7, ఏప్రిల్ 2011, గురువారం

కవిరాజు హేతువాదం -సూతపురాణం-AGK masterly analysis


సూతపురాణము
త్రిపురనేని

“బూతు పురాణము గాదిది
ప్రాంత పురాణమును గాదు పాతకహరమౌ
సూతపురాణం బియ్యది”



అంటూ సూతపురాణకర్త తమ పురాణాన్ని పరిచయం చేస్తూ, “లోకంబున పురాణము లార్షేయములనియు దత్కారణమున బూజ్యములనియు దదంతర్గత ధర్మములు, నీతులు, కథలు శిరోధార్యములనియు విశ్వసించుచున్నది.  విశ్వాసము వలన గలిగిన ప్రతిఫల మాత్మద్రోహముగా బరిణనించుటజేసి పురాణము లెంతవఱకు బ్రతికూలములో, ఎంతవఱకు నీతి బాహ్యములో  యెంతవఱు బక్షపాత భూయిష్టములో మోడ్పుగన్నుతోనున్న విద్వల్లోకమునకు జూపించు తలంపుతో సూతపురాణము రచింపబడినది” అని సూతపురాణ కారణ జన్మత్వాన్ని నివేదించారు.


పురాణములు దశములో అష్టాదశములోయైనను, రామాయణ భారత భాగవతములే ప్రశస్తములు, పురాణములకెల్లనూ మూలములు. ఏకమైన వేదమును, ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదములని నాలుగు కాజేసినవాడు వ్యాసుడు. కాని, “స్త్ర శూద్ర ద్విజ (బ్రహ్మ) బంధువులకు వేదములు శ్రవణ గోచరములు కారానివగుట కర్మమూఢులగు వారికి శ్రేయస్సు కలుగుటకై యితిహాస, పురాణముల రూపమున శ్రుతి, స్మృతి ధర్మములను విపులీకరింపజేసిరి.
ఈ వ్యక్తీకరణ వృత్తిలో, బైలుండు ఋగ్వేదమును, జైమిని సామవేదమును, వైశంపాయనుడు యజుర్వేదమును, సుమంతుడు అధర్వణవేదమును వంతులు వేసుకుని, వానిని ధరించిరి. వ్యాస శిష్యుండగు రోమహర్షణుడు యితిహాస, పురాణముల వ్యక్తీకరణ భారము వహించెను.
ఆ రోమహర్షణుని పుత్రుడే నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడైన యుగ్రశ్రమనుండను పేరుగల సూతమహర్షి. ఆయన పేరనే మన సూతపురాణము వెలసినది. నైమిశారణ్యమున శ్రీ విష్ణుక్షేత్రమునందు శౌనకాది మహామునులు, విజ్ఞానధనులు, మానవ శ్రేయస్కాములు, అష్టాశీతి సహస్ర సంఖ్యాకులు (88,000ల మంది) సమావేశమై సూతర్షి ముఖమున భాగవత మహిమలను వినిరి. అదియే భాగవతము. వ్యాసనందనుడు శుకమహర్షికి వినిపించడానికి, భాగవత గ్రంథ ప్రసక్తిని, సూతుడు శౌనకాదులకు జెప్పెను. భాగవతము పురాణము. యితిహాసము గూడా.
ఇక మహా భారతము. అక్కథకుడైన సూతర్షి, శౌనకాది మహా మునులకు జెప్పినట్లు, వ్యాసుని పంపున వైశంపాయను, అభిమన్యు కుమారుడు పరీక్ష్మిన్మహారాజు కుమారుడు జనమేజయునికి చెప్పబడిన కథ. కథను చెప్పించుకొన్నవాడు పాండవుల మునిమనుమడు జనమేజయుడు. అందులకే కథ పాండవ పక్షపాతముగ నుండి, కౌరవులకు చుక్కెదురుగా తయారు చేయబడినది. నిగమసారవేది, కులపతి అయిన సూతుని నోటికి తగిలింపబడినది.
పోగా, మూడవది, పాతది అయినది రామాయణ కథనము. “వేదోపబంహణార్థాయ” , “వేదైశ్చాసమ్మిప”మ్మనియు, వేద వేద్యే పరే పుంసి, జాతే దశరధాత్మజే.
“వేదః ప్రాచేతసాదాసీ, త్యక్షాద్రామాయణాత్మనా”యని చెప్పబడు అపరవేదమే, వేతార్థ వివరణమే రామాయణము అది అర్షమౌని వాల్మీకి కృతము. ద్రావిడుల కపకార హేతువు.
