M.N.Roy
హ్యూమనిజం ఎందుకు వచ్చింది?
హ్యూమనిజం ఒక ఫిలాసఫీ, ఒక తత్వం, ఒక సిద్ధాంతం. అందువల్ల మానవుని జీవితంలో అన్ని రంగాలకూ సంబంధించి, సమగ్రమైన దృక్పథాన్ని యిస్తుంది. ఆ సమగ్ర దృక్పథం యెట్లా వుంటుందో నిర్వచనం చేయక పూర్వం నేటి పరిస్థితులు, సిద్ధాంతాలు హ్యూమనిస్టు సిద్ధాంత అవతరణకు యేవిధంగా కారణభూతాలో, ఆయా సిద్ధాంతాలు యెందువల్ల అసమగ్రంగా వుండిపోయి నేటి పరిస్థితులకు అనుకూలించక పోతున్నాయో కూలంకషంగా చర్చించి, అవగాహన చేసుకోవాలి.
సమకాలిక ప్రపంచాన్ని నాల్గు దిక్కులా పరికించి చూస్తే ఒక వైపు నుంచి కమ్యూనిజం, యింకో వైపునుంచి పెట్టుబడిదారీ విధానం, వీటికి మధ్యేమార్గంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కనబడుతున్నాయి. ఎవర్ని చూచినా మావల్లే, మా మార్గంవల్లే అన్ని సమస్యలూ పరిష్కారం కావాలి, లేకపోతే యీ విషమ పరిస్థితి సనాతనంగా వుండిపోవలసిందే అంటారు.
మొత్తం మీద నేటి పరిస్థితులు విషమంగా వున్నవని అందరూ అంగీరిస్తారు. ఉన్న సిద్ధాంతాలు యేవేవో మార్గాలు చూపిస్తున్నాయి. ఈ సిద్ధాంతాలు, మార్గాలే నేటి పరిస్థితికి కారణమని విజ్ఞులంతా క్రమేణా గ్రహిస్తున్నారు. ఈ విధంగా యెంత ఎక్కువ మంది గ్రహించి తొందరగా ముందుకు రాగలిగితే, అంత తొందరగా ఈ విపత్తునుంచి – నేటి నాగరికతకు సంబంధించిన ఈ విపత్తు నుంచి మానవ సమాజం బయటికి రాగలదు.
మానవునిలో ఒక సహజ గుణం కనబడుతుంది. మానవుడు ప్రాయికంగా హేతువాది అని మనం అందరం వెంటనే అంగీకరించకపోయినా, మానవుడు మారాలన్నా, భావాల్ని మార్చుకోవాలన్నా గురుత్వాన్ని వదులుకోవాలన్నా చాలా కష్టమనీ, యెంతో బలవంతం మీద గానీ మారడనీ మనలో చాలామంది అంగీకరిస్తారు. మన అనుభవానికి కూడా ఇది దగ్గరే! అంటే, మానవుడు సహజంగా కొంత సనాతనవాదిగా కనబడతాడు.
అందువల్లే – సిద్ధాంతం పాతదైనా, పరిస్థితులు మారినా మార్పు రానిదే మనటం కష్టమైనా,యీ సిద్ధాంతాల వెంట మనవాళ్లు అంతతొందరగా మారరు. సిద్ధాంతాలు మత్తు మందుగా పనిచేసేది యీ గుణాన్ని అనుసరించే. పందొమ్మిదవ శతాబ్ద ప్రారంభం నుంచీ పెట్టుబడిదారీ విధానం విస్తరించ నారంభించింది. దానిని రాజకీయ సిద్ధాంతంగా “లిబరల్ ప్రజాస్వామ్యం”యెదిగివచ్చింది.రాజకీయంగా మానవులందరూ ఒకటే అన్న ప్రధాన సూత్రమే లిబరల్ సిద్ధాంతానికి జీవగర్ర. అందుకనే ‘తలా ఒక వోటు’ అన్న నినాదాన్ని ఆనాటి లిబరల్ సిద్ధాంతకారులు లేవదీశారు. దీనికి ఆర్థిక అనుబంధంగా ‘స్వేచ్ఛా వ్యాపారం’ అన్న సూత్రాన్ని ప్రతిపాదించారు. ‘ఎవడి ఓపిక కొద్దీ వాడు’ ప్రయత్నం చేసుకోవటంగా భావించారు. స్త్రీ పురుష సమాన ప్రతిపత్తీ యిందులోనుంచే వచ్చింది. సాంఘికంగా ‘వ్యక్తి తాహతునుబట్టి గౌరవం’ అన్న పద్ధతి చలామణిలోకి వచ్చింది. లిబరల్ ప్రజాస్వామ్య సిద్ధాంతమే రానురాను పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతంగా వ్యాప్తిలోకి వచ్చింది. పెట్టుబడిదారీ విధానం అభివృద్ధికరమైన పాత్ర నిర్వహించినన్నాళ్ళూ లిబరల్ ప్రజాస్వామ్యం సజావుగానే నడిచింది. ఆర్థిక రంగంలో క్లిష్టత యేర్పడేసరికి, ఇతర రంగాల్లో కటకట సాగింది.
1914-18 యుద్ధంనాటికి, ముఖ్యంగా యుద్ధాంతంతో లిబరల్ ప్రజాస్వామ్యం నైతికంగా గూడా యూరప్.లో చావు దెబ్బతిన్నది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ గుడుగుడు గుంచంలో బడింది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించి, బాధ్యతారహిత ప్రజాస్వామ్య విధానాన్ని త్యజించి, మార్గాన్ని శోధించాను. సంఘాన్ని రక్షిస్తాను. విప్లవ రక్తపాతాలు లేకుండా చేస్తానని ‘ఫాసిజం’ తలెత్తనారంభించింది.
పెట్టుబడిదారీ విధానాన్ని దుబారించి, దోపిడీ విధానాన్ని ఆపివేసి, ప్రజాస్వామ్యంలోని మెత్తదనాన్ని కడిగివేసి, సంఘాన్ని రక్షిస్తాను, జనాన్ని మన్నిస్తానని ‘కమ్యూనిజం’ రష్యానుండి రంకెలు మొదలుపెట్టింది.
1918 నుంచి – 1939లో ద్వితీయ ప్రపంచ సంగ్రామం మొదలుపెట్టబడేంత వరకూ ఏ దేశ చరిత్ర జూచినా – ఏ మూల కథవిన్నా – ప్రజాస్వామ్య సిద్ధాంతాల దిగజారుడు, కొన్ని దేశాల్లో ఫాసిజం రేగటం, కొన్ని దేశాల్లో కమ్యూనిజ తలెత్తటం కనబడుతుంది. సిద్ధాంతాలు రాద్ధాంతాలుగా చేయబడి, రాద్ధాంతాలు సిద్ధాంతాలుగా చిత్రింపబడిన రోజులు, మానవకోటి తన చరిత్రలో ఎన్నడూ కనీవినీ యెరుగనంతగా సిద్ధాంతాల తర్జనభర్జనలు, రగడలు, ప్రచారాలు, అపచారాలు రేగిన రోజులు, మానవకోటి చూస్తూ చూస్తూ మారణ హోమాలకు, సిద్ధాంత యుద్ధాలకు, దేశాల నులిమివేతకు తయారౌతున్న రోజులు, ‘బలము గలవాడిదే రాజ్యం, కండగలవాడే మనిషి’గా ఇటు ఫాసిజం, అటు కమ్యూనిజం రాటు తేరుతున్న రోజులవి.
ఈ రెండు భయానక శక్తుల మధ్యా ఉక్కిరిబిక్కిరి అయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలు గిజగిజ కొట్టుకొంటూ, తమ మొగ్గును ‘ఫాసిజం’ వైపుకే తేల్చుకున్న రోజులవి.
“ఆడవాళ్లకు పిల్లల్ని కనటం ఎంత స్వభావసిద్ధమో, ఫాసిస్టు దేశాలకు యుద్ధం చేయటం అంత స్వభావసిద్ధమని” ముసోలినీ ప్రవచించే రోజులు. “అంతర్జాతీయ కార్మికులారా, ఏకముకండి – మీకు పోయేదేమీ లేదు” అంటూ వర్గపోరాటాన్ని పెంపరికం చేయటానికి కమ్యూనిజం కాట్లాడే రోజులవి. ఇటు ఫాసిజంకాని, అటు కమ్యూనిజంకాని రెండూ యుద్ధవాదాలే, పై వర్గాన్ని సమీకరిస్తుంది ఫాసిజం, క్రింది వర్గాల్ని సమీకరిస్తుంది కమ్యూనిజం. ఫాసిజంలో నాయకత్వం పై వర్గాలకే ఉంటుంది, కమ్యూనిజంలో క్రింది వర్గం పేరుతో మధ్యతరగతివాళ్ళకుంటుంది.
ఈ రెండు బలాలు 1939 మొదలు 46 వరకు మారణ హోమాన్ని, నిత్యాగ్ని హోమాల్ని సాగించినై, పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలు యుద్ధానంతరం నలిగిపోయి, శల్యావశిష్టంగా యుండి యుద్ధ వ్యతిరేకతవల్ల తప్ప మార్గం లేదన్న ధోరణిలో పడినై.
రష్యా రెండవ ప్రపంచ యుద్ధానంతరం, తనంత తాను బలీయంగా తయారు కాకపోయినా, అనుకూల పరిస్థితులవల్ల బ్రహ్మాండ శక్తిగా నిలిచింది. దీనికి యెదురుగా, అమెరికా, పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధిగా, పెత్తందారుగా నిలిచింది. రెండూ జనస్తోమత, ఆర్థిక సంపద బలీయంగా గల దేశాలే.
ఇంగ్లండు, పశ్చిమ యూరపు దేశాలు వీళ్ల సహాయం లేక బతక వీలులేని స్థితిలో చిక్కినై. ఈ కూటాన్ని యుద్ధ వ్యతిరేకత కూటంగా భావించవచ్చు. వీళ్ళు అమెరికా పెట్టుబడిదారీ విధానాన్నీ అంగీకరించరు. రష్యా కమ్యూనిస్టు నియంతృత్వాన్నీ సహించరు. వీళ్ళ పూర్వ సంప్రదాయాలుగాని, విజ్ఞానం గానీ ఈ రెండు మార్గాల్లో దేనినీ బలపరచదు. రష్యా అమెరికాలు యుద్ధ దేశాలు. ఈ పశ్చిమ యూరపు దేశాలు యుద్ధ వ్యతిరేక దేశాలు. కానీ, ఆర్థిక సహాయాన్ని అపేక్షించి,రష్యా చేయని సహాయం అమెరికా చేస్తే, దాన్ని స్వీకరించినై. ఈ దేశాలు స్థిమితంగా వుండి, బాగా తేరుకుంటే అసలు యుద్ధమే రాకుండా పోవచ్చు. లేకపోతే యుద్ధం తప్పకపోవచ్చు.
ఫాసిజం యుద్ధం తెచ్చిపెట్టిందని కమ్యూనిజం అంటుంది. లేనిగొడవలు తెచ్చి, తీరని పోరాటం పెట్టి యుద్ధాన్ని ప్రకోపింప జేసింది. కమ్యూనిజమే అని ఫాసిజం అంటుంది. ఏదైనా దూరంగా నుంచుని మన చుట్టూ జరిగే విధానాల్ని పరిశీలించి చూస్తే – పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించినట్టు కనబడ్డా, యుద్ధాల్లో దించి అసలుకే మోసం తెచ్చింది ఫాసిజం. ప్రజలకు శాంతీ తిండీ తెస్తానని బయలుదేరిన కమ్యూనిజం కూడా శాంతి తేలేకపోయింది. యుద్ధాల్నీ దోపిడీనీ ఆపలేకపోయింది. తానూ దోపిడీ చేస్తూనే వుంది. ప్రజలు భ్రాంతిపడ్డారు. తీరా చూస్తే, కమ్యూనిజంగూడా నేతిబీరకాయలోని నేతిలాగా తయారైంది.
ప్రజలకు దారీ తెన్నూ లేకుండా పోయింది. పూర్వపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలు 1914 నుంచి దిగజారుతూ, ఈ యుద్ధం తర్వాత గూడా, సరిగా కోలుకోలేదు. వాటికి తగిన సిద్ధాంతబలం దొరకలేదు. ఫాసిజం యూరపు నుంచి పోయి అమెరికా ఆసియాలకు ప్రాకింది. రష్యా జాతీయవాదంలో కూడా దూరి కమ్యూనిజాన్ని దేశభక్తికీ, దేశభక్తిని కమ్యూనిజానికీ తాకట్టు పెట్టిస్తూ రగడగా తయారైంది. జనానికి మోక్షం లేదా ఏమి అన్న నిస్పృహతో దీనస్థితి ఏర్పడింది. 1939 యుద్ధానికి పూర్వం చేసిన యుద్ధ ప్రయత్నాలకు వందల రెట్లు ప్రయత్నాలు సాగుతున్నాయి. యుద్ధమే వచ్చి ఆటంబాంబులతో ప్రారంభమైతే, దేనితో అంతమౌతుందో, మానవకోటి ఏమౌతుందో, మానవ నాగరికత ఏమయిపోతుందో ఊహించటానికి వీలుగా లేకుండా పోయింది.
ఈ స్థితిలో ఇక యుద్ధోదతి తప్ప మార్గం లేదా? మానవకోటికి మోక్షం లేదా? నాగరికతకు రక్షణ లేదా? అంతా భస్మీపటలం కావలసిందేనా? మానవుడు మానవుణ్ణి రక్షించుకోలేడా? అన్న ప్రశ్నలు ప్రతి నాగరికునికీ రాకతప్పదు. ఆ ప్రశ్నలే వేసుకుని, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మేధాసంపన్నులు, వివిధరీతుల సమాధానాలు ఇస్తూ ఉన్నారు. అటువంటి ప్రశ్నలే లేవదీసి, నాటికి మన దేశంలో యం.యన్.రాయ్, రాడికల్ హ్యూమనిస్టులు కొన్ని సమాధానాలిచ్చారు. వారి ప్రయత్న ఫలితమే రాడికల్ హ్యూమనిజం. ఈనాటి సాంఘిక వ్యవస్థలో రేగిన ప్రశ్నలకు వచ్చిన అడ్డంకులకు – మానవుడు వివిధ రంగాల్లో పొందిన విజ్ఞానాన్ని తరవెళ్ళు వేసి, నిగ్గుతేల్చి – సంజాయిషీ ఇచ్చి, మానవాభ్యుదయానికి మరో మార్గాన్ని చూపారు. అదే హ్యూమనిస్టుల కృషి. ఈ యుద్ధంవల్లా తర్వాతి కథవల్లా వారు నేర్చిన గుణపాఠాల సారాంశమిదే. మానవునికి నవ్యమార్గాన్ని చూపి, అతడినే సర్వానికీ కేంద్రంగా పరిగణిస్తుంది గనుక – “నవ్యమానవవాదం”గా వ్యవహరింపబడుతుంది. అందుకే దాన్ని ఇంగ్లీషులో “హ్యూమనిజం” అన్నారు. ఇదీ – హ్యూమనిస్టు ఉద్యమం అవతరించిన కథ.
(ఇంకా ఉంది)
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి