14, మార్చి 2011, సోమవారం

భారత సంస్కృతి -హేతువాద దృష్టితో


1958 లో నిడుబ్రోలు గ్రామములో రారాజు కావ్యాన్ని ఆవుల గోపాల క్రిష్న మూర్తి ఆవిష్కరించి సుధీర్గ ప్రసంగం చేశారు.
దాసరి శ్రిమన్నారాయణ డాబాపై జరిగిన ఆహ్లాదకర సమావేశంలో రారాజు విడుదల అయింది .
భారతాన్ని రారాజు కావ్యం గా రాసిన కొల్లా క్రిష్నారావు ఆ ప్రసంగాన్ని ఆంధ్ర పత్రికకు  పంపగా పూర్తి పాఠం ప్రచురితమైంది .ఆ ప్రసంగ పాఠం


భారత సంస్కృతి

భారత సంస్కృతి బహుళ ప్రచారంలోకి వచ్చి యెన్నో యేండ్లు, పూండ్లు గడచిననూ, దాని వైవిధ్య వైశిష్ట్యాలను గ్రహించి, ఆచరించు లోకం కొరవడియున్నట్లే యెంచబడుచున్నది. తెలియనివారనేకులుండగా తెలిసినవారి ఆచరణ అనుసరణీయంగా లేమికి విచారణలేమి తోడౌట శోచనీయము.

అసలే జంబూ ద్వీపం, అందులో కర్మభూమి, ఆర్యావర్తం, భారతదేశం. దీని సంస్కృతి దివంగతములు ప్రాకి, సనాతనమైన మన్ననలనంది, ప్రశస్తి గాంచినది. చతుర్వేదములు చాతుర్వర్ణ్యములకు జాలవేమోనన్నట్లు, పంచమ వేదంగా భారత సంహిత, ప్రతిభావ్యున్నతలలో గరీయ సత్యాన్ని చూపి, ఆవిష్కరింపజేయబడినది.
నాటినుండి దానిపట్ల, అందలి ప్రతిపాద్య సంస్కృతిపట్ల మనవారు చూపిన, నేటికీ చూపుచున్న ఆదర, భక్తి ప్రపత్తులు నిర్విశేషములు, అట్లగుట, అట్టి సంస్కృతిని మనమొకసారి పరిశీలించుట ఆవసరమేగాక, లోక వృత్తమునకు అత్యంత ప్రాముఖ్యము.


భారత కథ అలౌకిక జగత్తు భావించినంత ప్రాచీనము గాని, ప్రశస్తము గాని కాదు. కొందరు పండితులు క్రీస్తుకు పూర్వం 1400 లేక 1000 మధ్య కాలమునాటిదనీ, మరికొందరు 1000 లేక 900 మధ్య కాలం నాటిదనీ భావించుచున్నారు. ప్రాచీన కాలంలో యెన్నో ఆటవిక, విహారజాతులు ఉత్తర భూముల్లో విహారం చేస్తూ వుండెడివి. గంగానదీ పై భాగంలో, యమునకు మధ్య ప్రాంతంలో ‘భరత జాతి’ యను నది వుండెను. ఋగ్వేదంలో, పాణిని రచనలో ‘భరతజాతి’ వుదాహృతమయ్యెను. ఇట్టి జాతులు ఉత్తరాదిని అనేకం కలవు. వేదకాలం నాటి పురుభరతులు చారిత్రకంగా ప్రాధాన్యత వహించిరి. సరస్వతి, గంగానదుల మధ్య వారి రాజ్యం మూడు భాగాలుగా హస్తినాపురి ముఖ్య పట్టణంగా పాలించిరి. అదే నేటి మీరట్ ప్రాంతం.


భరత కుటుంబీకుల దాయభాగ అని నిర్ణయ యుద్ధ గాథలే భారత కథా విధాన గాథా స్రవంతులు. అభిమన్యు కుమారుడు పరీక్షిత్తు. ఆయన తనూజుడు జనమేజయుడు, భారత కథారచనా ప్రారంభుడు, భారత సంస్కృతికి పట్టుకొమ్మ, అతని యనంతరం శతానీక, అశ్వమేథ దత్త, అభిసింహ, కృష్ణ, నికషులు వారసులుగా పాలించిరి. నికషుని కాలంలో గంగ వరదలవల్ల హస్తినాపురి కొట్టుకొనిపోగా, ముఖ్య పట్టణము ‘కౌశాంబికి’ మార్చిరి. ఇది అల్హాబాదుకు 30 మైళ్ళలో ఉన్న నేటి ‘కోసాం’ పట్నం.


నికషుని సమకాలికుడు విదేహ రాజగు జనకుడు. నేటి నేపాలు సరిహద్దులలోని జనకపూర్ ఆనాటి ముఖ్య పట్టణమైన మిథిల. ఇది మరొక సమకాలిక సాంస్కృతిక కేంద్రం. తరువాత, ఆర్య – ఆర్యేతర కలియకలతో మగధ రాజ్య కాలానికి వస్తాము. బౌద్ధ జైన సాహిత్యాలు ఆవిర్భవించిన కాలం, భారత తత్త్వం వచ్చిన రోజులు. బ్రాహ్మణాలలోని సంప్రదాయజ్ఞతకు భిన్నంగా, ఆలోచనాక్రమం, మానవత, సభ్యత పెరిగి, మానవ విజ్ఞాన, నిర్మాణ పరిధులు హెచ్చిన రోజులు మగధ, కోసల, వత్స, అవంతి పట్టణాలు దీనికి ముఖ్య కేంద్రం.
భారతము విచిత్ర కావ్యము... కావ్యమే కాదు, అదొక ప్రత్యేక సాహిత్యలోకం. భారతం రచించినది ఫలాని కవియనిగాని, అది ఫలాని కాలంలో వ్రాయబడినదని గాని, నిర్ణయింప వీలులేదు. ఎందరెందరి గాథలో, ధీరోదాత్త సంక్రందనలో, కూర్చి యేర్చి, చేర్చి, పెంచి, పోషించి, అసలు నాయకులకు, కథకు సంబంధం లేని, వుండ వీలులేని కాండలు, కథలు ఉపాఖ్యానాలు, పుక్కిట పురాణాలు, కలిపినారు. నీతి మంజరులు, తాత్త్విక గాథలు, బ్రాహ్మణ సంజనితములైన కథలు, కులవర్ణనలు, వర్ణాశ్రమ ధర్మ విశిష్టతలు, ప్రకృతి విశేషాలు పురాణ ఫక్కిలో చేర్చబడినవి. శైవ కథలు, వైష్ణవ చిద్విలాసాలు సంతరించారు, జగాలనంటిన యుగాలుగా ప్రోదిచేసిరి. దాని నొక భాషార్ణవ సామ్రాజ్యంగా మార్చిరి.వ్యాసుడు వైశంపాయనుని శిష్యుడై, జనమేజయునకు నివేదించిన గాథలే భారతముగా మనకు చిక్కినది. సూతుడు నైమిశారణ్యములో శౌనకాది మహామునుల కన్నట్లు, ఋషి ప్రోక్తమేగాక, ఋషులకై ప్రోక్తముగా దింపిరి. మొదట ‘జయ’ అను పేరబరగి, ‘భారతము’గా మారి, రాను రాను ‘మహాభారతము’గా పరిణతి నొందినది.


వింటర్ విట్స్ పండితుడన్నట్లు భారతం ఒక కావ్యం కాదు, ఒక పురాణం కాదు, అది ఒక సాహిత్యం.కథకు సంబంధం లేని పౌరుషగాథలు, భరతుని కథ, యయాతి కథ, నలదమయంతుల కథ, కథలో కథలుగా, నాటకంలో నాటికగా చేర్చబడినవి. శతపథ బ్రాహ్మణంలోని ‘నాదనైషధకథ’ గూడా బైటికి లాగబడింది. రామ కథవుంది. సంజయుని తల్లి విదుల కథ కలదు. కవుల గాథలే గాక, పూజారి భావాలతో నింపారు. బ్రాహ్మణ దృక్పథంలోని మార్పుకై, కూర్పులు చేశారు. చవనుని కథ, అశ్వని దేవతలు వయస్కుని చేయుట, శతపథ, జైమిన్యాయ బ్రాహ్మణంలోని కథలను మార్చి భారతంలో జొనిపారు. ఇంద్రునంతటివాడు బ్రాహ్మణ సంతుష్టి చేయనిచో పదభ్రష్టుడౌనన్న కథలు చేర్చి, ఆయా ప్రతిభలను, మహిమలను వెలార్చారు.


మను కథ, సావిత్రీ గాథలు కలిపారు. జానపద పాటలనెన్నిటినో రూపం మార్చి చేర్చారని వింటర్ విట్స్ అభిప్రాయం.తీర్థయాత్రా భాగం బ్రాహ్మణ కథాకలనాన్ని బాగా పెంచింది. రోమన రుషి నోట విశేషించి ప్రసంగించిరి. ఆగస్త్యుని ప్రాశస్త్యముగాని, విశ్వామిత్ర, వశిష్ఠుల రాజర్షి, బ్రహ్మ వాద ప్రతివాదములు గాని బ్రాహ్మణ ప్రతిభను చాటినవే.. నాటి సాంఘిక వైషమ్య రీతులను చూపినవి.


విదులుని, బావిలోని గాథలు, ముద్గలుని కథలు కర్మ సిద్ధాంత ప్రతి పాద్యాలుగాను, గౌతమి కథ మరణ దేవుని ప్రతిభను, కర్మ కాలచక్ర బలీయతకు నిదర్శనంగానూ, సాక్షీభూతంగానూ చెప్పిరి. పండ్రెండు పదమూడు పర్వాలలోని గాథలన్నీ కథకు అవసరం లేని ప్రాశస్త్య గాథలే.. భీష్మపాత్ర ద్వారా పరిపుష్టం చేయబడినవి.


అసలు తత్వం, భగవద్గీత ఆవిర్భావం, భారత కథాకలనలోని ఫోర్జరీ భాగం, పురుషసూక్తానికి నకలు. భాగవత మత దృష్టి ప్రతిపాదింపబడి, వైష్ణవ మత దృష్టికి పరివర్తన పొందిన మార్గ రీతులు, ఛాయలు పరిశీలనార్హములు. ఇది మూలంలో లేని మూలభారతం. క్రీస్తుకు పూర్వం రెండవ శతాబ్ది నుండి, క్రీస్తు తర్వాత మొదటి శతాబ్దిలోగా పొందిన రూపం, చేర్చిన భాగం.హరివంశం అంతా అదేరకం. హరివంశ పర్వంగాని విష్ణు పురాణ భాగం గాని, భవిష్య పురాణంగాని అటులనే తటపటాయింపులు లేని చేర్పులు, కథ ఇట్టిది.


రెండు రకాల భారతం కలదు, ఉత్తర దక్షిణాదికాలు. ఉత్తరాది దానిలో, శారత, లేక కార్మిరి, కేపాలి, మైథిలి, బెంగాలి, దేవనాగరిలో కలవు. దక్షిణాదిన తెలుగు, మళయాళం, గ్రంథములు కలవు. ఉత్తర, దక్షిణ రీతులకు యూరియామడల దూరమున్నది. ఉత్తరాదివారి ప్రతికన్నా దక్షిణాదివారి ప్రతి సుదీర్ఘం, కొత్తలు చాల కలవు, చేర్పుల వైపరీత్యం విశేషం.


భారత ప్రతులు కలకత్తా, బొంబాయి, కుంభకోణం ప్రతులు కలవు. ఒకదానికొకటి పోలనిరీతి కలవు. పూనాలోని భండార్కర్ కేంద్రంవారు సంగ్రధిత ప్రతిని సమగ్ర రూపంలో తేవాలని కృషి చేస్తున్నారు. శుంతాంకర్ పండితుడు, భారతాన్ని ‘పాతకొత్తల మేలు కలయిక’గా భావించాడు. ‘క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్ది తర్వాతనూ కాదు’ అని వింగర్ నిట్స్ అన్నారు.బౌద్ధులు, యవనులు భారతంలో వుదాహృతులైరి. బాణుడు, కుమారిలుడు గూడా పేర్కొనబడిరి. నాల్గవ శతాబ్ది నాటికి ‘స్మృతి’గా గౌరవాన్ని పొందనారంభించిరి.


భరతుల యుద్ధం చారిత్రకమే. తక్కిన కథ మాత్రం యెన్నో జానపద కథల సంహిత, అందుకే భారత సంహిత. సాంఖ్యాయాన శౌతసూత్రాలు గూడా కురుక్షేత్ర సంగ్రామాన్ని ప్రస్తావించినవి. అశ్వలాయన గృహసూత్రాలు భారత, మహాభారతాలను పేర్కొన్నవి. పతంజలికి ‘పాండు కథ’ తెలుసు. పాణిని పురాణ నామముల నిరూపణ జేయుటయేగాక, ‘మహా భారత శబ్ద విషయం’ పరామర్శించారు.


మౌర్యుల అంతాన్ని చూచి, సుంగుల రాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్రుడు బ్రాహ్మణ సంప్రదాయాన్ని ప్రోది చేశాడు. మనుస్మృతిని, భారత, రామాయణాదులను బ్రాహ్మీణీకరణం చేశాడు, జమీందారీ, పూజారీ భావాలను సంఘటిత పరిచాడు, నేటికి మనకు పరంపరగా దిగిన మహాభారతాన్ని ఈ రూపంలోకి నిగదించి, వర్ణాశ్రమ ధర్మానుష్ఠానానికి ప్రియదూతియైనాడు.  ఆయన కుమారుడు అగ్ని మిత్రుడే ‘మాళవికాగ్ని మిత్రాని’కి నాయకుడు. అది పూర్వం కథ.


భారత కర్తృత్వము నిర్ణయింపరానిది. వైశంపాయన సౌతికృతము మాత్రమే కాదు. గ్రంథ పరిమితియు నిర్వచింపరానిదియే! వావిళ్ళవారి ప్రతిని బట్టి 84,770 శ్లోకములు ఆంధ్ర సాహిత్య పరిషత్తులోని ప్రతినిబట్టి 99,057 శ్లోకములు నన్నయ్యభట్టు లెక్కలనుబట్టి 1,00,700 వచ్చినవి. తెలుగునాడులోని ప్రతులే ఇట్లుండ, అన్ని ప్రాంతముల ప్రతులు జూచిన శ్లోక సంఖ్య యెట్లుండునో! ఇది గ్రంథాకృతి.


ఇక తెలుగు భారత గాథలు నగ్రజన్ములకు ననుగ్రహమున జారుతర మహాగ్రహారంబులిచ్చుచు, విప్రకులము నెల్ల బ్రోచుచు, సమస్త వర్ణాశ్రమ ధర్మరక్షణ  మహా మహితుడై రాజరాజ నరేంద్రుని దయతో తెలుగు భారతం నన్నపాద్యుని కథా కవితార్థ యుక్తిలో వెలసిల్లి....
ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మలిదులు వేదాంతమనియు,
నీతి, విచక్షణుల్ నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహా కావ్యమనియు,
..... ...... ..... ఐతిహాసికులితిహాసమనియు,
బరమ పౌరాణికుల్ బహుపురాణ, సముచ్ఛయంబని మహిగొనియాడు చంద్రు
సత్య వాక్ప్రబంథ..... సర్వలోక పూజ్యమయిన దాని, పంచమవేదమై పరగు భారత సంహితజేసెను.


భారత దేశంలోని విజ్ఞానమంతా వేదంలో కలదని, వేదేతరంగా విజ్ఞానంగాని, జ్ఞానంగాని లేదనీ, భారతీయ సంప్రదాయము, భారతాన్ని పంచమవేదం చేసి వ్యాసనామంతో, దీనికి మించి తత్త్వంగానీ, శాస్త్రంగాని, వేదాంతంగాని, నీతి శాస్త్రంగాని, మహాకావ్యంగాని. యితిహాసంగాని పురాణంగాని లేదను నవ్య భారత సంప్రదాయాన్ని రూఢి చేశారు. యుగాల విభజనకృత, త్రేతా ద్వాపర కలియుగములుగా బిగించి, ధర్మంబు కాశికాస్థాన మధ్యంబున నాల్గు పాదంబుల నడిచియాడు స్థితి నుంచి యేకపాద గమనగా చేయగలిగాడు.
సంస్కృతి, జాతి, మత, వర్ణ, కుల, దేశ పొలిమేరలలో మలుపబడగలిగినది కాదు. అది మానవవేద్యంగా  మాత్రమే మనగలదు. పూర్ణ పురుష సంప్రదాయాన్ని యూహింపగలిగినవారు ఆ సదాశయాన్ని చేరగల సాధన సంచయాన్ని చేకూర్చుకొనలేక వర్ణాత్మక దృష్టిలో దవిలి, ఆశయ భంగమునకైన అంగీకరించిరిగాని, యేత ద్దృష్టిమానరైరి, అది భారత సంస్కృతికి జీవగర్ర. నన్నాపార్యుని దయచే, వర్ణాశ్రమ ధర్మ రక్షణకైన పంచమ వేదంగా, మారి మారిపోయినది. తిక్కన కొంత జీవమూది, అట్టి సాంఘిక వృత్త రక్షణకు పూర్తి దోహద క్రియగాకాక, శిల్ప దృష్టి చేర్చి, రక్షణ కల్పించినా, అసలు మూలమే సంకుచిత సంస్కృతీ విలసితం గనుక, భారత సంస్కృతి తెలుగులో అటులనే నిలచిపోయినది. భారత గత సాంఘిక దృష్టి సమాజ నిర్మాణ విధానం, అనాగరక, నాగరక మిశ్రితం, విస్తృత సంస్కృతికి విరుద్ధం.


దీనికి మూలకారణం, మన పూర్వ అపరిణత తత్త్వ జ్ఞానము, కర్మకాండకు ప్రాధాన్యతనిచ్చి, జ్ఞాన భాగాన్ని వెల్లడి కానీయక మరుగు పరచిన కతానకల్లిన వికారము, టక్కునేర్పెడి కవుల గంటాల వ్రాత అది. దీనికితోడు పాండవుల పౌత్రుడైన జనమేజయు పంపున భారత రచన సాగుటచే జనమేజయు పక్షీయులెల్లరు వుత్తమోత్తములనీ, వారికి సాయపడినవారు మహనీయులనీ, పాండవులతో దాయభాగ పోరాటం పెట్టుకున్న కౌరవులు దుష్టులని, వారికి సాయపడినవారు నీచులని గ్రంథం వ్రాయక తప్పినది కాదు. కవి తనను నియుక్తుణ్ణి చేసిన అస్థానమును గూర్చి వ్యతిరేకంగా వ్రాయడు. భారత కథలోని జుగుప్సకు ప్రధాన కారణమేయిది, తరువాత పెంచిన కవులు యెవరికి తోచినది వారు పూరించినా, మూలము పెంచురీతినే చేసిరి. వ్యాఖ్యాతములు లక్షలున్నను, వరవడి యేక రాసికము.


భారత సంస్కృతిని హేతువాద దృష్టితో, విమర్శ బుద్ధితో పరిశీలించినచో, అక్షర లక్షలుగా వివేక రహిత విధానాలు ధర్మాలుగా చిత్రించుట కనబడుతుంది. మంచిచెడుగా, చెడుమంచిగా యింతగా పరివర్తనం పొందిన కావ్య జగత్తు మరొకటి వుండదు, లేదు.పూర్వ విషయం మీద విలువ కట్టలేని ప్రాకృత లోకము, వర్తమాన సంఘటనల మీద మాత్రము యేమి విలువ కట్టగలదాయన్న సంశయము విజ్ఞులకుతోచి, భారత సంస్కృతి మీద, సంఘక్షేమ దృష్టితో అభ్యుదయ కాముల తిరుగుబాటు లేవదీసిరి. మహారాష్ట్ర నుండి డాక్టర్ ఫూళే, బెంగాలు నుండి రాజారామ్ మోహన్ రాయ్, ఆంధ్ర నుండి వేమన, కందుకూరి వీరేశలింగం, తమిళనాడు నుండి పిట్టి త్యాగరాయ శెట్టి, మలబారు నుండి డాక్టర్ నాయర్, కర్నాటకం నుండి బసవన్నవార్ తిరుగుబాటుకు తొలి నాయకులు. ఇంతకన్న తీవ్ర ధోరణిలో, సమగ్ర దృష్టితో త్రిపురనేని రామస్వామి తిరుగుబాటు వుద్యమాన్ని కావ్యరంగంలో లేవదీశారు. పెండ్యాల వెంకట సుబ్రమణ్య శాస్త్రి, కొడాలి లక్ష్మీనారాయణ, గోపరాజు రామచంద్రరావు మొదలుగాగలవారు కొంతకు కొంత అందుకొనిరి. ఆ తిరుగుబాటు భావ విప్లవం కలిగించింది, కాని దానికి యింకను సరియైన రూపం రాలేదు. అలలు లేచి, వెనుకాడినవి, పల్లములలో నీరు నిలచి వున్నది.
Avula Gopalakrishna murthy preface to Raa Raa ju Telugu poem by Kolla Krishna rao