రామాయణము వేదార్థ వివరణ కాగా, భాగవత, భారతములు పంచమ వేదములైనవి. వేదార్హతలేని వారికివే వేదములు, వేదతుల్యములు. ఈ గ్రంథత్రయి, త్రయీ ధర్మముల “స్త్రీ శూద్రద్విజ బంధువులకు” వుగ్గడించు గ్రంథ రాజములు.
కవిరాజు కురుక్షేత్రం ధర్మవధాక్షేత్రమన్న ఆక్రందన పొంది “కురుక్షేత్ర” నాటకాన్ని వ్రాశారు. రామరాజ్యం శూద్రవధారాజ్యమని ఘూర్జిల్లి “శంబుకవథ”ను వెలువరించారు ఆనాటి వారి యిల్లు “శంబుకాశ్రమము” తరువాత వచ్చిన భావ విపరిణామముతో, “సూతాశ్రమముగా” తన యింటిని మార్చి, సూతపురాణాన్ని గ్రంథించాడు. పురాణ ధిక్కారము, అధిక్షేపణలు పరాకాష్ఠ చెందిన రూపమే సూత పురాణము. భవపటిమ యేర్పడినది. రచనకు కుదురు చిక్కినది. లోకవృత్తములో పరిణామచ్ఛాయలు పొడచూపినవి. కవి పరిణతమతియైనాడు. కవిత నిగారింపులు తీర్చిదిద్దుకొని, తిక్కన పాకం, పోతన వరవడి, రామరాజ భూషణుని పదవి బద్ధత, నన్నెచోడుని తెలుగుదనం, చేమకూర వెంకట కవి శబ్దసూత్రి, వేమన తేట తెలుగులు మేళ వించుకొని, కళాధినాథుడుగా, కవిరాజుగా మూర్తీభవించినాడు.
అప్పుడు తన పురాణాన్ని విప్పిచెప్ప మొదలుపెట్టాడు. అదే సూతపురాణము. తానే సూతుడు. తానే అక్కథకుడు. వివేక పురాణగాథల స్రవంతీ భారాన్ని వహించి, బూతు పురాణాల్ని డుల్లిపుచ్చ నారంభించాడు.
ఏది పాతది? ఏది కొత్తది? వివేకమునకు ప్రశ్న మూలము. ప్రశ్నతో ప్రారంభించినది సూతపురాణము? ఎందుకీ పురాణము? వేదాల మీద వేదాలు వ్రాశారు. పురాణాలమీద పురాణాలు, స్మృతుల మీద స్మృతులూ వ్రాశారుగదా! తిరిగి యీ పాతపాట యెందుకు? సూత పురాణ కారణజన్మ, ఏమిటది?
లోకం, టక్కునేర్పెడి కవుల గంటాల వ్రాతలను తిరిస్కరించి, గతాన్ని చారిత్రక దృష్టితో, సత్య దృష్టితో చూడడం నేర్చుకోవాలి. వ్యత్యాస దృష్టిపోయి, న్యూనతా భావాలు సమసిపోయి, మానవతా విలువలను నిలబెట్టుటకై కృషి ప్రారంభించవలసి వుంది. వేమనాదులు కదిలించి వదలివేశారు. కందుకూరి ఒక రంగంతడివారు, కార్యభారం యెవరో ఒకరు సమగ్ర పరిశోధనకు తలదాల్చవలసి వుంది. సూతుని పేర కవిరాజు పూనుకొన్నాడు. సూతపురాణం ఆవిర్భవించింది.
సూతపురాణం 1925లో ప్రారంభమైనది. ద్వితీయాశ్వాసం 1929లో వెలువడినది. పురాణములా సాంగముగా భయభక్తి యుక్తులతో జదివి, సందియములు హెచ్చి, చిత్తశాంతిలేక, పలువురజేరి, సందేహ నివృత్తికి ప్రశ్నలు వేసి వేసి, విసిగివేసారి, తనకు తానే సమాధానములను యేర్చి కూర్చినాడు. పూర్వులు వ్యాజముతో పురాణములను వ్రాసిరి. తద్విరుద్ధము విందు బ్రాజిలును. కావున
మనసు నచ్చు నెడల మన్నింపగా వచ్చు
మనసు నొచ్చునెడల మానవచ్చు
గాని వివరమే కనకుండ వినకుండ
బరుల బ్రువ్వదిట్ట ఫలము కలదె....
అని శ్రోతులకు నిగ్రహ కర్తవ్యతాబోధచేసి, యిష్టానిష్ట దేవతాస్తుతి చేసి, పూర్వం సూతుడు యెట్టి పురాణములు చెప్పలేదు. అట్టి వ్యత్యాసపూరిత, సంకర కథలను చెప్పనేవగించును. సూతుని దర్శించగా, యీ వైనం చెప్పినాడని కవిరాజు చెప్పదొడగిరి.
సూతుడిని చెప్పుట బూటక మందురా... పూర్వ పురాణములు సూతుడు చిరకాల జీవియని చెప్పినవి. వారిని కవి త్రిపురనేని త్రిపురములు గావించి, త్రిపురాంతకమున చూచి వచ్చి, వారి ముఖమున, కవితాలేశము నొంది, పూర్వ కథల నిజానిజములను గాలింప మొదలు పెట్టినాడు. యీ కథలను నమ్మనివారు నమ్మకపోవచ్చును. కాని, నమ్మకుండుటకు హేతువులు చెప్పవలసి వున్నది. అదే కవి శ్రోతలనుంచి, చదువరుల నుంచి కోరునది.
సూతపురాణము తెలుగులో యెనలేని హేతువాద యుగారంభ సాహిత్యం. కవితలో విమర్శచేస్తూ యింత మహోదాత్త కవితను వెలార్చటం నాన్యతో దర్శనీయమైన విషయం. భారతావనిలో యీ రీతి రచన మరొకటి యే సాహిత్యంలోనూ లేదు. యింగ్లీషులో డైడస్, పోప్.లాంటి వారి రచనలూ దీనికి  దీటుకావు. సూతపురాణ విశిష్టత కాదు. త్రిపురనేని విశిష్టత తెలుగునాట అదే.
కవిరాజు మరో విశిష్టతవారి పీఠికలు, జార్జి బెర్నార్డ్.షా వీరికిందులో సాటి. మరొకరు లేరు. స్వపర కావ్యాలలోని వీరి పీఠికలను ప్రత్యేకంగా ముద్రించవలసి వుంది. అది తెలుగుల రినైజాన్సు వుద్యమపంటకాగలదు.
సూత పురాణములలో వీరేమి సాధించిరి.... అది మన ప్రశ్నలకు ప్రశ్న.
ప్రథమాశ్వాసము..
విద్య ప్రాకృతజన దుర్లభమైన, భారతలోకము అజ్ఞాన గాఢాంధకార బంధురముగా వున్నది. దానివల్ల అక్షరాస్యుల ప్రభచెల్లినది. పూజలనందిరి. సంస్కృతము పవిత్ర వంతముగా భావింపబడినది. ఆ ప్రభావము వ్యక్తితో మొదలిడి, శిష్యులకు ప్రాకి, కులాధీనమై కూర్చున్నది. కాలవాహినిలో కేవల కులమాత్రమై వెలసినది. వ్యక్తిగతమైన నాటి ప్రజ్ఞా ధురీణత మంటగలపి, పుట్టువు నాశ్రయించి బ్రతుక మొదలిడినది. అది, మన విజ్ఞానం అజ్ఞానంగా మారిన చరిత్ర. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య గ్రస్తమై నిలచినది. సత్యనిరతి కృశించినది. ధర్మచ్యుతి యేర్పడి, చిత్తశుద్ధి లుప్తమైనది. చిత్త సంస్కారములేని శుష్కాచారమే ప్రధానమై, గాథలు, కథలు, దానిచుట్టూ ఆ స్వార్థం కొరకు కల్పన చేయబడినవి. అవియె పూర్వ పురాణ, యితిహాస, స్మృత్యాదులు. వాటి భాండారావలోకనమే సూతపురాణ కర్తవ్యము.
ఇక పూర్వనుడుల పరిశీలన ప్రారంభమైనది. ముందుగా, యుగాల కథన. కృతయుగము 17,28,000ల వర్షములు. త్రేతాయుగము 12,96,000ల  సంవత్సరములు. ద్వాపరయుగమునకు 8,64,000 హాయనములు. కలియుగమునకు 4,32,000ల యేండ్లు పెట్టిరి. మొత్తం 43,20,000ల ఏండ్లు.
మనుష్యులు యీ రోజుల్లోకన్నా దీర్ఘకాలం బ్రతికే వారు కారు. మానవుని శారీరక నిర్మాణం అట్టిది. కాలాన్ని యుగాలుగా విభజించి, యుగాలకు అనంతంగా సంవత్సరాల్ని సంతరించారు. బలిచక్రవర్తి కృతయుగంలోననీ, ఆయన కూతురు కూతురు వజ్రజ్వాల త్రేతాయుగంలో కుంభకర్ణుణ్ణి వివాహమాడెననీ, కాని, ఆయన కొడుకు కూతురు ఉషా కన్య ద్వాపర యుగంలోని కృష్ణుని మనుమడు అనిరుద్ధుని వివాహమాడెననీ వ్రాసిరి. ఏమి యుగములు?
కాగా వశిష్ఠుడు త్రేతలోవాడు. వ్యాసుడు ద్వాపరాంతంలోవాడు. వ్యాసుడు వశిష్ఠుని మునిమనుమడు. ఏమి యుగాలు?
అందులకే కవిరాజు యుగాల్ని విమర్శించి, ఆర్షబండారాన్ని బయటపెట్టాడు. ఇక పౌరాణికులు, యుగధర్మమని వుగ్గడించుట, కృతనుండి కవికి ధర్మచ్యుతి అయ్యెనని వాపోవుట చూచి, ఆయా యుగధర్మాల్ని క్రమానుగతంగా పరిశీలించారు.
కృతయుగము : సార్వభౌములు లేక, వీరుల పాలన సాగెడిది. జాతిమత వివక్షతలు లేవు. వావివరుసలు లేక, జాత్యంతర వివాహములు కలవు. స్వైరవిహారము మెండు. స్త్రీలు ఆడు వస్తువులు. బ్రాహ్మణులకు క్షత్రియులు లోబడినను తిరుగుబాట్లును కలవు.
త్రేతాయుగము  :  స్వైర విహారముతగ్గి ప్రజలకు స్థిర నివాసము లేర్పడెను. తపస్సు పెరిగెను. ఆముష్మికము హెచ్చెను. స్త్రీలకు కట్టుబాట్లు మొదలాయెను. గోమాంస భక్షణ విపరీతము కాదు. యిల్లాండ్రు వెలయుచుండిరి. భార్యా భర్తృ సంబంధములు రాజొచ్చెను. కులద్వేషము మోసులెత్తెను. బ్రాహ్మణుల ఆధిక్యము పెరుగజొచ్చెను.
ద్వాపరము – రాజ్య తృష్ణ హెచ్చెను. గోమేథ, నరమేథములు తగ్గి, గోమాంస భక్షణము తగ్గి, బహుపతితత్త్వము హేయముగ జూడబడనారంభింపబడెను. విప్రముఖముననే విద్య ప్రవర్తిల్ల వలయునను వాదము సాగెను. వివాహము కుదురుకొన్నది. వావివరుసలు రాజొచ్చినవి.
కలియుగము  :  విద్య ద్విజుల సొత్తు. స్త్రీ స్వతంత్ర్యము నిర్మూలింపబడినది. యజ్ఞయాగాదులు ఆగినవి. నర, గో, అశ్వ మేథములు పోయినవి. బలులు తగ్గినవి. శుల్కసంభావిత వివాహము తలయెత్తినది. పెండ్లి, మాతాపితల సర్వస్వామ్యమైనది. బ్రాహ్మణోమమదేవతమైనది. రాజులు బ్రాహ్మణాధీనులైరి. బహుపతిత్వము గర్హ్యమైనది. బహుపత్నీత్వము అంతే. భిన్న మతములుత్పన్నమైనవి. కుత్తుకలు మొసవుకొనమొదలిడిరి. కుమారిలబట్టు శంకరులు బౌద్ధమును హరింప ప్రయత్నించిరి. వావివరుసలు మిగుల కట్టుదిట్టములకు లోబడెను. ప్రజాసామాన్యము తమ స్వత్వముల నెరుగక గోడుగోడనకొచ్చిరి. బ్రాహ్మణ వాక్యములే మణిమంత్రౌషధములయ్యెను. కులాల ధర్మములు వచ్చెను. యిది ఆర్య జాతి పతన హేతువయ్యెను.
ఇక యుగధర్మ పురావృత్తము. పురాణములను పరిశీలన దృష్టితో చూచిన పద్ధతి వర్తమానము పూర్వయుగములకన్న మిన్నయని కవిరాజు భావము.
యుగముల గాథలు తారుమారుగ నున్నవని పురాణములే సాక్ష్యములని కవిరాజు వాదన. యుగాలు, యుగ ధర్మాలను పరిశీలించినచో, పూర్వపురాణ, స్మృతి యితిహాసములు పనికిరానివని, పాఠకులే గ్రహింతురని వారి భావము. అదియే వారికృషి.
తరువాత వీరి పురాణ కృత్యాదులు పరిశిష్ఠాలు. యిష్టానిష్టదేవతాస్తుతి కలదు. మత దేవుళ్ళు అందరూ తల క్రిందులౌదురు. దేవుళ్ళలోని లంచగొండితనము కాంచిరి. దైవపాలనలోని ద్వంద్వ ప్రభుత్వమును చూచిరి. పూజారి రగడనెంచిరి. బ్రాహ్మణ మత ఫలిత సాంఘిక దౌష్ట్యాన్ని గర్హించిరి.
ఆదికవి భరతము పట్టిరి. నన్నయ్య ఆదికవి కాదని, తెలుగు భాషాఘోష క్రమ పరిణామమును చారిత్రక, భాషా దృష్టితో నగ్గించిరి. తన యిష్టకవులైన నన్నెచోడుడు వేమన, రామరాజ భూషణుడు, చేమకూర వెంకటకవుల స్మరించిరి. నన్నయ్యకు పూర్వపు తెలుగు కవితను యేరికూర్చరి. పొట్టకూటి, ఆశ్రయింపు కవిత్వాన్ని గర్హించి, కవుల స్వాతంత్ర్య దీప్తి కావలెననిరి.
వారి గ్రామ, కుటుంబ ఔన్నత్యాల సంప్రదాయ బద్ధంగా చెప్పికొనిరి. కవిది పండిత, కవి కుటుంబము.
కవి పూర్వపురాణ పఠనవల్లకల్గిన నిర్వేదమును బాపుకొనుటకై, చిరకాల జీవి సూతుని చూడ పయనమై నదులు, కొండలు,  దాటి ధూర్తగోపాలుని లీలా విలాస స్థలాలు చూచి, సూతర్షిని చూచును. సూతునికీ రాక దానుముందే “వ్యాసుడు చెప్పి, వారిసందేహ నివృత్తి చేయును. దానివల్ల లోకకల్యాణమగు”ననెనట. కవిరాజు రాక వ్యాసుని గమన గోచరములకెక్కి, సూతుని చెవిసోకినది. సూతర్షి చెప్పిన సమాధానములే, లోక సందేహ నివృత్తికిగా సూత పురాణమైనది.
మొదటి సూతోక్తి. శౌనకాదులు మున్నొకనాడు సూతుని నైమిశారణ్య సత్రయాగ సమయమున వేదపారీణునిగా నెంచి, అక్కథకునిగా తీసుకొనిపోవ, దుర్వాసుడు ధిక్కరించి “సభికులు వేదవేత్తలు, ద్విజన్ములు, భాషయొ. సంస్కృతంబనేక భవహరాఢ్య నైమిశము కాగలక్షేము, కాలమన్ననో శుభతర సత్రయాగమెటు సూతుడు నిర్మల ధర్మవైదుషీ విభవము గల్గియున్నను, వివేకము కల్గిన నర్హుడయ్యెడున్” అంటాడు. అప్పుడు వ్యాసుని పిలిచిరి. వ్యాసుడు “జ్ఞానులెప్పుడజ్ఞానుల చెంతచేరి యిది కాదా యౌనని నచ్చచెప్పి సుజ్ఞానుల జేయుటే విధి” అనీ, అందులనే సూతినికి “స్మృతి రహస్యమున్ శ్రుతిజ్ఞానమున్ విదితారాచార విశేషముం తెలిపి దీవిస్తారని” జేసితి మన, సభికులందరు సూతర్షి నంగీకరించిరి. ధర్మవ్యాధునికడకు కౌశికుడు పోవు వృత్తాంతము చెప్పిరి.
కవిరాజు యీ కథవలన, విజ్ఞానానికి కులగోత్రాలు లేవని చెప్పనెంచారు, చెప్పారు.
విప్రుడగు గోపన తెలుగునాటమ్లేచ్ఛుడగు కబీరుని యొద్ద జ్ఞానార్జన కథకమును సూతుడు చెప్పును.
యుగాంతరాలతో నిమిత్తము లేక ధర్మమొక్కటియేనని సూతుని బోధ. ధర్మము మారదు. చదువులసారం, సత్య, శౌచ, వృత్త శీలములు పెంచుటకేగదా! సూతుని ముఖమున తెలుగు భాషా ప్రాశస్త్యమును చెప్పించి, కబీరు కథ వినును, యిది ప్రథమాశ్వాసము.
ద్వితీయాశ్వాసము – మహోజ్జ్వల జోతలు, పురాణస్థ విషయములపై సూటి ప్రశ్నలు. దేవతాలోకం, దేవతలు, దేవేంద్రుడు – వీరి వృత్తాంతమును గూర్చి మీ మాంస టిబెట్ త్రివిష్టపమనీ, హిమము చేగప్పడిన కొండ రజతాద్రియనీ, స్ఫటికలింగాలు కన్పించినవనీ, భిల్లజాతివారినే శాంభరీ భిల్లునిగా నెంచిరనీ వివరించిరి.
శివుని జటాజూటమునుండి గంగానది దిగెననీ, సగర సంతతి సాగరములకు కారణులనీ చెప్పు కథలలోని కల్లను బొల్లిని వివరించారు.
గగనంబులో నుండి గంగమ్మ శివు మస్త
      మున దూకెనను మాటములుతమాట
అతితపోనియతిచే నల భగీరదుడు గం
      గను దెచ్చెననుమాట కల్లమాట
గంగాజలంబుచే గంధి నిండింపగా
      బడియె సుమ్మనుమాట బడుగుమాట
అన్నాడు. గంగామూలాన్ని కనుగొన్న భగీరథుని పేర లోకం యీ యితివృత్తాన్ని కల్పనగావించి, గంగనే భాగీరధిని చేసిరి. లోకమునకది భగీరథ ప్రయత్నమైంది.
కవి త్రివిష్టపము చూచి, ముందుగా సూర్వవిని పొడగాంచి, రిత్తపడి, అటునిటు తిరుగాడుచూ ఆ సీమలోని “నగ్న వై రాగ నిర్మగ్నలై” వారిని సోమయాజుల రంకు చరితలను, ఇంద్రుని చూస్తారు. యంద్రుని యందు..
“వేయిగన్నులు నాకు గన్పింపలేదు
పొడలు మాత్రము గన్పించె నొడలినిండి”
అంటారు. ఆ పొడలు, కామరోగుల కుండు పొడలు.
కప్పకు మాండూక్యముని పుట్టుట, శుకయోగి చిలుకకు పుట్టుట, శౌనకుడు శుని గర్భమున పుట్టుట, అశ్వత్థామ గుర్రమునకు పుట్టుట తడవబడినవి. మనువు గోచరింప, స్మృతి కథనములు వచ్చెను. మనువునకు వేసిన ప్రశ్న:
“జాతులబట్టి మేము స్మృతి సంహితలన్ రచింప లేదిటన్
జాతులబట్టి తప్పులు విచారణ జేయుము శిక్ష చెప్పగన్
జాతులబట్టి ధర్మము ప్రచారము సేయుము బందుకట్టి నీ
భూతదయాగుణంబునకు మోదమునందితిజెప్పసేటికిన్”
“................” ఋషిని యెట్లైతి వేగతి స్మృతిని వ్రాసి
ధర్మ నిర్ణయమ్మును జేయ దగితివయ్య”
అని కవి మనువును పృశ్ఛించును.
తరువాత కవి నందనోద్యాన మరసి, మనోజ్ఞ తెలుగు కవితలు వెలార్చి, దానిని భోగభూమిగా చూచి, “వుండరాడిందు మావంటి యోగులకును” అని నిర్ణయిస్తారు.
తరువాత నారద సూతుల సంవాదము, త్రివిష్టము, స్వర్గము టిబెట్ అని రూఢి చేసిరి. కవి నారదునితో గోష్టి చేయును. సురాసుర విచారము జరిగి –
సురయనంగ మద్యంబు తత్సురను ద్రావి
వినుతి కెక్కిరి సురలను పేరిచేత
సురను నొక్కనాడేని యూ చూడకున్న
కారణము చేననుసురులైరి కడమ వారు
అని తేల్చుకొనిరి. రాక్షసుల విషయమై.....
      ఆర్తరక్షా పరాయణు లవుట చేత
      వాసిగాంచిరి రాక్షస ప్రవరులనగ
      యాతనా ప్రాణి వి తఱగాపాడుకతన
బూతు ధానులనంగ బ్రఖ్యాతి గనిరి
అని నారదుడు కవికి చెప్పును. వుదాహరణకు, తత్వవేత్త వృత్రాసుర వృత్తాంతము. నీతిశాలి స్వర్ణనేత్రుని కథనము, వదాన్యమూర్తి బలిచరిత్ర, వేదవేత్త విశ్వరూపులు రాక్షసులుగదా, వారెంత ప్రసిద్ధ చరిత్రులని నారదుడు చెప్పును.
తరువాత ముజ్జగంబుల దొర ములుచతనము వలన వేల్పులు వలసపోవలసిన వృత్తాంతము చెప్పిరి. ఆర్యవర్తము జొచ్చి, మూడుపూవులారుకాయలుగా నుండెను. అది వేల్పులాక్రమించిని భూమి. ఆదిమవాసులైన ద్రావిడులు సమావేశమై, యీ ఆక్రమణలను చర్చించి :
“బొల్లి మొగము మీ దయ నిల్వు బొట్టు బెట్టి
రాలు కప్పల కెల్లరు గేలు మోడ్చి
గంద్రగోళంబు గావించు కల్ల రీంద్ర
దౌష్ట్యమును మాన్పకుండుట ధర్మమనునె?”
అని వితర్కించిరి ద్రావిడ భూమి రక్షణకు సమాయత్తులైరి. కాని ఆర్యులు ద్రావిడులను వింధ్యదాకా వెంటాడిరి.  ఆ జాలి వృత్తాంతము వినిపింతురు. వోడిన ద్రావిడులను కాడుచేసి.
కలుషితాజ్ఞాన గాడాంధకారమునకు
ముంపయత్నముల్ చేసిరి తెంపుతోడ. ఆర్షకులపతియైన వశిష్ఠుడు తంత్రములు పన్నును.
“నూతన వైఖరిన్ మిగుల నూతన ధర్మము లుగ్గడింపగా
నా తరిబ్రాహ్మణోత్తముల నందఱికిం బిలిపించి చెప్పగా
నాతత శేషముషి విభవమచ్చుపడన్ దలలూచి వారలన్
గైతవ బుద్ధి మాటుపడగా దెగ వ్రాసిరి ధర్మసూత్రముల్.”
      “గుడుల లోనికి బోవుట కూడ దనిరి
      బజీలలోనికి బోవుట పాపమనిరి
మడుల గట్టుకొనుట ధర్మమార్గమనిరి. ”
యీ విధముగా ఆర్య ధర్మాలను స్మృతి, పురాణాదులలో క్రుమ్మరించిన కథను హృదయ విదారకంగా  నివేదించిరి
      “మంచి కాలంబునకు లేచి పొంచి పొంచి
      యార్య మందిరంబు లందు నణగి మణగి
      చివికిపోయిన మనసుతో నవసి నవసి
యుత్తదానికి ద్రావిడులున్నయంత. ”
దక్షిణాపథానికి వచ్చిన ద్రావిడులు, దానినే స్వదేశంగా తలపోసి, దానిని బాగుచేసి, నివాసయోగ్యంగా చేసి, వ్యవసాయాది వృత్తులజేవ పొందిరి.
“వింధ్య దక్షిణ భాగ విశ్వంభరను నొక్క
గొడుకు క్రిందికి దెచ్చి విడచినారు”
ఇట – “అన్నమో రామచంద్రా యంచు నారాట
      పడి యంగలార్చెడి వారు లేరు”
ద్రావిడ సీమ, పాడిపంటల కాకరమై, ఫలప్రదంగా వర్థిల్లుచున్నదనిరి పొగడిరి.
కాల వైపరీత్యమున, ద్రావిడావని చీలి చిన్న చిన్న సీమలుగా జొచ్చెను. ద్రావిడులు తమిళులు, తెలుగులు, కన్నడులు, మలయాళులు మొదలగు జాతులుగ జీలి దక్షిణాపథము నాల్గు చెరగులు నాక్రమించిరి. పాలనాదులు వనరులతో సాగుచుండ, ఆర్య కుట్రదారులు, అగస్త్యుని పంపిరి. అతడు మతమును బోధసేయు మిషతో భేదోపాయములచేత భేదము పుట్టించినాడు.
“కులము లేనట్టి వారికి గులమునిచ్చి
పేరు లేనట్టి వారికి బేరు నిచ్చి.....
పనిని సాగించెను గులనాపకుల జేసి
కుల గోత్రములకొన్ని క్రొత్తగా బుట్టించి”
విప్రులటంచును బేరు పెట్టి, నూతన ప్రబోధముల జేసి, గంగ గుడులు మాని సీతారాములకు, పోతురాజాదులను, భద్రునికి, గొంతెమ్మ దేవతల వదలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, పోలేరమ్మను విడచి యజ్ఞములకు మలిపినాడు. మాతృభాషాభిమానాల వదలి సంస్కృతంబు శ్రద్ధగా చదివించినాడు. అదిగాక :
      “బ్రాహ్మణులను శూద్రులను మాత్రంబె కలరు
      క్షత్రియులు వైశ్యులును లేరు కలియుగమ్ము
నందు నంచు సిద్ధాంత వాక్యములు వ్రాసి
పెట్టిపోయి స్మృతులు ద్రావిడుల కొఱకు”
స్మృతి పురాణాలకు గౌరవములు పెంచినాడు.
యిది యిట్లుండ, అసురుల వలసలు సాగినవి. అసురులు నేటి పారశీకార్యులైరి. యవనులు పారశీలైరి. అసుర వాస భూమి పారసీకమయ్యెను.
యిది కాగా, ద్రౌపదీ దృష్టద్యుమ్నుల కథనము సూతుని వల్ల కవి వినును. వారలయోనిజలనిగదా భారత గాథ. పాంచాలరాజునొద్దకు ద్రోణాచార్యుడేగును. వారలు పూర్వ సహచరులు. ద్రోణుని పలుకరించమి, వారాగ్రహించి వెడలిపోయిరి. సూటిగా హస్తినపురికి బోయి, భీష్మునిగాంచి వారితో మాటాడి, గురు కుమారులకు నొజ్జమైరి. ద్రోణుని పంపున అర్జునుడు ద్రుపదిని బట్టి తెగ, వానిని అవమానింతురు పరాభవాగ్ని త్రేల్చగా, కసిదీర్చికొను యత్నములో, సంతాన విహీనుడైనందున, కసిదీర్పగల తనములు లేమికి వగచి, చారుల వల్ల ద్రౌపది, ధృష్టద్యుమ్నులను బిడ్డల తెప్పించి, పెంచి, పుత్రకామేష్టి జేసి, యజ్ఞంపు పొగలు దిశలు గ్రమ్మ యీ బిడ్డలను యజ్ఞగుండమునకు త్రెచ్చి, వారలందుద్భవించి నారనిరి. వారే ద్రౌపది, ధృష్టద్యుమ్నులు.
యివీ సూత పురాణ ప్రథమ, ద్వితీయాశ్వాసములు. వీనిలోని కవితా శిల్పం జోలికి నేను పోలేదు. పురాణ కథా నిర్మాణమే ప్రాయకంగా తడవితిని.
పూర్వకథలనేకములకు, ప్రతి కథ లిందులో గలవు. పదివొప్పు? యేది తప్పు ?
పురాణములు చరిత్రలు కావు కాని, కొన్ని కొన్నిచోట్ల చారిత్రక సంఘటనల మూలాలు తగులుతవి. దాని విషయిక పరిశోధన వేరే జరుగుతుంది.
పూర్వ కథలు కట్టుకథలు, కవిరాజు కథలు కొన్ని అదే మాదిరి కట్టు కథలు. పోతే, కవిరాజు కథలనే కట్టుకథలని, పూర్వపు కథలు నిజాలన వీలులేదు. వీలులేదనే కవి రాజు వాదన. “అవీ యివీ కార్యకల్పనలే కదా, రెంటినీ పురాణాలేననీ తీసివేస్తామంటే కవిరాజుకన్నా సంతోషించేవారుండరు.
ముఖ్యంగా గమనించదగ్గది హేతుత్వదృష్ట్యా నిల్వగలిగిందే సత్యం. కానిది కాదని వారి వాదన. శాస్త్ర పద్ధతికి వివేకానికి మించిన కొరముట్టులేదు. కవిరాజు హేతువాదం మీద నిలచినంతగా, చరిత్రమీద నిల్వలేదు. కారణం పురాణ మీమాంస పౌరాణికంగానే జరిపారు.
లోకం విజ్ఞమై గ్రుడ్డి నమ్మకాలను, గూని కథలను స్మృతి పురాణ, శ్రుతివచనాలలోని మౌఢ్యాన్ని మదలటమే వారి ధ్యేయం. ఆశయసిద్ధి పొందే రచనలివి.
సూతుడు లోగడ శౌనకాదులకు చెప్పాడనగా, సూతుడు నాకూ చెప్పాడన్నారు. యిది సూనర్షి వాక్య సంహిత. యది షష్టమవేదము. “ఋషి భక్తియందు మేమెవ్వరికినీ దీసిపోము అంటారు కవిరాజు.” అవును.

(కవిరాజదర్శనం నుండి)

AVULA GOPALAKRISHNAMURTY PUBLISHED THOROUGH STUDY OF TRIPURANENI RAAMASWAMY(1887-1943) and gave clear exposition of magnum opus poem SUTAPURANAM .This is taken from the souvenir Kaviraja Darsanam and brought out in a book entitled :Sahityam lo auchityam ( 1968) edited by Narisetti Innaiah in colloboration with Mandava Sriramamurthy