ఆవుల గోపాలకృష్ణమూర్తి
మా ఆలోచనలు
ఆవుల గోపాలకృష్ణమూర్తి భావప్రచారకుడు. సాంఘిక ప్రయోజనాన్నుద్దేశించి సాహిత్య పరిశీలన చేశాడు. అంటే సాహిత్యంలో మరో ఔచిత్యాన్వేషణ మొనరించాడు. భావమునకు బలమున్నదనే నమ్మకము గలవాడు గనుక, సాహిత్య భావముల బలము సంఘముపై జాస్తి గనుక, కొంత నిశిత పరిశీలన చేసినాడు. నిశిత పరిశీలనకు నిలబడు సాహిత్యము అల్పముగదా మనకు.
ఆవుల సాహితీ రచనలు అనేక విధములు. భావస్పందన కలుగగా మెదలిన ఆలోచనలకు రూపకల్పన చేసిన రచనలు సహజములు. “సాహిత్యములో ఔచిత్యము” తత్ఫలితమే. కొన్ని లభ్యముగాక యిందు జేర్చలేక పోవుటచే క్షంతవ్యులము.
భావములోవలె భాషయందునూ ఔచితి పరిశీలన అవసరము కదా. హేతువాది గోపాలకృష్ణమూర్తి గ్రాంథికవాది (వీరగ్రాంథికవాది కాదు) కారణాంతములచే వీర వాడుకవాదియై “గోపాక్రిష్నమూర్తి”, “సుబ్రమన్యం”, “రొండు” అనే పదములు వాడిననూ, క్రమేణా “రొండు” మాత్రమే మిగిల్చినాడు. సాహిత్య వ్యాసములలో గ్రాంథిక వాసనలు మెండు.
సాంఘీక ప్రయోజనమునకు వాడుక భాష దగ్గర దారియని, గ్రాంథికము వలన కాలహరం జరుగుననీ భావించుటయూ కద్దు. ఇందలి హేతువు చింత్యము. భాషకు నియమము గావలయుననిన అది గ్రాంథికమే. సరళగ్రాంథికము గావచ్చును. వాడుకభాష నియమము తప్పినట్టిది. కనుకనే గోపాలకృష్ణమూర్తి గ్రాంథిక వాసనలు వీడజాలక, వాడుకలోకి దిగజారలేక, డోలాందోళిత మనస్కుడై, రాగా రాగా గ్రాంథో వ్యవహారికము ననుసరించినాడు.
వాదోపవాదములలో ఆవుల దిట్ట. ఆయిననూ కొందరి దృష్టిలో వాదములు పాక్షికములు. కనుక అట్టివి కావలయునని వదిలివేసితిమి.
మొత్తము మీద సాహిత్య రుచులు గలవాడైననూ, గోపాలకృష్ణమూర్తి దానిపై నొక్కు బెట్టనట్లు, రచనలవలన స్పష్టము. కొన్నిటి యెడల ప్రతిభావ్యుత్పన్నత ద్యోతకమగును. భావమునకుగల బలము భాషకు లేకపోవుట ఆయన గొప్ప లోపము. సృజనాత్మకశక్తిని సద్వినియోగమొనర్చలేదనే చెప్పవలయును సాహితీరంగములో. ఆ ప్రయత్నమేదో మొగ్గయందే వాడిపోవుట బాధాకర విషయము. దాని భావనలే చివరివరకు మిగిలినవి.
ఆవుల గోపాలకృష్ణమూర్తికి సంబంధించిన హాలాహలాన్ని కంఠస్థమొనరించి, అమృతాన్ని మాత్రమే అందజేయ ప్రయత్నించిన మా గురువులు ఎలవర్తి రోశయ్యగారి సలహాలు శిరోధార్యములుగ స్వీకరించి యీ గ్రంథమును వెలువరించితిమి. వారికి మా నమభినందనాలు. ఇతరత్రా తోడ్పడిన ఎ.జి.కె. అభిమానులు తోటకూర శ్రీరామమూర్తి, మాధవరావు, పోలు సత్యనారాయణ, వెలిది వెంకటేశ్వర్లు మన్నన పాత్రులు. తమ గ్రంథములలో గోపాలకృష్ణమూర్తి రచనలు పునర్ముద్రించుకొనుటకు తక్షణమే అంగీకరించిన అమ్మిసెట్టి లక్ష్మయ్య, గౌరిబోయిన పోలయ్య, కలపాల సూర్యప్రకాశరావుగారలకు, తమ తమ పత్రికల నుండి పునర్ముద్రణకు అనుమతించిన సంపాదకులకు ధన్యవాదములు.
ఎ.జి.కె.పై అవ్యాజానురాగము చూపుచు, మేము కోరినదే తడవుగా గ్రంథ ప్రచురణకు మమ్ములనే తొందరజేసి ప్రచురించిన “తెలుగు విద్యార్థి” సంపాదకులు కొల్లూరి కోటేశ్వరరావుగారు సాహిత్యాభిలాషనేగాక, భావసాహసమును ప్రదర్శించి, మా ప్రేమపాత్రాభిమానులైరి. వారి సేవలు మాన్యములు.
ఇట్లు
ఎం. శ్రీరామమూర్తి
ఎన్. ఇన్నయ్య
విషయసూచిక
1. సాహిత్యం – ఔచిత్యం
1958లో ఎ.సి.కళాశాల గుంటూరు ఆంధ్ర భాషా సమితి నుద్దేశించి చేసిన ప్రసంగం
2. భారత సంస్కృతి
1958 జనవరిలో ఆంధ్ర పత్రిక నుండి పునర్ముద్రితం, దీని విస్తృత పాఠం శ్రీ కొల్లా శ్రీకృష్ణారావుగారి “రారాజు” కావ్యంలో పీఠికగా చూడనగును.
3. ఆంధ్ర భాషా ప్రాశస్త్యము
ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆంధ్రాభ్యుదయ వారోత్సవాల ప్రారంభోపన్యాసం 1960లో
4. కావ్య ప్రయోజనం
రేపల్లె శ్రీ శారదా విద్యాపీఠంలో చేసిన ప్రసంగం 1958లో
5. కావ్యలోకం – రైతు విప్లవం
శ్రీ అమ్మిసెట్టి లక్ష్మయ్య (తణుకు) గారి “రైతు కల్యాణము”నకు పీఠిక 1948
6. సాహిత్యములో సాంఘిక విప్లవము
శ్రీ గౌరిబోయిన పోలయ్య (ఇంకొల్లు, గుంటూరు జిల్లా) గారి “పిలక రాయుళ్ళు” గ్రంథానికి పరిచయం.
7. ఏటుకూరి వేంకటనరసయ్య
స్మారక సంచికనుండి
8. చల్లా పిచ్చయ్యశాస్త్రిగారి ప్రతిభావ్యుత్పత్పులు
ఆంధ్ర పత్రిక నుండి
9. రవీంద్రనాథ ఠాగూరు
1960లో చీరాల సాంస్కృతిక సమితిలో చేసిన ఉపన్యాసం
10. మన కవి కాటూరి
కవి అస్తమించిన సమయములో వ్రాసినది ప్రజావాణి నుండి
11. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
ఆంధ్ర భూమి నుండి, కవి మరణించిన సందర్భంగా వ్రాసినది 1960లో
12. శ్రీ త్రిపురనేని రామస్వామి భావపరిణామం
‘కవిరాజదర్శనం’ నుండి
13. సూతపురాణం
‘కవిరాజదర్శనం’ నుండి
14. భారతీయ సంప్రదాయం – నవ్యతా ప్రభావం
1965లో కేరళ రచయితల సమావేశంలో చదివిన వ్యాసం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి