30, ఏప్రిల్ 2011, శనివారం

రూపొందిన మానవుడు-హ్యూమనిజం=AGK famous sayings

నేను  – నా ఉద్యమం


Avula Gopala Krishna Murty

    నా  ఉద్యమం – నాతత్వం జాతీయవాదాన్ని, అంతర్జాతీయ వాదాన్ని – వర్గవాదాన్ని మరే యితర సమిష్టి వాదాన్ని అంగీకరించదు.
*             *           *
    వ్యక్తిత్వంతోనే భవితవ్యం

    వ్యక్తిగా వున్న మనిషిని లేక మనిషిగా  వున్న వ్యక్తిని సమాజానికి  మూలంగా అంగీకరించాలి. మానవుణ్ణి  సర్వానికి కొలమానంగా, అధినేతగా చేయాలి. మానవేతర శక్తుల్ని  తీసివేసి, మానవుని భవితవ్యం మానవుని కృషి మీదనే వున్నదని విశ్వాసపూర్వక కృషికి మనం  దిగాలి. ఉమ్మడిని తగ్గించి, వ్యక్తిత్వాన్ని పెంచాలి.
*             *           *
    ఉద్యమం
    పార్టీ  రాజకీయాలు, అధికార రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు, అధికార రాజకీయాల స్థానంలో సాంఘిక రాజకీయాలకు ఉద్యమించాలి.
*             *           *
    మన  కర్తవ్యం
    ఉత్పత్తిని  లాభానికికాక ప్రయోజనానికిగా మార్చాలి. దోపిడీని వర్జించి, సహకార సంబంధాల్ని పెంపొంద  చేయటం మన ముఖ్య కర్తవ్యం.
*             *           *
    మాటలకు, మమతలకు దాసుళ్ళం కాకుండా  మన గలగటం ముఖ్యం.
*             *           *
    అక్షరాస్యత  - నిరక్షరాస్యత
    కేవలం అక్షరాస్యతవల్ల అన్ని సమస్యలూ పరిష్కారం కాకపోవచ్చు. కొత్త సమస్యలను కూడా సృష్టించవచ్చును. అయితే నిరక్షరాస్యత ఏ సమస్యనూ పరిష్కరించలేదు. పై పెచ్చు వాటి పరిష్కారానికి పెద్ద ప్రతిబంధకంగా తయారవుతుంది.
*             *           *
    సమస్యను చూసేదెలా.....
    ఒక  సమస్యను పరిశీలించేటప్పుడు  వుత్పన్నమయ్యే విషయాలపట్ల ఎలాంటి రాగద్వేషాలు చూపక నిష్పాక్షికంగా శాస్త్రీయ  పంథాలో చూడాలి.
*             *           *
విద్యే  సాధనం
    శ్రమను  తగ్గించి, విశ్రాంతినిచ్చే మార్గాలు కావాలి, విద్య అందుకు సాధనం. శాస్త్రీయ ధోరణిలో ప్రబలించటం అవసరం. అది స్వేచ్ఛకు దోహదం చేస్తుంది. స్వేచ్ఛ అంటే, సంఘంలో సమానావకాశాలు కల్పిస్తూ, మనిషిని మనిషిగా చూడగలగటం.
*             *           *
    వ్యక్తి వికాసానికి లలితకళలు
    సంప్రదాయం అంతమై, నవ్యత్వం ఆరంభం కావటానికి, వ్యక్తి వికాసానికి, బహుళత్వానికి తోడ్పడే సరికొత్త నృత్యాలు, లలితకళలు, సాహితీరంగం సాధించాలి.
*             *           *
    దేశాన్నిగాని, వర్గాన్నిగాని కాకుండా  వ్యక్తిని నిర్మాణ విధానాలకు  ప్రాతిపదికగా హ్యూమనిజం  అంగీకరిస్తుంది.
*             *           *
    సత్యమనేది జ్ఞానాంశం. జ్ఞానం సదా పెరుగుతూ వుంటుంది.
*             *           *
    నీతి  దైవికం కాదు. అపౌరుషేయము కాదు, పౌరుషేయము.
*             *           *
    నియంతృత్వం  ద్వారా ప్రజాస్వమ్యాన్ని చేరలేము. ప్రజాస్వామ్యం  పేరుతో అది నిజమైన ప్రజాస్వామ్యం  అయితే నియంతృత్వాన్ని స్థాపించ వీలులేదు.
*             *           *
    పోరాటం  కాని, సామరస్యం కాని వాస్తవికతకు  విరుద్ధాలు. అసలు సంగతి సమన్వయం  చెయ్యటంలో వుంటుంది.
*             *           *
    పదార్థ  జగత్తులోని వివిధ అణువుల సమన్వయ స్వరూప నిర్ణయం మీదనే  సంఘ గమనం జరుగుతుంది.
*             *           *
