రావిపూడి ‘జీవమంటే ఏమిటి?’
గ్రంథానికి పరిచయం
ఆవుల గోపాలకృష్ణమూర్తి
ఆవుల గోపాలకృష్ణమూర్తి
అసలు వెంకటాద్రి కవి – కొంత గాయకుడు. అప్పుడప్పుడు నటుడు కూడాను – యించుమించు పౌరాణికుడన్నమాట. పురాణాల్ని, ఇతిహాసాల్ని, ప్రబంధాల్ని చదివి, వాటిలోబడి కొట్టుకుపోవలసిన వాతావరణంలో వుండిగూడా, యెదురు తిరిగి, నిలద్రొక్కుకుని, ఆ పౌరాణిక వాసనలను అధిగమించి, గడుసుగా బయటపడ్డాడు.
ఆ రోజుల్లో ‘ముష్టింపచా’ శతకాలు, జటావల్లభుల పురుషోత్తంగారి ‘హిందూ మతము’ అన్న పుస్తకానికి ప్రతి రచనలు చేస్తూ, పౌరాణికుడొక తప్పు చేస్తే, ఆ తప్పును చూపిస్తూ తానూ ఒక తప్పు చేస్తూ వుండేవాడు. ఆ రోజులు దాటిపోయినై.
పౌరాణికం దాటి రాజకీయాల ద్వారా నవయుగంలో ప్రవేశించి, యీనాటి రచనలకు పునాదులు ప్రారంభించుకున్నాడు. అది అయిదేళ్ళనాటి మాట. ఈ లోగా వెంకటాద్రి యెంతో పెరిగాడు.
వెంకటాద్రి విజ్ఞానశాస్త్ర గ్రంథాలు, తత్వగ్రంథాలు పఠించటం మొదలు పెట్టినాక, ప్లేటో చేసిన పాపమో, సైన్సు చేసిన పుణ్యమోగాని, కవిత్వమన్నా, కవులన్నా, ఆ బాపతు వ్యవహారమన్నా ఆదరించడం మానివేసి, నిరసించటం మొదలు పెట్టాడు. అదే ఆయన శాస్త్ర విద్యకు మొదలు, ఫలితం ‘విశ్వాన్వేషణ’ రెండో కృతి ప్రస్తుత రచన, దీంతో వెంకటాద్రి యిక యెన్ని పుస్తకాలయినా వ్రాస్తాడన్న ధైర్యం చిక్కింది. మనకు హామిబడి పూచీగూడా యిస్తున్నాడు.
అది ప్రశ్నలనీ, అనాది ప్రశ్నలనీ మతవాదులు, వేదాంతులు, విజ్ఞానశాస్త్రవేత్తలు, యితరత్రా తెలిసీ తెలియని వారందరూ రుచి తగ్గకుండా చర్చించుకునే ముఖ్యమైన మూలవిషయాన్ని గురించి ...జీవమంటే ఏమిటి... అన్న పుస్తకం ఆ వాదాలకు ఒక రూపాన్ని యిచ్చింది.
మతకర్తలందరూ పదార్థం వేరనీ, మనస్సు వేరనీ భావిస్తారు. జగత్తు సత్తు అని, జగదీశ్వరుడు అసత్తు అనీ, అసత్తు నుండి సత్తు వుత్పన్నమైనదనీ వాదిస్తారు. సత్తు లక్షణం తెలిసినా, అసత్తు లక్ష్య లక్షణాలు తెలియబడనివని వేదాంతీకరిస్తారు. దీంతో బయలుదేరిన చర్చలు, ఒకర్ని ఆధ్యాత్మిక వాదుల్నిగా, మరొకర్ని పదార్థవాదుల్నిగా చేసివేసినై, స్థూలంగా ఒకే వాదనకు చెందిన వారిలో గూడా తరతమభేదాలు యేర్పడినవి.
జీవం యెట్లా పుట్టింది? యెట్లా పెరిగింది? జీవాన్ని దేవుడే పుట్టించాడా? లేక జీవుడే దేవుణ్ణి పుట్టించాడా? అన్న ప్రశ్నలకు యిదమిత్థమని సమాధానాలు కుదరక, రగడలు సాగినై. ఈ పుస్తకంలో ఆయా ప్రశ్నలకు సమాధానం కొంత సమీకరింపబడింది.
హేతుదృష్టి, సత్యాన్వేషణాసక్తి, ఓర్పు యీ తత్వజిజ్ఞాసలో యెంతో అవసరం. ఎదిరి వాదన మనకు నచ్చకపోయినా, యెదుటివాని నిజాయితీని శంకించకూడదు. అందరికీ అన్ని విషయాలు తెలియవు. తెలియకపోయినా మాట్లాడే కుతూహలం వుంటుంది. అందువల్ల విషయప్రధానమైన చర్చ మనం చేసుకోవాలి.
భావవాదనకు, పదార్థవాదనకు – అంటే ఆధ్యాత్మికవాదులకు, భౌతిక వాదులకు జరిగే పోరాటాల్లో, విజ్ఞానశాస్త్రం తెల్పిన బాటలో యీ పుస్తకం నడిచింది. ఈ చర్చలోకి వెళ్ళేముందు, మతాల విషయం ఒకసారి చూడాలి.
క్రైస్తవమతంలోనూ, దానికి సన్నిహితంగా వున్న యిస్లాం మతంలోనూ, వాటికన్నా ప్రాచీనంగా చెప్పబడే వైదికమతంలోనూ, యితర చిన్న చిన్న మతాల్లో గూడా విశ్వాన్ని సృష్టించిన పరతత్వం ఒకటున్నదని అందరూ ఏకకంఠంతో అంగీకరిస్తారు. నిరీశ్వరవాదాన్ని నిర్జిస్తారు. ‘దైవం, జీవుడు, ప్రకృతి’కి గల సంబంధ బాంధవ్యాల్ని వివరించటంలో వేరువేరు రీతుల్లో ప్రయత్నించినా, బాటమాత్రం ఒకటే. మానవుడు ఆలోచనలో మనుగడ సాగించ ప్రారంభించినప్పటి నుంచీ కార్యాచరణ సంబంధాన్నిఅనుసంధానించుతూనే వచ్చాడు. అందువల్ల మానవుడు ప్రాయికంగా హేతువాది అని చెప్పవచ్చు. ఈ కార్యకారణ సంబంధాల్లో వున్న చిక్కుతోనే, అంత్యకారణంగా దేవుణ్ణి భావించాడు. దాంతో మానవుడు దైవాన్ని సృష్టించాడు. కాని మానవకల్పిత దైవమే మానవుణ్ణి తన సృష్టిగా చేసుకోగలిగింది. సృష్టి తన నిర్మాతనే తాను బందీగొన్న కథనమే తరువాత మతాల కథ. అన్ని దేశాలలోని మతాల కథ యిట్లాగే వుంది.
అందువల్ల, అన్ని మతాల దృష్ట్యా ప్రకృతి, దానిలోని జీవుడు దైవనిర్మితాలుగా భావించక తప్పినదికాదు. కొన్ని యుగాలుగా యీ భావం జరిగిపోయింది.
తరువాత భావ ప్రాధాన్యతను తొలగించి పదార్థ ప్రాధాన్యతను సంధించి భౌతిక వాదులు – దేవునికి కారణమేమిటి? అన్న ప్రశ్న వెలయించారు. దాంతో గాథలు ప్రగాఢంగా మారినై.
‘దేవుడు మానవుని ఉత్కృష్ట నిర్మాణం... అన్నాడు యింగర్ సాల్. ...దేవుడు లేకపోయినా, మానవుడు ఒక దేవుణ్ణి సృష్టించుకోక తప్ప’దన్నాడు వాల్టేర్. ఇంకా
పలువురు పలువిధాల అన్నారు.
పలువురు పలువిధాల అన్నారు.
ఇంతకీ, అంత్యకారణవాదంతో భావవాదం దెబ్బతిన్నది. కాని, మనస్సువేరు, పదార్థం వేరు అని గోల లేవదీసి, వాదనకు ప్రాణాన్ని బోసింది. దాంతో, బాగా ముందుకు వచ్చి కొందరు వేదాంతులు ‘దేవుడు సూక్ష్మాతిసూక్ష్మ పదార్థం’ అన్నారు. అరవిందుని అంతటివాడు పదార్థానికన్నా దేవుణ్ణి ముందు పెట్టలేక, దేవుణ్ణి వదలలేక, పదార్థ జన్యమైన విశిష్ట చైతన్యంగా దేవుణ్ణి భావించి, మనస్సు పదార్థమే అయినా, అది విశిష్ట పదార్థమనీ, చైతన్య స్థాయిలో పదార్థమనీ దాటుకోయత్నించాడు. అరవిందుడే దెబ్బతింటే శంకరుడు మాత్రం ‘దేవుడు, జీవుడు, ప్రకృతి’ త్రైతాన్ని సమర్థించాలని అద్వైతాన్ని ఆశ్రయించి మాయలో బడక తప్పిందికాదు. ఈ బాధలు పడలేక ‘దేవుణ్ణి సత్యం’గా దూసివేశాడు గాంధి.
