ఠాగూరు ఉత్సవాలు దేశమంతటా ప్రభుత్వం చేసింది. దేశంలో ఉన్న 43కోట్లమందిలో ప్రతి ఒక్కరు ఈ సందర్భంలో ఠాగూరును గురించి మాట్లాడవచ్చు. కాదనటానికి వీల్లేదు. ఈ సంవత్సరంలో టాగూరు యజ్ఞపశువు. టాగూరును కృతజ్ఞత చూపటానికి సంవత్సర జాతర అవసరం లేదు. ఒక వారం చాలు. ఇదివరకు ప్రభుత్వం బుద్ధుని 2500 వ జయంతి జరినట్లుగా ఇదీ జరిపితే బాగుండేది. టాగూరును రాజకీయాల్లోకి లాగుతున్నారు. బెంగాల్ రాజకీయాలకూ, ఢిల్లీ పరిస్థితులకూ దగ్గర సంబంధం ఉన్నది. ఏదో విధంగా, ప్రజలు టాగూరును చదివితే ఫరవాలేదు. అదే కావాలి. చదవకుండా మాట్లాడే దానికంటే కొంతైనా చదవటం మంచిది. అయితే ప్రభుత్వం పెద్ద పట్టణాలలో కళామందిరాలను టాగూరు పేరుతో నిర్మిస్తున్నది. ఆ పేరుతోనైనా కొంత ఉపయోగం జరుగుతున్నా ఈ ఖర్చు ప్రజలకు తెలియకుండా జరుగుతున్నది. ఇక టాగూరు పరిశీలన చేద్దాం.
టాగూరు చక్కని వాతావరణంలో, పరిసరాల్లో పెరిగాడు. జమీందారీ కుటుంబం గనుక ఆర్థిక సౌకర్యాలు అమరి, 12 ఏళ్ళకే విదేశాలకు వెళ్ళివచ్చాడు, ఆసక్తి ఉన్న విషయాలపై ప్రత్యేక ఉపాధ్యాయునితో చెప్పించుకొని, విజ్ఞానార్జన చేశాడు. కలకత్తాలో ఆయన చదివిన పాఠశాలలు కూడా చక్కనివి. మన ప్రాథమిక పాఠశాలల్లో, కొన్నిచోట్ల, పందులు కూడా పడుకోవు, అలాటిచోట్ల మన పిల్లలు కూర్చొని చదువుతున్నారంటే, శుభ్రత చదువు ఏం అబ్బుతాయి....
టాగూరు చిన్నతనం నుండీ అనగా 12 సంవత్సరాల నుండీ కవిత్వం రచనారంభం గావించాడు. విదేశాల్లో మిల్టన్ మొదలగు కవులు అలా చేశారు. సున్నితంగా పెరిగినవాడు టాగూరు. మనస్సువలె దేహం కూడా సున్నితమే. అదే కవిత్వంలోకీ దొర్లింది. ఒకరన్నట్లుగా టాగూరు ఉపమానాల్లో కోటీశ్వరుడు. బృహత్తరంగా రచనలు చేశాడు. బెంగాల్ ప్రభుత్వం ఆయన రచనలన్నిటినీ 14 సంపుటాలుగా ప్రచురిస్తున్నది.
1905లో వంగ విభజన ఉద్యమం జరిగినప్పుడు, విదేశీ వస్త్ర బహిష్కరణ జరుగుతూ ఉన్నప్పుడు, విద్యావిహీనుల గుంపులో చేరవద్దని టాగూరు విద్యార్థులకు సలహాయిచ్చాడు. జాతీయ వాదపు ఉద్రేకాలకు కొట్టుకు పోలేదు టాగూరు.
నోబెల్ బహుమానం రాకపూర్వం టాగూరు విషయం బెంగాల్.లోనే సరిగా తెలియదు. అది వచ్చిన తర్వాత, ఉద్రేకంగా వీరారాధన చేశారు బెంగాలీయులు. గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశింపక పూర్వమే భారతదేశాన్ని సాహిత్యంలో విదేశాలకు పరిచయం చేశాడు టాగూరు.
ముమ్మరంగా ఖద్దరు ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఒకసారి ముతక గుడ్డల గాంధీ, సిల్కు దుస్తుల టాగూరు దగ్గరకు వెళ్ళి ....మీరుకూడా ఖద్దరు ధరించి, నా ఉద్యమానికి అండ చేకూర్చకూడదా.... అంటే, ....నన్ను కవిత్వ రచన మానుకోమంటారా.,... అని టాగూరు ప్రశ్నించాడు. దానితో తిరిగి వెళ్ళాడు గాంధీ. అలా వ్యక్తుల కోసం తన ధోరణి మార్చుకునే వ్యక్తి కాదు టాగూరు.
సన్నివేశాల సృష్టిలో టాగూరు ప్రతిభా వ్యుత్పన్నుడు. ఒక కథలో బారెస్టరు చదువు చదివి, విదేశాల నుండి తిరిగి వచ్చి, అంతర్వర్ణ వివాహం చేసుకోటానికి సిద్ధపడి, ప్రేమించిన యువతి ప్రక్కన పెళ్ళి పీటలపై కూర్చొని తాళి కట్టబోతుండగా, తండ్రి వచ్చి చెయ్యిబట్టి లాక్కెళ్ళగా, మౌనంగా వెళ్ళిపోతాడు... హృదయానికి హత్తుకుపోయే యిలాంటి సన్నివేశాలు టాగూరు నవలల్లో కథల్లో అనేకం కన్పిస్తాయి.
ఇక నోబెల్ బహుమానం వచ్చిన ....గీతాంజలి... గురించి వ్యక్తిగతంగా నాకు అది నచ్చలేదు. ఈ విధమైన రచనల్ని మిస్టిజం అంటారు. అంటే పులుముడు. అరవిందుని ప్రభావం ఇలాంటిదే. వ్యక్తి ఆధ్యాత్మికంగా సంపూర్ణత్వానికి చేరుకోటంలో అరవిందుని ప్రయత్నమే, కవిత్వంలో టాగూరు ప్రయత్నించి ఈ పులుముడులోకి దించాడు.
టాగూరు అనేక దేశాలు పర్యటించి, ఉపన్యాసాలు చేశాడు. చివరిదశలో వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని అన్నిటికీ మించి మానవత్వాన్ని గమనించి, గుర్తించాడు. తన సుదీర్ఘ జీవితంలో చివరకు ఏదో అసంతృప్తి మిగిలి ఉన్నట్లు ఆయన చివరి వ్యాసాల్లో స్పష్టం అవుతుంది. చివరి దశలో ఒక సమావేశానికి సందేశం పంపుతూ – రష్యా అభివృద్ధిని శ్లాఘించి, స్వేచ్ఛ ద్వారా అభివృద్ధి సాధించాలని కోరాడు. అయితే నియంతృత్వ ధోరణివైపు కూడా కొంత మొగ్గు చూపకపోలేదు. వ్యక్తికీ, జాతికీ, పోరాటం వచ్చినప్పుడు, వ్యక్తినే గుర్తిస్తానన్నాడు టాగూరు. ఆయన జపాన్ ఉపన్యాసాలు ఈ థోరణిలోనే నడిచినయి.
ఆంధ్రదేశంపై శరత్ అంతగా టాగూరు ప్రభావం లేదు. అసలు సరైన అనువాదమే లేదు. ఇకనైనా వస్తాయని ఆశించవచ్చా... దేశీయ భాషల్లో టాగూరు ప్రభావం స్వల్పం. ఆలోటు తీరాలి. తీర్చాలి. జాతరగాకాక టాగూరును సరిగా అర్థం చేసుకో ప్రయత్నించాలి.
1960లో చీరాల సాంస్కృతిక సమితిలో చేసిన ఉపన్యాసం
(This speech was translated and sent to Radical Humanist weekly and the editor Professor Sib Narayan ray could not digest and refused to publish it. Another editor in the board Mr V .B.Karnik requested me not to insist for its publication! That was the sentimental attachement to Tagore by Bengalis!!)
ఆవుల గోపాల క్రి ష్న మూర్తి చీరాలలో చేసిన నిశిత పరిశీలన ప్రచురించడానికి నాడు రాడికల్ హూమనిస్త్ ఇంగ్లిష్ వారపత్రిక తపటాయించింది.నేను పట్టు పట్టగా వదలేయమని ఎ.జి.కె అన్నారు . బెంగాల్ సెంటొమెంట్ అలా పని చేసింది రాడికల్ హూమనిస్త్ లపై కూడా !
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి