28, మార్చి 2011, సోమవారం

త్రిపురనేని రామస్వామి భావపరిణామం by AGK

త్రిపురనేని రామస్వామి భావపరిణామం


కవిరాజదర్శనం నుండి

కవులనేకులుగా వున్నారు. అద్దంకి శాసన కాలం నుంచి  కవులున్నారు. తెలుగు కవులలో నాటినుండి నేటి వరకు స్వంత కావ్యాలను వ్రాసినవారు అరుదు. అనువాదములనో, ఆశ్ఛాదనములనో, కథలపుణికి పుచ్చి కల్పనలను అల్లుటతోనో కవుల ప్రతిభావ్యుత్పత్పులు పరిఢవిల్లుతీ వచ్చినవి.


రామాయణ భావుకులు, భారత భావుకులు, భాగవత భావుకులు, కాళిదాస భారతేత్యాది భావుకులతో తెలుగు సాహిత్యం నిండి కూర్చుంది. ఈ పెద్ద కృతులు పోగా, వుపాఖ్యాన పెంపరిక కృతులు జాస్తి కావొచ్చినవి.

మొత్తముమీద అనుకరణకు, అనువాదాలకు వున్న విలువ స్వంత కృతులకు లేదు. స్వంత కృతులు లేని కారణం చేత అట్లు జరిగినది.
ముక్తక కవులలో భావుకత కలదు కాని, అది పరిణతి చెందిన రీతి కాదు. శతక కవిత ముక్తకవిత. శతక కవులలో సాంఘిక భావుకులు కలరు. శతకాలను కావ్యాలనుగా యెంచకపోయిరి.
వర్తమానాంధ్రలో చారిత్రక పురుషుల గాథల చుట్టూ కావ్యాలు జాస్తిగా వచ్చినవి. ఇది జీవిత కథల సాహిత్యం. యివి పోతే సమాజాన్ని వుత్తేజపరచగలిగి, ఘూర్ణంపగలిగి, పూర్వాపరాల సమన్వయాభావం కలిగి, నూతన భావ పరిధుల్ని కల్పన జేయగల సాహిత్యం కొరవడింది. సాహిత్యంలో అవ్యవస్థ మేర్పడింది. కవితా ప్రతిభ గల్గి, విషయ గర్భితమై, వుత్పన్నతాశక్తి కల్గిన సాహిత్యం చాలా తక్కువ.
ఆ తక్కువగావున్న వున్నత కోవలోని సాహిత్యాన్ని యెక్కువగా సృష్టించినవాడు త్రిపురనేని రామస్వామి. అందులకే అతడు కవిరాజు.
కవిరాజు కవితలు భావప్రధానాలు. కవితకు నిలయాలు. రచనలో ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఆద్యంతాలు భావముమించు శైలితో, శైలినిమించు భావంతో నిండారి, పింపిసలాడుతూ వుంటవి. ఈ మాదిరి సాహిత్య మల్లినవారు లేరు. అందుకేవారు భావవిప్లవ కవులు.
వీరి రచనలకు పౌరాణిక, చారిత్రక, నైతికరంగాల్లో భావుకతలు కలవు. అది కురుక్షేత్రంగాని, శంబుక వధగాని, సూతపురాణములుగాని, ఖూనీగానీ, భగవద్గీతగానీ, కుప్పుస్వామి, ధూర్త మానవాశతకాలంగాని, నరకంగానీ, అంపకం గానీ – మరేదైనా సరే – పై నాలుగు భావరీతులు, యేకంగా గానీ, కలగాపులగంగాగానీ త్రిపురనేనిలో తాండవిస్తవి.
పురాణకథల్లో – కురుపాండవులు, రాముడు, ప్రహ్లాదుడు, కృష్ణుడు, ఏకలవ్యుడు మొదలైనవాటిల్లో పాతపురాణాల్లో కనబడే పక్షంగాక, అందులో తక్కువగా, నీచంగా చూడబడే పక్షంవైపు కవి బూగ్గి, పురాణాల్లో మెచ్చుకోబడే వారిలోకన్నా, వారిలోనే మకచి హెచ్చుగా వున్నదని, రెండోవైపు కథను చూపుతారు. విలువ ప్రధానాశ్రయంగా తీసుకొన్నారు.
చరిత్రాంశంగా పురాణాలు నిలవవు. రామాయణ, భారత గాథల కాల నిర్ణయాలు చేయటంలో రామస్వామిగారు నాటిక దొరికిన చారిత్రక పరిశోధనా వరవడిలోనే పయనించారు. కావ్యగత అంశాల్నీ గ్రహించారు. అంతేకాక, రామాయణగాథ యావత్తూ ఆర్య ద్రావిడ (లేక, వైష్ణవ, శైవ) ఘర్షణగా గ్రహించారు. భారత, భాగవత కృష్ణుని ద్రావిడత్వాన్ని వుగ్గడించారు. వైష్ణవ, శైవ పోరాటాలే పలనాటి చరిత్రకూ మూలకందంగా చూపారు. ఉత్తరాది కథలకు ప్రతిగా స్వీయదేశ కథను లేవదీసి, సామాన్యులను చిత్రించి, చరిత్రకు కవితావేశాన్ని కల్పించి, సాంఘికతలను వెలార్చారు.