కాని, ఆయన్ని యెవరేమి చేసినా, దేవుని పేరుతోనే మంచి, చర్చలు, తర్కాలు జ్ఞానం వుత్పన్నమైనవి. దానికని దేవునికి నిజంగా మనం కృతజ్ఞులం.
దేవుణ్ణి జారవిడిచినంతమాత్రాన సమస్య పరిష్కారం కాలేదు. ప్రకృతి పదార్థం, మనస్సు పదార్థం స్వయంసత్తా కలది. అణువుల సంయోగ వియోగాల వల్ల వృద్ధిక్షయములు కలుగుతున్నై. పదార్థంలో స్వయంగత, చేతన శక్తి వుంది అని భౌతికులు వాదిస్తారు. కాని పదార్థం యెక్కడిది... దానికి కారణం యెవరు... పదార్థం యెట్లా వుత్పన్నమైంది... అన్న ప్రశ్నలకు సంజాయిషీ భౌతికుల నుంచి గూడా రావటంలేదు.
దాంతో భౌతికం నుంచి తిరిగి ఆధ్యాత్మికం లాంటి ‘టెలిపతీ’ వాదనలు బయలుదేరుతున్నై. దేవుణ్ణి గురించి యెట్లా యెక్కడ నుంచి పుట్టాడని ప్రశ్న వేయకూడదని ఆధ్యాత్మిక వాదులన్నట్లే, పదార్థాన్ని గురించి ఆ ప్రశ్నలు వేయగూడదని భౌతిక వాదులంటున్నారు.
ఒక ప్రశ్న వెయ్యి. మరో ప్రశ్న వెయ్యబోకు అని యెవరు అడిగితే మాత్రం నవ్వనివారెవ్వరు?
అందుకని, భౌతిక వాదానికన్నా ఆధ్యాత్మికం మేలు అని కాదు. దేని చిక్కులు దానికి వున్నా పదార్థవాదమే స్వయం పోషకంగా వుంది.
జీవోత్పత్తి విషయంలో ఆధ్యాత్మికవాదాన్ని పదార్థవాదం యింకా బాగా దెబ్బతీసింది. ఆ కథాకథనాన్ని వెంకటాద్రి బాగా అభివర్ణించాడు. అందువల్ల మతాలు మానవునికి చేసినదంతా కీడేనా? మేలుగూడా యేమన్నా చేసినవా? ఆత్మవిశ్వాసం లేకనే మానవుడు దేవుణ్ణి సృష్టించుకొని, ఆ దేవునితో మనోస్థైర్యాన్ని పొందాడు. మానవునికి మనోస్థైర్యాన్ని యిచ్చి కొన్ని ఆపదల్లో కాపాడిన ‘మతానికి’ మనం మన కృతజ్ఞతను మరువరాదు.
ఇతర విషయాల మాదిరిగానే ‘మతం’ గూడా కొన్నాళ్ళయినాక, మానవుని భావనాశక్తి, స్వేచ్ఛకు సంకెళ్ళు వేయనారంభించింది. ఆ సంకెళ్ళను భౌతికవాదం బద్దలుకొట్టింది.
భౌతికవాదం కొన్ని సమస్యల్ని అన్వయం చేయలేకపోతుంది. అవసరమైతే భౌతికవాదం సంకెళ్ళను గూడా మానవుని స్వేచ్ఛాన్వేషణ బద్దలు కొట్టాలి. ఆ పని మతదృష్టి ద్వారా జరగదు. విజ్ఞానశాస్త్ర దృష్ట్యా జరగాలి. ఆ దృక్పథాన్ని ఈ పుస్తకం సూచిస్తుంది. ఆ సూచనను అందుకొని ముందుకుపోయే యెవరి కృషిజూచినా వెంకటాద్రి ఆనందంతో కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఆ కృతజ్ఞతల్ని పొందిన మనం సత్యాన్వేషణాసక్తులమవుతాము. (1951).
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి