7, మార్చి 2011, సోమవారం

ఆంధ్ర భాష విశిష్టతలు

ఆంధ్ర భాషా ప్రాశస్త్యము

మహిమన్ వాగనుశాసనుండు సృజియింపన్ కుండలీంద్రుడు త
న్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా
మహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య మూహించెదన్
అని ఆంధ్ర కవితా మాధుర్యమధుర్యతలోని ప్రాగల్భ్యాన్ని కవిలోకవతంసులు కమనీయముగా ప్రసక్తి చేసిరి. అట్టి భాషా ప్రాశస్త్యాన్ని మన మీ సమయమున పరిశీలించి ప్రపంచించుకొను యౌచితిని గమనించి వ్యవహరించుటయే యగును.
కవితా రీతులలోనివాద భేదములకన్న, భాషా చరిత్రలోని వైషమ్యములే మిన్నగ నున్నవి. ఇదమిత్థమని తేల్చి చెప్పగలిగిన చోటుల కుయుక్తులకేమిగాని, అటుల తేల్చవీలులేక,  నిశితదృష్టిని నిర్ణయింపవలసిన చోటుల పరిశీలన న్యాయముతో కథాకథనమును మలచికొనవలెను.
పూర్వముకన్న నేడు భాషా విషయక పరిశోధనలు ముందడుగు వేసినను, చారిత్రక పరిశోధనలలో గూడ భాషా విషయక రహస్యములనేకములు వ్యక్తమైనందువలన, ఆయా పరిశోధనా ఫలితములను సమన్వయము చేసి చూపి, మార్గము నిర్ణయము చేయ వీలు పొడకట్టు చున్నది.
అందువలన, మనము భాషా పరిశోధనా రీతులను చారిత్రక పరిశోధనా మార్గములను అవలోకించి సమన్వయింపజేసికొని, ఆంధ్రభాషా ప్రాశస్త్యాన్ని పరామర్శించుకొందము.
ఆంధ్ర శబ్దము ఐతరేయ బ్రాహ్మణమునను, రామాయణ భారత స్కాంద పురాణ, భాగవతాదులందును వాడబడినది. బుద్ధఘోషుడు ఆంధ్రుల అర్థకథలను పేర్కొనినాడు. నాల్గవ శతాబ్దిలో సంచరించిన యుయన్ ఛాంగ్స్ ఆంధ్రుల భాషకు, వుత్తరాది భాషలకు భేదము చాలకలదని, వేరు భాషలని ప్రస్తావించినాడు. కాని, లిపిసామ్యమును గూర్చిన వారి ప్రస్తావన గమనార్హము.
జైనులైన పల్లవుల దాడులకు పూర్వము (200 క్రీ.శ.) ఆంధ్రలో బౌద్ధ సాహిత్యముండుట, ప్రాకృత భాషకు దగ్గరగా భాష యుండుట, చరిత్రకారులు గమనించిన విషయములలో నొకటి. జైనుడైన అధర్వణుని భారతమును తరువాత వచ్చిన చాళుక్యుల కాలములో (600 క్రీ.శ.) అపురూపము చేసినారని చరితల నుడి కలదు. పల్లవుల రాకకు పూర్వము నాలుగువందల యేండ్లు ఆంధ్రుల ప్రభ వెలిగిన చరిత్ర దీధితులు కలవు. ఆంధ్ర పాలనా ప్రాభవాలు, దండకారణ్య భాగములందునే కాక, ధాన్యకటకాదులయందు మాత్రమే కాక, చిత్రవ్యాప్తి నొందెను. అందుచేత, ఆంధ్ర జాతీయ విశిష్టతలను పర్యావలోకనము చేయునపుడు కొన్ని ప్రశ్నలుదయించుట సహజము (1) ఆర్య సంప్రదాయైక శాఖగా ఆంధ్రులుండి, ఆర్యభాషనే చేకొని, దక్షిణావనికి వచ్చి, ఆర్యేతర సంస్కృతిలో మగ్నమై నిలిచిరా? (3) ఆర్యేతరమైన ఉత్తరాది శాఖయేయయ్యు, ఆర్యుల భాషా సంస్కృతులను చేకొని దక్షిణమునకు వచ్చిరా? (3) దాక్షిణాత్య ద్రావిడ శాఖయులేయయ్యు, ఆర్య సంపర్కము పొంది, సంస్కృత భాషా మాధుర్యమరసి, దాని లోగొని, పరిణతి నొందిన జాతి, భాషయగునా?
ఇట్టి ప్రశ్నలే చాల కలవు. భాషా విషయకంగా ఆంధ్రము సంస్కృత ప్రాకృతజన్యమా? భేద భాషయా? సామ్య భాషయా.. భేదమయ్యు, సామ్యత పొందినదా? లేక, కేవల విజాతీయమా? అన్న ప్రశ్నలునూ కలవు.
ఈ ప్రశ్న లిట్టులుండ, భాషల చరిత్ర చూడగా, ద్రావిడము, సంస్కృతము, ప్రాకృతము, పాళీ భాషలు పూర్వకాలమున కనబడు చుండెడివి. జన వాక్యముగా, సంస్కృతమును ఎల్ల భాషలకు తల్లిగా మనవారు చూడ నారంభించిరి. కొందరు ప్రాకృత, పాళీ భాషలు సంస్కృతమున కన్నను ప్రాచీనములని, ప్రాకృతమును సంస్కరించుట వలన సంస్కృత మేర్పడినదని సోదాహరణముగా జెప్పుదురు. ఇట్టి భావములు పెరిగి, ద్రావిడ భాషలు వేరు భాషలు కావని, సంస్కృత జన్యములని బలీయమైన వాదనలను భాషా రంగమున నిర్మించియుండిరి. కాని, చరిత్ర నేర్పెడు గుణపాఠములు మన కట్టు కథలను నిల్వనివ్వవు. సంస్కృత విషయము గూడ యట్లేయయ్యెను. పాపము పండినదో, శాంతించినదో చదువరులే వూహింపవలెను.
మొహంజదారో హరప్ప, నాగరికత బయటపడుటతో నెన్నియో కొత్త సత్యములు బయటపడినవి. రాళ్ళు రప్పలే కాదు బయటపడుట, ఆ నాగరికత 2750 వత్సరాలుగా క్రీస్తుపూర్వమున్నట్టిది. నేటికి 4710 సంవత్సరముల వయసు కలది. ఆ పిమ్మట 1000 సంవత్సరములకు వైదిక భాషాయుగము, దాని తర్వాత సంస్కృత భాషా యుగము ప్రారంభమైనది. వేద భాష సంస్కృతము కాదు. తద్భిన్నము. వేద భాష, పాళీ ప్రాకృత మిశ్రమముగా నుండవచ్చునని కొందరు భాషావాదులనుచుండిరి. ఏది ఏమైనను, మొహంజదారో హరప్పా నాగరికతకు 1500 సంవత్సరములు దాటిన తరువాతనే సంస్కృత మాగమనమైనది. మరి మొహంజదారో హరప్పా నాగరికత నాటి భాష యేమి?
పెద్దదైన చరిత్రకారులు, భాషా నిపుణులు, భాషా తత్త్వజ్ఞులు చెప్పుమాటలేమన, ఆనాటి లిపిని పరిశీలించి, లిపి భాష యెట్టిదో చూడగా, అది ద్రావిడభాషయని బహుపండితాభిప్రాయముగా చెప్పబడుచున్నది. సింధునదీ లోయలో నేటికి 4710 వత్సరములకు పూర్వ యుగంలో, ద్రావిడభాష యున్నదని నిర్ధారణ  అయినప్పుడు, ఆసేతు హిమాలయముల వరకు ద్రావిడమేయనియన్న అతిశయోక్తిగాని, భిన్నోక్తిగానికాదు.
కాబట్టి, ఇండియాలో యావద్భాగవ్యాప్తమైన ప్రాచీనతరమైన భాష ...ద్రావిడభాష... దానితరువాత 1000 వత్సరములకు వైదిక యుగారంభమై, తరువాత సంస్కృతము వచ్చినదని చరిత్ర ధృవపరచుచున్నది. ఆర్యుల రాకకు సంస్కృతమునకు అవినాభావ సంబంధమున్నది.
ఆంధ్రభాష ద్రావిడ భాష. ద్రావిడ భాష 4710 సంవత్సరములకు పూర్వమే కలదు. ద్రావిడ భాష ఆంధ్ర, కన్నడ, తమిళ, మళయాళపు భాషలుగా విభాగము లెప్పుడైనది సరియైన చరిత్రకాధారములు లేవు. ఎప్పుడైననేమి? ప్రాచీనత తేలినదిగదా!
మరొక్క విషయము ప్రాకృతమును సంస్కరించి సంస్కృతమును భాషగా ఏర్పరచినట్లు కనబడుచున్నది. ప్రాకృతము, శౌరసేని, మాగధి, పైశాచి, ఆంధ్రయన్న నాలుగు వుపభాషలలో వెలారినట్లు చారిత్రక నిదర్శనములు పొడచూపు చున్నవి. ప్రాకృత ఆంధ్రోపభాషగా జేసికొన్నప్పుడు ఆంధ్ర ప్రాకృతము సంస్కృత భాషకన్నను ముందున్నదన్న తప్పుకాదు. తప్పేమి? ఒప్పేయగును. లేదా, ప్రాకృతము సంస్కరింపబడుట, ఆంధ్ర ప్రాకృతముల ఆగమనము సమకాలికమని భావింతురా? ఏల భావింపవలె? తెనుగు ప్రాకృతమును ఆంధ్రీకరించుటయే సంస్కరించుటయని, ఆంధ్ర ప్రాకృతము నుండియే సంస్కృతము వుద్భవించిందన్న చారిత్రకాపచారమెట్లగును? భాషా వాద వికారమెట్లగును? ప్రాకృతమును వికృతి చేయ తెలుగు, ప్రాకృతమును సంస్కరింప సంస్కృతములైనవగుట గూడా సమంజసమే యగునా? కావున భాషా రహస్యములెట్టివో చూడగా, వినూత్న రచనా సంవిధానము లేర్పడుచున్నదని భావింపక తప్పదు. అది చారిత్రక, భాషావాద విషయకమైన కథ.
ఇక లౌకిక దృష్టితో పరిశీలింతము. మనకు ఆంధ్రము చతుర్విధకవిత కలదు -
ఆశు, మధుర, చిత్ర, విస్తరరీతులు. సంస్కృతమున నిట్టిది లేదు. మన గ్రంథాది శ్రీకారముతో జేయుట చూచితిమి. ఇది సంస్కృతమున లేదు. మన భాషలో రగడలు, సీసములు, గీతలు, తరువోజలు, అక్కరలు, మంగళములు, కలికలు, ఉత్కలికలు, మహశ్రీలు కలవు. ఇట్టివి సంస్కృతమున లేవు.
మార్గకవితలలో మహా కావ్యములు, పురాణములు, చంపువులు, ప్రబంధములు మాత్రమే కలవు. తెలుగున అవియే గాక ద్విపదలు, యక్షగానములు, శతకములు, ఉదాహరణ దండకములు, ఏల, జోల, లాలిపాటలు, మరెన్నో రీతులు పాటలు దేశికవితలుగా కలవు. ఆంధ్ర భాషకట్టివనేక విశిష్టతలు కలవు. ఆంధ్రభాషా ప్రాశస్త్యమిట్టిది. 

AGK- AVULA GOPALAKRISHNA MURTHY SPEECH   
ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆంధ్రాభ్యుదయ వారోత్సవాల ప్రారంభోపన్యాసం 1960లో




1 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

తెలుగు భాష ప్రాచీనత అంగీకరింపబడినది కదా.దాని అస్తిత్వమే ఇప్పుడు కాపాడుకోవాలి. తెలుగు ద్రావిడ భాషా కుటుంబమునకు చెందినదైనా ,సంస్కృతము చే ఎక్కువగా ప్రభావితమయినదని పండితుల ,పరిశోధకుల అభిప్రాయము-రమణారావుముద్దు. .