కవిరాజులో సాంఘిక భావుకత అన్ని కావ్యాల్లో కనబడుతుంది. అది ఆయన రచనలోని విశిష్టత. ఆ సాంఘికతలో విలువలు కట్టగల గుణంకోసం, కార్యకారణ సంబంధంకోసం దేవులాడతాడు. నైతికతలు హేతుభావంతో చూడగలిగాడు. పాతపురాణ వైరం, వేదాలమీద మొదట్లో ఆధారపడి రానురాను వాటినీ కాదనటం, మామూలు దేవుళ్ళను, ఈసడించినా ఆదిలో కనబడే పరతత్వమహత్వాన్ని చూచిన భావం పూర్తి నాస్తికంలోకి పరిణతి వారటఁ ప్రాయికమైన హేతువాద వివేశనలు, తెలుగు నుడికారంతో కమ్మని కవిత్వాన్ని విమర్శలో అల్లగలగటం అనేవి కవిరాజులో ముఖ్యంగా గమనించదగ్గ ఐదు గుణాలు. యివి వారి భావాలు. కవిరాజు ప్రభావాలు, పరిణామశైలిలో పరిణతి నొందినవి.
పారపురాణ వైరం, పురాణ స్మృతి యితిహాసాల బండారాన్ని ఆంధ్రలో తరచి, తెరచి చూపినవాడు కవిరాజు. రూపాయికి రెండు ప్రక్కలున్నవని నిరూపించి, రెండవప్రక్క చూపించి, యధార్థాన్ని గ్రహించమని ఆవేదనలను లోకానికి నివేదించినాడు రామస్వామి. ఈయన భావుకతలో యిది అగ్రగణ్యమైనది.
వేద ప్రమాణం, మొదట్లో స్మృతి పురాణేతిహాసాలను కాదన్న రోజుల్లో (కురుక్షేత్రం, శంబుకవథ, సూతపురాణం) వైదిక ప్రామాణ్యతను అంగీకరించే భావాలు కలవు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తే సభకు వస్తానంటాడు శంబుకర్షి. కాని, భగవద్గీతలో పాత భగవద్గీత డుల్లిపుచ్చబడింది, వేదాలసారం వుపనిషత్తులు, ఉపనిషత్తుల సారం గీతగా యెంచబడు లోకభావనను కాదని త్రోసివేసినాడు. గీతను గిరాటు వేసి కొట్టిపారేశాడు. ఖూనీలో వేనుడు “ఆ వైదిక కర్మమన్న పొరపాటున నేనియు” మెచ్చని స్థితికి వచ్చాడు. వేనుడు కవిరాజు. వేనుని వాదన కవిరాజు భావాలు, కవిరాజు భావపరిణామాన్ని పొందినవైనం వేదపరంగా చూడవచ్చు.
దేవుడు కవిరాజు ఆదిలో నాస్తికుడు కాదు. అనేకులైన దేవుళ్ళు లేకున్నా ములకారణమైన మహత్తర తత్వమేదో కలదన్న భావం సూతపురాణంలో కలదు. అది కవిరాజుకు దైవవాదిగా చేయకపోయినా, నాస్తికుడు కాదు. ప్రకృతివాది కావచ్చు. కాని ఖూనీలో వేనుని పాత్ర ద్వారానూ, పీఠికలోనూ సంపూర్ణమైన, స్పష్టమైన రీతిని వారి నాస్తికతను వెలార్చాడు. ఖూనీ నాటికి కవిరాజు పరిణతి చెందిన నాస్తికుడు.
హేతువాదం కవిరాజు పురాణ వైరాన్ని పాటించినప్పుడు నైహిలిస్టుగా, ఐకనోక్లాస్ట.దా వున్నాడు. పాత దానిమీద అనుమానాన్ని పుట్టించి, పాత మానసిక పౌరాణిక చిత్రాలను ప్రజల్లో పగులగొట్టివేశారు. సూత పురాణాల నుండి గీతకు, ఖూనీకి వచ్చేసరికి, కవిరాజులో హేతువాదం ప్రకటితమై వెన్ను ముదిరినది. ఖూనీ పీఠికలు, గీతా భూమికలు దీనికి ప్రత్యక్షర నిదర్శనాలు. హేతువాదిగా మారే నాటికి నాస్తికుడుగా మారినారు.
సాంఘిక విమర్శ కవితలు – సాంఘిక దౌష్ట్యాలమీది దాడి, లోపాలనెత్తి చూపుట, విమర్శించి మరో మార్గాన్ని చూపుటలో కవిత్వస్థాయి కందుట కవిరాజు యేకైక విశిష్టత.
ఈ తీరు తెన్నులు పరిశీలిస్తే కవిరాజు త్రిపురనేని భావ పరిణామచ్ఛాయల్ని స్థూలరూపంలో గ్రహించవచ్చు.