హ్యూమనిజం -3
Photo courtesy: Prometheus Books
హ్యూమనిజం జాతీయవాదమా, లేక అంతర్జాతీయవాదమా అనే ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు. ‘ఏదీ కాద’ని సమాధానమిస్తే ఆశ్చర్యంతో కొందరూ నిస్పృహతో మరికొందరూ చూస్తారు. ‘ఏదీ కాక మరేమిటి, నిజంగా ఏమీ కాదేమో’నని నవ్వే వారూ లేకపోలేదు. పోతే హ్యూమనిజం ఏ వాదం?
జాతీయవాదం రమారమి పెట్టుబడిదారీ విధానంతో ప్రారంభమైందని చెప్పాలి. పెట్టుబడిదారీ విధానం ఆర్థిక రూపమైతే, జాతీయవాదం దాని రాజకీయ-సాంస్కృతిక రూపంగా యెంచబడింది. అంతకుముందు రాజ్యాలు, పెద్ద విస్తీర్ణ పరిపాలనలూ ఉన్నా – పెట్టుబడిదారీ  విధానపు రాకతో జాతీయవాదం ఉత్పన్నమైంది. పెట్టబడిదారీ దేశం పొలిమేరల్లో  ముందు నాల్గు మూలలా క్రమ్మి, తాను తయారు చేసే వస్తువులు  ‘స్వదేశవస్తువు’అని, వాటిని కొనటం, వాటి అభివృద్ధికి పాటుపడటం, వాటి  విస్తరణకు తోడుపడటం ప్రతి దేశీయుని విధిగా ప్రచారం చేసింది. జాతీయవాదం  నుంచి దేశభక్తి, దేశభక్తి నుంచి భాషాప్రాంత నిర్మాణ విభాగపద్ధతి  బయలుదేరాయి.
జాతీయ వాదానికి ప్రాతిపదిక దేశం. ఆ దేశంలో ఉన్న జాతి. అందువల్లే జాతీయవాద నిర్మాణ ప్రణాళికలన్నీ “దేశాన్ని” యూనిట్.గా  తీసుకొని నిర్మించబడతాయి. జాతీయవాదం ఒక దేశపు ఔన్నత్యాన్ని, వికాసాన్ని  ఆకాంక్షించి, దానికై కృషి చేస్తుంది. జాతి ప్రతిభ విస్తరణ కోసం  పనిచేస్తుంది. ‘నీ జాతి ఔన్నత్యం కోసం నువ్వు ఏమైనా త్యజించాలి. అవసరమైతే  నిన్ను నువ్వే త్యజించా’లని జాతీయవాదం ప్రచారం చేస్తుంది. హిట్లర్,  ముస్సోలినీ, టోకో, ఫ్రాంకో ప్రభృతులంతా విశేష జాతీయవాదులు, స్వతంత్ర  దేశాలలోని జాతీయవాదులు. పోతే ఛాంక్ కై షేక్, గాంధీ, కెమాల్ పాషా  మొదలైనవాళ్ళు అస్వతంత్రంగా వుండిన దేశాల్లోని జాతీయవాదులు. రెంటిలో కొంత  తేడా వుంది. కాని అస్వతంత్ర దేశాలు స్వతంత్రంకాగానే, ఆ తేడాలు క్రమేణా  మాసిపోతై, ఈనాడు తూర్పు దేశాల్లో చేస్తున్నదదే.
జాతీయవాదాన్ని  సంకుచిత దృక్పథమని విమర్శించి, అంతర్జాతీయవాదం బయలుదేరింది. ప్రపంచమంతా  ఒకటే, జాతీయవాదం హేయం, దానివల్ల యుద్ధాలు వస్తున్నాయి. అంతర్జాతీయ వాదాన్ని  స్వీకరిస్తే యుద్ధాలు పోతాయి. జాతీయవాదం సృష్టించిన సమస్యలన్నీ పరిష్కారం  అవుతాయని ప్రచారం సాగించింది.
ఈ  అంతర్జాతీయవాదంలో చాలా రకాలున్నాయి. వాటిలోకల్లా విశేషస్థానాన్ని  స్వీకరించగలిగింది మార్క్సు మొదలైన కమ్యూనిస్టులు చేసిన సిద్ధాంత ప్రచారం.   పెట్టుబడిదారీ విధానం జాతీయ వాదాన్ని సృష్టించింది. సోషలిస్టు ఆర్థిక  వ్యవస్థ అంతర్జాతీయ వాదాన్ని సృష్టించిందని  చెప్పవచ్చు. జాతీయ దృష్టితో  చూస్తే సార్థపరత్వం ఎదురుతగిలి, విశేషంగా చిక్కు సమస్యలు వస్తున్నాయనీ,  అంతర్జాతీయ వాదంతో విశాల దృష్టి ఏర్పడి, స్వార్థం నశించి, వివిధ సమస్యలు  పరిష్కారం కాగలవనీ చెప్పాడు. మతాన్నే మార్క్సు మత్తు మందుగా విమర్శిస్తే ఈ  అంతర్జాతీయ వాదులు జాతీయతను గూడా ఒక మత్తుమందుగా నిందించారు.
ఈనాడు మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రపంచంలో అన్ని మూలలా పరిశీలించి చూస్తే – జాతీయవాదం,  అంతర్జాతీయవాదం చేసిన, చేస్తున్న పనులన్నీ తేలిగ్గా అవగాహన చేసుకోవచ్చు. ఆ  ప్రయత్నాన్ని హ్యూమనిజం చేసింది, ఇతరులు చేయటానికి గూడా కావలసినంత సరంజామా  యిచ్చింది.
పెట్టుబడిదారీ విధానం జమీందారీ విధానంకన్నా మొదట్లో అభివృద్ధికరమైన శక్తిగా ఈనాటి-ఆనాటి  అంతర్జాతీయవాదులు గూడా పరిగణించారు. అందువల్ల దాని రాజకీయ ప్రతిచ్ఛాయగా  తయారైన జాతీయవాదం కూడా ఒకప్పుడు ఒక దేశపు పొలిమేరల్లో వున్న వివిధ  ప్రాంతాలని కలిపి ఏక ప్రాంతంగా చేసి, ఒక బలవత్తర శక్తిగా ఏక పరిపాలనలోకి  తెచ్చినప్పుడు  - అభివృద్ధికర  శక్తిగానే ఎంచబడింది. కానీ పెట్టుబడిదారీ విధానం కాలం గడిచినకొద్దీ  అభివృద్ధి నిరోధక శక్తిగా తయారై, తన స్థితిని ఘనీభవింపచేసుకునే ప్రయత్నంలో  పడగానే, దాని ప్రతిచ్ఛాయ అయిన జాతీయ వాదం కూడా అభివృద్ధి నిరోధక శక్తిగా  తయారైంది. ఒక దేశంలోని పెట్టుబడిదార్లు యింకో దేశంలోని పెట్టుబడిదార్లతో  ఢీకొనగా, జాతీయవాదం యుద్ధవాదంగా తయారైంది. పెట్టుబడిదారీ  విధానం ప్రాయికంగా జాతీయవాదమైనా, అదీ అంతర్జాతీయ స్వరూపాన్ని కొంతకు కొంత  పొందింది. అన్యదేశాలకు వ్యాపించిన పెట్టుబడిదారీ విధానాన్నే “సామ్రాజ్యవాద”  మంటారు.
సామ్రాజ్యవాదమంటే  విజయవంతంగా ఉన్న జాతీయవాదమన్నమాట. దీనినే అంతర్జాతీయ పెట్టుబడిదారీ  విధానమనీ చెప్పవచ్చు.కాని,సోషలిస్టు ఆర్థికవ్యవస్థ అంతర్జాతీయ వాదానికి  ప్రాతిపదికగా వుంది. సోషలిజంలో ‘జాతిపరం చేయటం’ ప్రధాన వివాదం. అంటే జాతీయ  దృష్టి అంతర్జాతీయ వాదాలలో యిమిడి ఉంది. అట్లాగే కొంత అంతర్జాతీయ దృష్టి  జాతీయ వాదంలో యిమిడి వుంది కూడాను.
అంతర్జాతీయ వాదం ఒక “దేశాన్ని” ప్రధానమైన యూనిట్.గా తీసుకోరు. “ఒక వర్గాన్ని” ప్రధానమైన యూనిట్.గా  తీసుకుంటుంది.  అది శ్రామిక వర్గం అన్ని దేశాల్లోనూ ఉంది కనుక. ఈ  అన్నిటిలోనూ వున్న శ్రామికవర్గ సమస్యలన్నీ యించుమించు ఒకేరకమైన  పరిష్కారమార్గంతో స్థిమితపడతాయి కనుక – అంతర్జాతీయ వాదం సర్వసమస్యా పరిష్కార మార్గంగా ప్రచారం చేయబడింది. దీన్ని జాతీయవాదంకన్నా ఎంతో మంచి దానిగా ప్రచారం సహజంగా చేశారు.
కాని,  కొంచెం పరిశీలించి చూస్తే, రెండు జాతులయొక్క, లేక రెండిటికి మించిన  జాతులయొక్క పరస్పర సంబంధాల్ని గురించి మాట్లాడుతూ ‘అంతర్జాతీయ’ మంటాము.  కాబట్టి అంతర్జాతీయ వాదానికి కూడా పునాది ‘జాతి’ అని తేలుతుంది.
జాతీయవాదం  పెట్టుబడిదారీ విధానం మీద ఆధారపడి వుంటే, అంతర్జాతీయ వాదం సోషలిస్టు  ఆర్థిక వ్యవస్థమీద, అంటే, పెట్టుబడిదారీ విధాన నిర్మూలనమీద ఆధారపడి  ఉంటుంది. మన అనుభవంలో, జాతీయవాదం యెంత యుద్ధోద్ధతి వాదంగా వుందో,  అంతర్జాతీయ వాదం కూడా అట్లాగే ఉంది.
పెట్టుబడిదారీ  విధానం క్షీణదశకు రాగానే దౌర్జన్యయుతంగా తన స్థితిని స్థిమితం చేసుకోవాలని  ప్రయత్నిస్తుంది. ఆ దౌర్జన్య స్వరూపాన్నే ఫాసిజం అంటారు. అంటే, దుడుకుగా  వున్న జాతీయవాదం ఫాసిజమన్నమాట. ఫాసిజం నియంతృత్వమని మనకందరకూ సిద్ధాంత  రీత్యానేగాక,  అనుభవంతో కూడా తెలుసు. నియంతృత్వం తప్పనిసరిగా నిరంకుశంగా  ఉంటుంది. అయితే, ఫాసిజం కలవారి నియంతృత్వం పై వర్గాల నియంతృత్వం.
సోషలిస్టు  ఆర్థిక వ్యవస్థ కూడా సమస్యలు సరిగా పరిష్కరించలేకపోయింది. ఆ పరిష్కార  మార్గానికి కూడా ఒక విధమైన నియంతృత్వం కావాలని మార్క్సు మొదలు స్టాలిన్  వరకూ ప్రవచించి, ప్రచారం చేస్తూనే వచ్చారు. కాని ఆ నియంతృత్వం శ్రామిక  నియంతృత్వం – అంటే, క్రింది వర్గాల నియంతృత్వం, నియంతృత్వం ఏదైనా  నిరంకుశత్వమేగదా!
అందువల్ల,  యిటు జాతీయవాద పరిపాలనా విధాన క్రమం, అటు అంతర్జాతీయ వాద పరిపాలనా విధాన  క్రమం నియంతృత్వం మీద ఆధారపడిగానీ, నియంతృత్వానికి దారితీస్తూ గాని  ఉన్నాయి. అందువల్ల జాతీయ వాద దృష్ట్యా గానీ నియంతృత్వం గనుక నిరంకుశ రాజకీయ  విధానాలు, అందువల్ల “దేశ” దృష్టితో వున్నా, “వర్గ” దృష్టితో వున్నా  గ్రాహ్యం కాదని హ్యూమనిజం అంటుంది.
హ్యూమనిజం  తన నిర్మాణ విధానాలకు జాతీయవాదం మాదిరిగా “దేశాన్ని”గాని, అంతర్జాతీయ వాదం  మాదిరిగా “వర్గాన్ని”గానీ ప్రాతిపదికగా అంగీకరించదు. దేశం పేరుతో  వర్గాన్నేగాక వ్యక్తినీ జాతీయవాదం, వర్గం పేరుతో దేశాన్నేగాక ‘వ్యక్తినీ’  అంతర్జాతీయవాదం – భంగపరుస్తున్నాయని  హ్యూమనిజం వాదిస్తుంది. అందువల్ల దేశాన్నిగాని, వర్గాన్నిగాని కాకుండా  ‘వ్యక్తిని’ నిర్మాణ విధానాలకు ప్రాతిపదికగా అంగీకరిస్తుంది. వ్యక్తి  వికాసం, వ్యక్తి భద్రత, వ్యక్తి స్వేచ్ఛలేని జాతీయతా, అంతర్జాతీయతా  పనికిరావంటుంది. అందువల్లే జాతీయవాదంగా గానీ, అంతర్జాతీయవాదంగా గానీ కాక – “మానవ వాదంగా” హ్యూమనిజం ఆచరణలోకి రావటానికి కృషి చేస్తుంది.
దేశంకన్నా,  వర్గంకన్నా ముందు “మానవుడు”, సర్వానికీ మానవుడే అధినేత. తాను అధినేతగా  ఉన్న సర్వానికీ తననే ప్రాతిపదికగా తేవటానికి కావలసిన సామగ్రిని,  పరిజ్ఞానాన్ని, వాతావరణాన్ని యివ్వటానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల  ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సమస్యలన్నిటినీ యీ దృష్ట్యా పరిష్కారం  చేసుకోవాలని కోరుతుంది.  

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి