడు.
రాధాకృష్ణమూర్తి వచన రచన రమ్యంగా వుంటుంది. వొడుదుడుకులు లేని గంగా ప్రవాహంలాగా ప్రశాంతంగా, ప్రసన్నంగా వుంటుంది. అది తత్త్వ భాగమైనా, రాజకీయశాఖలోనైనా, సాంఘిక రంగంలోనైనా – వారి అనువాదం సరళమే అవుతుంది.
దానికి తార్కాణం యీ ముద్రిత గ్రంథమే... దీనిలో సాంఘిక విషయాలమీద పరామర్శ, రాజకీయ సిద్ధాంతాల విమర్శ, తత్త్వ విషయాల పరిశీలనలు వున్నై. యేమూల తీసినా, పుస్తకానువాదం ఒకే రీతిని వుంటుంది. నట్టు, గొట్టు లేకుండా సారళ్యతను ప్రదర్శిస్తుంది. ఈ పునర్ముద్రణ చేయటం, హ్యూమనిస్టు వుద్యమానికి యెంతో వుపకరిస్తుంది. రాధాకృష్ణమూర్తి తిరిగి యీ ముద్రణతో, తానూ రచనా రంగంలోకి తిరిగి వస్తే, యెంతో ప్రకర్షణీయంగా వుంటుంది.
4
టెర్రరిస్టుగా ప్రారంభించిన రాయ్, జాతీయవాదిగా మారి, మార్క్సిస్టు అంతర్జాతీయవాదిగా తేలి, హ్యూమనిస్టుగా పరిఢవించాడు. దాదాపు పదునారు బాసలు నేర్చి, అందులో పదింట వ్రాయనెరిగి, యెనిమిదింట పండితుడైన రాయ్, ప్రపంచంలో అనేక దేశాలు మెట్టి, యెన్నో వుద్యమాల్లో తిరిగి, దేశాల, భాషల, అనుభూతులను సమ్మిశ్రం చేసి, హ్యూమనిస్టుగా రూపాంతరం చెందినాడు.
ఆదినుంచి హేతువాది, అబద్ధాల వేటగాడు. ఆత్మవిశ్వాసం కలిగి, మనోస్థైర్యాన్ని యింతగా ప్రదర్శించిన త్యాగధనుడు మరొకరు అధునాతన ప్రపంచంలో లేదు. రాయ్ అద్వితీయుడు. ఇంత అనుభవం గల తత్త్వ వేత్తగాని, రాజకీయవాది గాని, సాంఘిక విప్లవకారుడు గాని లేడు. ఇంతటి కలుపుగోలుతనం గలవాడు లేడు. యీయనలోని స్వేచ్ఛా పిపాస, సత్యాన్వేషణ, మానవతా భావుకత వుదాత్తస్థాయినందుకొన్నవి. ఈ మూడు గుణాలు ఆయనలో ముప్పేటలా చేరిపోయినవి. అందుకే రాయ్, మానవవాదతత్త్వ ప్రదీప్తి చేయగలిగి,  దార్శనికుడైనాడు.
అట్టి రాయ్ ని అర్థం చేసుకోటానికి, అచ్చులోనున్న వారి నూరు గ్రంథాలు, అచ్చుకావలసిన 40 వేల పుటల గ్రంథాలు మనకు శరణ్యం. దానికి, యీ సంపుటి నాందీస్థాయిలోనిది. యీ కృతికర్తకు ధన్యవాదాలు, పాఠకులకు శద్ధాసక్తులు.
        తెనాలి,
       2-10-62                                                 ఆవుల గోపాలకృష్ణమూర్తి