హ్యూమనిజం (వ్యాస సంపుటి)
ఆవుల గోపాలకృష్ణమూర్తి
కృతజ్ఞత
ఈ వ్యాస సంపుటిలో మొదటి నాలుగు వ్యాసాలు 1949లో తెలుగు స్వతంత్రలో ప్రచురితమైనవి. అవి పునర్ముద్రించటానికి అనుమతించిన గోరాశాస్త్రిగారికి, ముఖచిత్రం వేసిన గోలి శివరాంగారికి ధన్యవాదాలు. మిగిలిన వ్యాసాలు 1961 వేసవిలో చీరాలలో జరిగిన అధ్యయన శిబిరోపన్యాసాల కూర్పు. ఈ చిన్న పుస్తకానికి గోరాశాస్త్రిగారి కర్తవ్యప్రబోధం లభించినందుకు గర్విస్తున్నాం.
ఎం. శ్రీరామమూర్తి
ఎన్. ఇన్నయ్య
ఇందులో
నిజమైన అభిమానులకు
హ్యూమనిజం ఎందుకు వచ్చింది
హ్యూమనిస్టుల దృక్పథం ఏమిటి
హ్యూమనిజం మార్క్సిజం
హ్యూమనిజం – గాంధీజం
హ్యూమనిస్టు యేలుబడిరీతులు
ఎం.ఎన్.రాయ్ శాస్త్రీయ పరిణామం
సమకాలీన రాజకీయ సిద్ధాంతాలు
ఆవుల గోపాలకృష్ణమూర్తి – (స్కెచ్)
నిజమైన అభిమానులకు
పీఠాధిపతిగా ప్రకాశించడానికి కావలసిన సాధన సంపత్తి అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా స్వేచ్ఛా మేధావిగా, జిజ్ఞాసువుగా జీవితాంతమూ గడపడమూ, గడపడమేగాక అందులోనే సంతృప్తిని అందుకోవడమూ స్వర్గీయ ఆవుల గోపాలకృష్ణమూర్తిగారి ఉత్తమ సంస్కారానికి తిరుగులేని నిదర్శనం.
పీఠాలను తమకు తామే బనాయించి, సగర్వంగా అధిష్ఠించి భక్తమండలిని చేర్చి తద్వారా దేశాన్ని విపరీతంగా ఉద్ధరిస్తున్నట్లు సంతృప్తిగా నిట్టూరుస్తుండడం తెలుగునాడులో ఆధునిక అభ్యుదయవాదుల సంప్రదాయం, వాళ్ళకు భక్తమండలి వినా మిత్రమండలి అక్కరలేదు. ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు “భక్తమండలి సమీకరణ” సూత్రాన్ని తృణీకరించారు. అది ఆధునిక సంప్రదాయానికి విరుద్ధం. పాత సంప్రదాయాలను కూడా నిర్భీతంగా వ్యతిరేకించారు. పెక్కుమందికి ఆయనతో అక్కడే చిక్కువచ్చింది. ఏ విలువలకోసం ఆయనపాటుబడినట్లు? ఏదో ఒక సంప్రదాయానికి కట్టుబడాలిగాని అన్నింటినీ తృణీకరిస్తే ఎలా?
అందుకే యిప్పుడాయన మీద ఒకరకంగా కసి తీర్చుకుంటున్నారా అనిపిస్తుంది. జీవన్మనుష్యకోటి మధ్య ఉన్నంతకాలం ఎవరూ ఆయనను హక్కు భుక్తం చేసుకోలేకపోయారు. తమ కుటుంబీకుడేనని సంకుచితమైన ముద్రవేయలేకపోయారు. సహృదయులకు, జిజ్ఞాసువులకు ఆయన అకాలమరణం కలిగించిన బాధకంటె ఆయన స్మృతికి శ్రద్ధాంజలి పేరిట జరుగుతున్న ఆయనను స్వంతం చేసుకుని గోపాలకృష్ణమూర్తిగారి మూల ఆశయాలనే వమ్ము చేస్తున్నారు.