    విధానాల దాస్యం కోసం వివిధ అణువుల సమన్వయ స్వరూప నిర్ణయం మీదనే  సంఘ గమనం జరుగుతుంది.
*             *           *
    విధానాల దాస్యంకోసం స్వేచ్ఛకు అవరోధాల్ని సహించకూడని ప్రశస్త గుణాన్ని మనం అలవఱచుకోవాలి.
*             *           *
    హ్యూమనిజం
    హ్యూమనిజం ప్రజలలో నమ్మకం కలిగి మానవకోటి మీద విశ్వాసంతో, సత్యాన్వేషణకు  శాస్త్రజ్ఞానం అవసరమని  భావిస్తూ, సాహిత్యం ద్వారా, కళల ద్వారా, శాస్త్ర విజ్ఞానం, తత్త్వ విద్యల ద్వారా నైతిక ధార్మిక విలువలను గ్రహించి, జీవిత సమగ్రత్వాన్ని పొంద ప్రయత్నిస్తుంది.
*             *           *
    ప్రజల, ప్రభుత్వాల మధ్య తాబేదారులు  ఈ రాజకీయ పార్టీలు, వాటిలో ప్రజాస్వామ్యం ఎండమావులలో నీరులాంటిది.
*             *           *
    వ్యుత్పత్తి, మారకం, పంపిణీలలో ప్రయివేటు  ఆస్తుల్ని రద్దు చేసినంత  మాత్రాన లోకాస్సమస్తా స్సుఖినోభవన్తు కాగలగటం భ్రాంతి అని అనుభవంలో తేలిపోయింది.
*             *           *
    యే ప్రభుత్వం ఎంత తక్కువగా పరిపాలిస్తుందో అదంత మంచి ప్రభుత్వం అన్నారు విజ్ఞులు. మనం శ్రద్ధగా ఆలోచన చెయ్యాలి. సాంఘిక సమస్యలు వొకనాడు పుట్టవు. సాంఘిక వికారాలు పోవాలంటే చాలాకాలం పడుతుంది. అది యెక్కడైనా అంతే.
*             *           *
    పిల్లలు మాధుర్యాన్ని చిమ్ముతారు.
*             *           *
    జీవితాన్ని  మధుమయం చెయ్యటానికి కావ్యం ఉపయోగపడాలి.
*             *           *
    వ్యక్తిగా వున్న నన్ను నేను జాగర్త చేస్తే నా చుట్టూ వున్న జగత్తు యధామాతృకంగా మరమ్మత్తు  అవుతుంది.
*             *           * 
    భావమంటే......
    భావానికి  బలం వున్నది. భావానికి రెక్కలు  వున్నవి. భావము పదార్థము. భావము ఒక్కసారి జన్యము కాగా దానికై అదేమనుగడ సాగించుకొనగల నైజాన్ని కలిగి వుంటుంది అన్న పదార్థ భావుకత కలిగినవాడు శాస్త్రీయ పరిశీలకుడు.
*             *           *
    ప్రైమరీ, సెకండరీ, యూనివర్సిటీ స్థాయీలలో  విద్యకు సమన్వయం జరగటం  మన విద్యాపద్ధతుల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పుతుంది.
*             *           *
    పూర్వం చంచల్ చంచలోపమని సామెత వున్నది. మెరుపు తీగలు యెంతగా చలిస్తవో అంతగా చలించేది. నేడు నారీలోకం కాదు. రాజకీయ రంగం.
*             *           *
    మానవ  ప్రవర్తన
    యుద్ధం  మానవ ప్రకృతి విరుద్ధం, మానవుడు  హేతుశాలి, అందువల్ల ప్రాయికంగా శాంతివాది, అందువల్ల అశాంతిని శాంతిగా మార్చాలని తాపత్రయ పడతాడు. మానవునిలో మానవత్వం దీనికి కారణం. మానవ ప్రవర్తనకిది గీటురాయి.
*             *           * 
    యుద్ధోన్మాదులకు యుద్ధం అవసరం. ప్రజలుగా వున్న  మనకు అనవసరం. సిద్ధాంత ఉన్మాదులకు యుద్ధం ఆటస్థలం. ప్రజలుగావున్న మనకు గిట్టదు. మతోన్మాదులకు యీ యుద్ధం విహార స్థలం. మనకది మారణహోమం, పనికిరాదు.                    
*             *           *
    పాతకొత్తలు
    పాతదృక్పథాలు  చినిగిపోకుండా, క్రొత్త  సిద్ధాంతాలు పాదుకోకుండా  వున్న సంధియుగంలో వున్నాము. ఇది ప్రాయికంగా సంఘర్షణయుగం  కూడా. ఇంకా మనం పాతకొత్తల  మేలుకలయికదాకా రాలేదు. ఆ  పరిణామానికి పొలిమేరల్లోనే  వున్నాము.
*             *           *
    వ్యక్తిత్వం - సమాజం
    పాశ్చాత్య ప్రాచ్యమత చరిత్రలన్నీ  ఒకే తీరున నడిచినవి. మానవుని  వ్యుత్పత్తిని, సమాజ వ్యవస్థా నిర్మాణాలను మతవాదులు ఒకరీతిగా భావించారు. విజ్ఞానశాస్త్రం  మరో రీతిగా పరిగణించింది. వ్యక్తిగా పరిగణనజరిపి, వ్యక్తుల సమూహాన్ని భావించి, వ్యక్తికి సమాజానికి వున్న, వాద భేదాలుగా రూపొందినవి.
*             *           *
    సమస్యల  నుంచి పలాయనం చేయటం పనితనం కాదు. ఎదిరించి, పెనుగులాడి సమస్యా పరిష్కార మార్గం అన్వేషించాలి.
*             *           *
    భావ విప్లవం విప్లవాలలోకల్లా  కష్టం. అందువల్ల మార్పు చాలా నెమ్మదిగా, తక్కువగా సాగుతుంది. పదికాలాలపాటు మొండికేయంది  పనికాదు. 
*             *           *
    సాంఘిక  సిద్ధాంతాల నిర్మాణం
    అన్ని పోరాటాలలోకల్లా సాంఘిక పోరాటం కష్టమైనది. భావపోరాటం యిందులో  ప్రధానపాత్ర వహిస్తుంది. భావ విప్లవంరాంది, తతిమ్మా  విప్లవాలు – సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికాలు – నెగ్గవని యం.యన్.రాయ్ వచించి, ఆ భావ పునాదుల మీద సాంఘిక సిద్ధాంతాల్ని నిర్మించాడు.
*             *           *
    దిగజారిన  వర్ణవ్యవస్థ
    వర్ణవ్యవస్థ కులవ్యవస్థగా దిగజారి, నాలుగు వర్ణాలు నాలుగువందల కులాలుగా మారిపోయి, దేశం వర్ణాల, కులాల  దేశంగా కరుడుగట్టి కూర్చుంది. ఆ పాకం సడలకపోగా, చిట్టెం  కట్టిపోయింది. ప్రాయికంగా జనానీకంలో నూటికి తొంభైమందికి  పై దాకా యీ మౌఢ్యం పోలేదు. ఇదిపోయి  తీరాలి.
*             *           *
    రూపొందిన  మానవుడు
    మానవుని మానవునిగా చూచి, చిత్రించి, లేవదీసి, కాళ్ళమీద నిలబెట్టి, ఆవులింతలు పోగొట్టి, అదుపు  ఆజ్ఞల నెరిగిన మానవులను తయారు చేయగలిగిన ఉద్యమాలు, నాయకులు, తత్వవేత్తలు చొరవతో ముందుకు రావటం అభిలషణీయం.
*             *           *
    తూర్పు  మొనగాడని గర్వించిన వారూ – తూర్పువేరు, పడమర వేరన్నవారూ ఒకే కోవకు చెందినవారే.
*             *           *
    వినాయక  నాయకులు
    మేఘాలు  ఆవరిస్తే, వర్షం పడుతుందని  భ్రాంతి పడతాము. నాయకులు  ఘీంకారాలు చేస్తుంటే, మత్తేభనృత్యం జరుగుతుందని భావిస్తాము. అవి తెల్లమేఘాలే అయి, వీరు వినాయకులే అయితే మన అంచనాలు తప్పటం జరుగుతుంది.
*             *           *
    నేను  నేనే, మరొకడిని కాననే భావం వ్యక్తిత్వ వికాసానికి పునాది. నా వుద్దీపనలో నేను సర్వస్వతంత్రుణ్ణి  అనే భావం స్వేచ్ఛా సమాజ నిర్మాణానికి ప్రాతిపదిక. 
*             *           *
    కవిరాజ  సృష్టి
    కవిరాజు రామస్వామి ఒక వారసత్వానికి ప్రతినిధి. తెలుగునాట వేమనతో ప్రారంభమైన సాంఘిక ప్రగతి వుద్యమంలో సేదదీరినవాడు కందుకూరి వీరేశలింగం. సాంఘిక తిరుగుబాటను సమర్థిస్తూ, ఆ వుద్యమాన్ని సర్వతోముఖంగా విస్తరింపజేసి, తాత్విక  భావ పరంపరలను బహుధా సృష్టించినవాడు కవిరాజు.
*             *           *
దృష్టిదోషం
    మన  ఆలోచనలు, మాత్సర్యగ్రస్తంగా  వుంటున్నవి. విషయ పరిశోధన, నిర్ణయాలవద్ద మాత్సర్యదృష్టి ఉండటం వల్లనే తెలుపు నలుపుగా నలుపు తెలుపుగా మారుతున్నవి. నిష్పాక్షికత లేకుండా పోతున్నది. మనకీ దృష్టిదోషం పోవాలి.
*             *           *
    స్వేచ్ఛాపూరిత మానవులతో కూడిన స్వేచ్ఛాయుత  సమాజనిర్మాణమే నా గమ్యం.