5, మార్చి 2011, శనివారం

నవ్యసాహిత్యంలో ప్రయోజనాలు

sitting AGK with Vallabhajosyula Subbarao, Principal, Hindu College, Guntur
కావ్యప్రయోజనము

భాషకొక మాధుర్యం వుంటుంది. దాన్ననుసరించి గానం చేసే విధానమూ  వుంటుంది. ఇంగ్లీషును తెలుగులో దస్తావేజు మతలబులాగా చదివేవారున్నారు. కబీర్ ను కూడా హిందీలో చదివేటప్పుడు అన్యాయం చేశాడురాఅనిపించేటట్లుండగూడదు. కొందరు పాశ్చాత్యులను ముల్లు పోట్లు పొడవటం మనవారికి అలవాటైపోయింది. వారు  ‘కళ, కళ కోసమేనన్నారని, విమర్శిస్తుంటారు. అది వారిలో ఒక వాదనేనన్న విషయం విస్మరిస్తున్నారు. అలాగే మన ఆలంకారికుల్లోనూ వాద భేదాలు శతసహస్రాలుగా వున్నయ్.. ఈ ప్రాశ్చ్య పాశ్చాత్యులు ఎవరు ముందు చెప్పినా, ఒకరికి తెలియకుండానే మరొకరు చెప్పారు. ఏమైనా పూర్వులు చెప్పింది మర్చిపోకూడదు. అది తప్ప జ్ఞానం లేదనుకోవటం మంచిది కాదు. అదీగాక సహృదయత వుండటం అవసరం. అది లేకపోతే పరిషత్తులు పనిచేయవు.

కావ్యమంటే ఏమిటి అన్న ప్రశ్న వున్నది. కవికృతం కావ్యం అన్నారు. కవిత చెప్పంగ చెప్పంగ కవియుగాన అని ఒక హరికథ దాసు చెప్పాడు. ఈ విషయంలోనూ వాద భేదాలు వున్నాయి. ఇప్పుడు వాదనలు లేవదీస్తున్న వారిలో పూర్వ కవిత్వం చదవనివారు, చదివినవారు సాన్నిహిత్యం లేని వారు. పైగా పాశ్చాత్య, ఉత్తర, దక్షిణ తూర్పువాదాల ప్రభావం పడినవారు వున్నారు. వ్యక్తి వికాసాభివృద్ధితో పూర్వ కవిత్వాన్ని కొలిస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మన సాహిత్యంలో పిష్టవేషణం విశేషంగా కనిపిస్తుంది. ఇక మన సమస్య జీవితానికి కావ్య ప్రయోజనం ఏమిటి? అని పరిశీలించటం. ముందు జీవితానికీ ప్రయోజనం తేల్తే, కావ్యప్రయోజనం తేల్తుంది. మత దృష్ట్యానైతే, (ఏ మతమైనా) మోక్ష సిద్ధి మానవుడి చరమలక్ష్యము. నా దృష్టిలో సుఖంగా జీవించటమే ప్రయోజనం. ఈ మాటంటే తెలుగులో చార్వాకుడనీ, ఆంగ్లంలో ఎపిక్యూరియన్ అనీ నిందిస్తారు. సత్యం చెప్పటం, మంచిగా వుండటం నాకు ఆనందాన్నిస్తుంది. గాబట్టి నేనలా చేస్తానని ఎపిక్యూరన్ అన్నాడు. అది లోలత్వం అన్నారంటే అర్థం జేసికోండి. ఆనందం, సుఖం, అందం, అనేవాటిలో తరమన భేదాలున్నవి. జీవితాన్ని మధుమయం చేయటానికి కావ్యం ఉపయోగపడాలి. దాన్ని కొలిచేవారిని బట్టి శ్రేణులున్నాయి. ఆ కొలిచేందుకు కొన్ని అంతస్థులుంటాయి. నన్నయగారు తన భారతాన్ని ఏ రకపు వారు చదివితే అలాగే కనిపిస్తుందని, కనిపించాలని ఆశించాడు. సామాన్యుని దృష్టిలో అది ఒక పురాణం మాత్రమే. కొందరు కౌరవుల్ని నీరుగానూ, పాండవుల్ని పాలుగానూ వర్ణిస్తూంటారు. బ్రతకటానికి మొదటిదే అత్యవసరమని గుర్తిస్తే ఆ మాట అనరు.

కావ్యాన్ని మూడు విధాలుగా చూడొచ్చు. చారిత్రక, సాంఘిక, సాహిత్య దృష్టులు.
చారిత్రక దృష్టిలో భారతాన్ని చూస్తే, అబద్ధలాపుట్ట ఫ్యాక్టరీ అనవచ్చు. అసలు భారతం ప్రతుల్లో అనేకరకాలున్నవి. అన్నిటిని మించి కుంభకోణం ప్రతి అలా ఎందుకు పెరిగిందో అర్థం కావటం లేదు. భారతం పుష్యమిత్రుడి చేతిలో పడిన తర్వాత కుల, వర్ణ, వ్యవస్థల కావ్యంగా మారిపోయింది. డాక్టర్ గోఖలే ఈ విషయాన్ని వ్రాశాడు. పాశ్చాత్యులు బాగా వ్రాయలేదని తిరగ రాయిస్తున్న మున్షీ కూడా అలాగే వ్రాయిస్తున్నాడు. ప్రతిభవలెనో, ఉత్పత్తి వలనో జన్యమైనది భారతం. భారతం ఉదాత్త కావ్యమే. మాక్సుముల్లర్ దాన్ని కావ్యాల, పురాణాల సంపుటి అన్నాడు. అసలు కావ్యోద్భవ విషయం, పాండవ పక్షపాత దృష్టి ఆంధ్రలో కవిరాజు వచ్చేవరకూ బయటపడలేదు. ఆయనే మొదట కావ్యస్థాయిలో దాన్ని విశదం చేశాడు.
సాంఘిక దృష్టిలో సాహిత్యాన్ని కొలవాలంటే మన అంగీకారం అనంగీకారం బట్టి వీలౌవుతుంది. కావ్యాన్ని సాహిత్య దృష్టిలో చూడాలంటే పై రెండు మర్చిపోవాలి. నిండు మనంబు నవ్యనవనీత సమానము అనే పద్యంలో నన్నయ ఏదో వర్ణవ్యవస్థ ప్రవేశ పెట్టాలంటే ఎలా?


నవ్యసాహిత్యంలో ప్రయోజనాలు

ఆధునికుల్లో ప్రయోజనాన్ని అర్థించి వ్రాసినవారు తక్కువ. గిడుగు ప్రయోజనాన్ని ఆశించినా కావ్య నిర్మాత కాదు. కందుకూరిలో కొంత ప్రయోజనం వుంది. కవిరాజులో పూర్తిగా ప్రయోజనం వున్నది. చలంలో అదోరకమైన, వికారమైన శృంగార ప్రయోజనం కద్దు. శ్రీపాదలో పుస్తకాలు వ్రాయటం తప్ప నాకేమీ ప్రయోజనం కనిపించలేదు. అగ్రశ్రేణిలో ఖండ కావ్యాలు (శిశువు స్మశానంవంటివి) వ్రాసిన జాషువాలాంటివారు అరుదు. ఇక పూర్వం నన్నయ ఆశించిన ప్రయోజనాన్ని సాధించ దలచినవారు విశ్వనాథ, నోరిగారలు. తెలుగులో రామాయణానికి తగిన అనవాదం లేదు. భారత భాగవత కర్తలు మంచి అర్హత సంపాదించారు. ఆ స్థానాన్ని ఆక్రమించాలనే అహంతో విశ్వనాథ రామాయణం వ్రాశారు. విశ్వనాథలో కవిత్వం, శిల్పం వున్నవి. మొత్తం రామాయణంలో ఏడెనిమిది ఘట్టాలు తప్ప, మిగిలినది కష్టపడటం తప్ప, మరేమీలేదు. ఇదివరకు ‘శృంగార వీధి’ అని వ్రాశారు. మేము దాన్ని వీధి శృంగారం అంటుండే వాళ్ళం. భాష తెగమేసి బలసిన పసరమగుట చేసినపని తప్ప మరొకటి గాదు అది. రామాయణానికి తెలుగులో తేటగీతి, ఆట వెలది అయితే బాగుంటవి.
ఇక కాళిదాసు అనుకున్నంత స్వతహా కవిగాదు. వాల్మీకి నుండి చాలా అప్పు దెచ్చుకున్నాడు. ఒక మహాకవి నుండి యింతగా ఎరువు తెచ్చుకోవటం ప్రపంచంలో మరెక్కడా లేని విషయం, అలాగే నన్నయ కన్నడ భారతం నుండి చాలా గ్రహించాడు. దాన్ని చౌర్యం అని నేనను. కృతజ్ఞతా సూచకంగా పేర్కొంటే బాగుండేది. చెప్పకపోయినా మనం కనుక్కుంటామనుకోండి.  ఈ రెండు విష.యాలు స్పష్టాలు. పరిషత్తులు వీనిపై కూడా కృషి సల్పి ప్రజలకు విషయాన్ని స్పష్టం చేయాలి.

రేపల్లె శ్రీ శారదా విద్యాపీఠంలో చేసిన ప్రసంగం 1958లో -Guntur district, AP, India
AGK (Avula Gopalakrishna Murthy)