ఆయన ఏమిటి? ఆయన మూల ఆశయమేమిటి? అని ప్రశాంతంగా ప్రశ్నించినా, మూడు ముక్కల్లో సమాధానం చెప్పడం కష్టం. హేతువాది అనీ, మానవతావాది అనీ, నిరీశ్వరవాది అనీ, “రాడికల్ హ్యూమనిస్టు” అనీ ఏవేవో చెప్పవచ్చు. అవన్నీ కలిపినా అసమగ్రంగానే ఉంటుంది. రేషనలిస్టుల సిద్ధాంతాలు, ఎమ్.ఎన్.రాయ్ హ్యూమనిజం, వాటి ప్రభావం ఆయనపై అమితంగా ఉండవచ్చు. వాటిని ధ్యేయాలుగా తీసుకుని, మనసారా విశ్వసించి వాటి ప్రచార క్షేత్రంలో ప్రముఖపాత్ర వహించి అవిరళంగా కృషిచేసి ఉండవచ్చు.
ఐనప్పటికీ గోపాలకృష్ణమూర్తిగారు స్వేచ్ఛా భావుకుడు, వస్తుతహా నిశితమైన మేథావి. నిరంతర సత్యాన్వేషి. ఆయన మేథస్సు ఒక ఘట్టందాకా వచ్చి అక్కడ ఘనీభవించి పోలేదు. నిత్యపల్లవ శీలంగా వికసించేది. నిన్నటి ఆదర్శం నేటి అనర్థం. నేటి ఆశయం రేపటి అనర్థం కావచ్చు. ఆ సత్యాన్ని గ్రహించిన మనీషి. అందువల్ల ఏదో ఒక మూసలో యిమడిపోయి కాలక్షేపం చేయడం ఆయన మన.... ప్రవృత్తికే విరుద్ధం.
ఆ సత్యం ఆయన రచనల్లో స్ఫుటంగా కనబడుతుంది. ఆయన సంభాషణలలో, ఉపన్యాసాలలో స్పష్టంగా ప్రతిఫలించేది. ఆయనలో పెక్కు వ్యక్తిత్వాలు లేవు. అంతర్గతమైన వస్తుతత్వాన్ని ఎన్నడూ దాచుకోలేదు. “నేను పీఠాధిపతిని! ఎంత బాగా చెపుతున్నానో వినండి. నా ఘనతను గ్రహించండి” అనే భంగిమ ఆయనకు అసహ్యం. ఆలోచనలను చంపివేయడం కాక, ఆలోచనలను పురికొల్పడం ఆయన లక్ష్యం.
అందుకే ఆయన తన గురించీ, కీర్తి సముపార్జన గురించీ ఆలోచించకుండా, కేవలం జిజ్ఞాసువుగా, మేథావిగా, రచయితగా కృషిచేసి రాష్ట్రంలో నవచైతన్యం, భావ విప్లవం కలిగించడానికి యత్నించారు. ఎందరినో అవ్యాజంగా ఆకర్షించారు. స్వయంప్రతిభ ఉండి ఆత్మవంతుడైన ప్రతివ్యక్తికీ కొందరు ప్రత్యర్థులుంటారు. తీక్షమైన మేథాశక్తికి అదొక నిదర్శనం.
స్ఫురద్రూపం, స్నేహభండ హృదయం, నిండైన మానవత్వం, ఉత్తమ సంస్కారం- యిన్ని అపురూప గుణాలు మూర్తీభవించిన గోపాలకృష్ణమూర్తిగారు అకాల మృత్యువు వాతబడడం ఆంధ్రదేశపు దురదృష్టం. స్నిగ్ధ హృదయుడైన మేధావిని తమ వాడిగా హక్కుభుక్తం చేసుకోవాలనే కొందరి సంకుచిత ప్రయత్నం నెగ్గితే అది మరీ దురదృష్టం. రెండవ పరిణామాన్ని నివారించి సత్యాన్వేషులతో, మేథావి వర్గాలతో ఆయన బాంధవ్యాన్ని మన్నించి తద్విధంగా శ్రద్ధాంజలి ఘటించడం నిజమైన అభిమానుల కర్తవ్యం.
గోరాశాస్త్రి
(సశేషం)
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి