6, ఏప్రిల్ 2011, బుధవారం

శ్రీపాదభాషా సామ్రాజ్యం


శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

(కవితాసేవ – తీరుతెన్నుల సమీక్ష)

Humanist AGK critical appraisal


శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 1866లో గోదావరి జిల్లాలోని దేవరపల్లిలో సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిరి.
 తమను గూర్చి తాము
“నను శ్రీపదాన్వయ జనితుని వేంకట
సోమయాజికి సుబ్బ సోమిదమకు
నాత్మజుని జతుర్విధాంచిత సుకవిత్వ
తత్త్వ విజ్ఞుని భారత ప్రభృతి శ
తాధిక గ్రంథ కృత్యార్తగాముని శ్రౌత
విద్యా విశారదు వేదవేదుని,
గవి సార్వభౌమ ముఖ్య బిరుదాంబితాఖ్యు
గండపెండేరధారి గంగాజలది
సక్త కనకాభిషిక్తుని శతరధానా
చతుగళా, ప్రపూర్ణుని గృష్ణశాస్త్రి... ” అని
వ్రాసికొనిరి. శాస్త్రిగారి జననకాలం సంధికాలం. సిపాయి తిరుగుబాటు అణచబడి, తిరిగి కుదురుకొను రోజులు. బ్రిటిష్ పాలనలో సాంఘిక దృష్టి ప్రవేశించు దినములు రాజకీయ స్వాతంత్ర్య బీజములు మొలకెత్తబోవు రోజులు.  ప్రాచ్య విద్యలకన్న, పాశ్చాత్య విద్యల నభ్యసించు రోజులు, రామమోహనరాయ్ (1772-1833) కృషి ఫలితంగా సాంఘిక సేవాదృష్టి కలిగిన రోజులు. చిన్నయసూరి (1806-1862) గతించిన రోజులు, కందుకూరి (1848-1919) మొలిచే రోజులు ఆ జిల్లాలో కోరాడ రామచంద్ర శాస్త్రి, వారణాసి వేంకటేశ్వర కవి, విశాఖలో మండపాక పార్వతీశ్వర శాస్త్రి, అవధాన పితామహుడు మాడభూషి వెంకటాచార్యకవి, కృష్ణాజిల్లా నూజివీడులో పెరిగిన రోజులు. శబ్దరత్నాకరం, బహుజనపల్లి సీతారామాచార్యల వారివల్ల సిద్ధం చేయబడుతున్న రోజులు.
దివంగతులైన వేదము, గిడుగు, వావిలికొలను, జనమంచి, తిరుపతి వేంకటేశ్వర్లు, పురాణపండ మల్లయ్యశాస్త్రి, వడ్డాది సుబ్బరాయకవి, చిలకమర్తి, పానుగంటి, కాశీభట్ట, కూచి, చిలుకూరి వీరభద్రరావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గురజాడ శ్రీరామమూర్తి, ధర్మవరము రామకృష్ణమాచార్యులు మొదలైన వారంతా సమకాలికులుగా వున్న రోజులు. చిన సీతారామస్వామి, దువ్వూరి, తంజనగరం పెరుమాళ్ళయ్యలు కలరు.
అట్టికాలంలో పుట్టి పెరిగి, శాస్త్రిగారు, యితర వ్యాసంగాలు పట్టించుకొనక, తన సాహిత్య రంగాలలోనే, తనకు తానుగానే తిరుగుతూ వుండిపోయారు. రమారమి మూడు తరాలపాటు, డెబ్బదియైదేళ్ళ పాటు, సాహిత్య మాగాణిలో పని చేసిన వృద్ధ కృషీవలుడు.
ఈ దీర్ఘకాలకృషిలో, శాస్త్రిగారెన్నో బిరుదులనందినారు. మరెన్నో సన్మానాలు పొందినారు.  చిన్ననాటనే వేదవేదాంగ పారాయణచేసి, శ్రౌతస్మార్త కర్మాష్ఠానాదుల వరపుమీర కావించనేర్చిరి. రఘువంశం మొదలుపెట్టగా సంస్కృత కవనాల జాడలెరిగి, పదునారేళ్ళకు తెలుగు కవిత్వ తెన్నులరసినాడు. తన పండ్రెండవ నేటనే శ్లోకములు వ్రాయనారంభించెను. తండ్రి యజ్ఞాదులు చేయగా, అందు తానాధ్వర్యము వహించినాడు, సోమయాజులవారి బిడ్డ.
వీరెన్నో బిరుదులు పొందిరి. వేద విద్యా విశారద, ప్రసన్న వాల్మీకి, ఆంధ్రవ్యాస, అభినవ శ్రీనాథ, అభినవ వ్యాస, కవిరాజు, కవి సార్వభౌమ, అనునవి కొన్ని. ఆంధ్ర విశ్వవిద్యాలయమువారు కళాప్రపూర్ణ, మహా మహోపాధ్యాయ బిరుదముల నిచ్చి గౌరవించిరి. 1950లో మద్రాసు, రాష్ట్రప్రభుత్వం తెలుగుభాషలో వారిని ఆస్థానకవిగా అభిషిక్తుని చేసిరి.
ఇన్ని బిరుదులు పొందుటయేగాక, అనేక సన్మానములంది, గజారోహణాద్యుత్సవాదుల పొంది, ఠీవిని హవళింపజేసిరి. వాటిలో పేరెన్నిగన్నది. 1933 నాటి గండపెండేరపు మహోత్సవము, శతావధాని చళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శ్రీపాద వారికి గండపెండేరము నిండు పేరోలగములో తొడిగిరి. ఆనాటి సంబరము చూడవలయునేగాని, చెప్పరాదందురు. ఆ సభలో శాస్త్రిగారు.
“నా కీరిచ్చిన గండపెండెర మిటన్
      నాస్వత్వమే నాటి కిం
గాకుండు, న్వినునేను ప్రాణము
      లతో గన్పట్టునందాక నా
డాకాల నిల్వసిల్లు నెప్డు చెడకుం
      డన్, దీని నాంధ్రావనీ
ప్రాకామ్యంబగు యూనివర్సిటి
వహింపంజెల్లు స్వత్వంబుగన్.”
అని చెప్పుకొన్నారు. పెద్దన గండపెండేర వుదంతాన్ని గుర్తుకు తెచ్చు సభా వుదంతమది. యీ విధంగా దేశంలో యెన్నోచోట్ల, యెన్నో సన్మానాది కాలనందినవాడు శాస్త్రిగారు.
బిరుదులు, సన్మానాలలోనివే శతావధాన, అష్టావధానాదులు, శాస్త్రిగారు పలుమార్ల యవధానములను జేయుటయే గాక, సంస్కృతంలో శతావధానాన్ని కావించారు. అది వుదాత్తమైన సన్నివేశంగా పండితులు చెప్పవింటిమి. అది అపూర్వ సన్నివేశం గూడా. యిట్టివిలేవు. అసలు అవధానములు తెలుగుదేశంలో తప్ప, యితర దేశాల్లో, యితర భాషల్లో లేవు. అవధానాల ప్రధానంగా ధారణ క్రియలు, అవధానాలు సాధారణంగా కవిత్వాన్ని చంపుతై. అందువల్లనే చాలమంది అవధానులు మంచి కవులు కాలేరు. రచనా వైవిద్ధ్యం వారిలో సరిగా రాణకెక్కదు.
శాస్త్రిగారు సంస్కృతంలో తన చరిత్రను తాను వ్రాసుకున్నారు. అది విశిష్టమైన తీరు, అట్టివి అరుదు. చిన్నతనంగా నిగ్రహ పద్ధతిని శాస్త్రిగారికి మంచి శిక్షణ లభించుట వారికి తరువాత కాలంలో ప్రయోజనకారియయ్యెను. కలిగిన కుటుంబం, చేయిచాచవలసిన అవసరాలు లేనిస్థితి. పండిత వంగడం, పొదుపైన కుర్రవాడు, గుణాఢ్యతకు లోపంలేదు. అందువల్ల కవిగారి కావ్యకథా కథనమంతా బాగా నడిచింది.
గద్యపద్యాత్మకంగా, వారి జీవితాన్ని వ్రాసిన ఆనంపంతుల రామలింగ స్వామిగారన్నట్లు.
అయిదేండ్లపుడె వారియయగారు కథలెన్నో
నొడివి లోకజ్ఞానమిడిన కడిమి
యా బాల్యముగ నన్నయాది భారతమును
విని చదివిన దానవెలయు ఫలము
అనవరతములోన నాంధ్ర నైషధకర్త
కవితామహత్వమున నెడుగురుత
విడక బాలదే వినెడ నాల్కనిడికొని
ధ్యానించుచుండు నుదారమహిమ
కారణంబయి ప్రోతాహరకరములగుట
నూటయేబది గ్రంథముల్ మేటు లెన్న
సలిపి కవిసార్వభౌముడై చనుటగాక
కృష్ణుడాస్థాన కవియయి జిష్ణుడయ్యె.
కృష్ణమూర్తిగారు కవిగానే కాక, పత్రికా రచయితగా, ప్రచారకుడుగా గూడా కొన్ని కొన్ని వైశిష్ట్య కార్యాలను చేశారు, “గౌతమి” అను పేర, దేశంలో తెలుగు దిన పత్రికలు లేని రోజుల్లో 1908లో రెండు సంవత్సరాలు దిన పత్రికగా నడిపి, తరువాత, వారపత్రిక నడిపారు. ఇదికాక “కళావతి”, “వందేమాతరం”, “మానవసేవ”, “వజ్రాయుధం” అన్న పత్రికలను యా యా కాలాల్లో నిర్వహించారు.
“వందేమాతరం” వారికిగల దేశభక్తీ ప్రదీప్తికి, “మానవ సేవ” వారికిగల సాంఘిక నిరతికి, “కళావతి” వారి కళాభిరుచికి, “గౌతమి” వారి స్థానిక భావుకతకు, “వజ్రాయుధం” భాషా రంగంలోని వివాదులలో వారి కాఠిన్యాన్ని రుజువు చేస్తున్నది.
ఈ పత్రికల విషయమేగాక, “వజ్రాయుధ” ఘట్టాల్ని ఒకటి రెండు పరామర్శింప వలెను. అవి గ్రామ్య గ్రాంథిక, లేక వ్యావహారిక గ్రాంథిక భాషా విషయికమైన వాదోపవాదాలు జరుగు రోజులు. శాస్త్రిగారు గ్రాంథిక వాదులని చెప్పనవసరం లేదు. “వజ్రాయుధం” ఆనాటి పత్రిక. పత్రిక పేరే ఆ తీవ్రతను స్ఫురింపచేస్తుంది.
శ్రీపాదవారి పోరు రెండు రంగాల్లోది. ఒకటి, సూటిగా వ్యావహారిక వాది ప్రవక్త గిడుగు వెంకట రామమూర్తిగారితో. రెండవది, గ్రాంథిక వాదులుగా నడయాడుతూ, ప్రచ్ఛన్న వ్యావహారికవాదులతో. ఇది ఆనాటి గోప్యకాండ.
గిడుగువారు గ్రాంథికుల అందరి మీద, ముఖ్యంగా ప్రశస్తులైన వారిమీద దాడి సాగించారు. ఇంగ్లీషు రానివారి మీద మరీ దూకుడుగా వచ్చారు. శ్రీపాదవారి మీదికి ఘాటుగా దూకారు. శ్రీపాదకు చెళ్ళపిళ్లకు వివాదం రేగి, చాల దూరం వెళ్ళింది. ఆ వివరాలు ప్రస్తుతాలు కావు. కాని ఒక విషయం చెప్పక తప్పదు. శ్రీపాదవారి కావ్యస వ్యాకరణాది దోషాలను చెళ్ళపిళ్ళవారు ఎత్తి, సేకరించి గిడుగువారికి అందచేయటం, అవి గిడుగువారు వారి విమర్శలో వాడటం జరిగినదని పండితలోకం  యెరుగును. అంతేకాక, వ్యావహారికముపై, తమకు వ్యతిరేకతలేదని చెళ్ళపిళ్ళవారు చాటుటకై కొన్ని వ్యాసములను వ్యావహారిక భాషలో వ్రాసిరి. యీ రాజీ, శ్రీపాదవారి మీదగల వ్యతిరేకతను పురస్కరించుకొని, గిడుగువారికి, చెళ్ళపిళ్ళవారికి కుదిరినది. ఇది సాహిత్య వీధుల్లో రాజీ, రాజకీయాల్లోని రాజీనే యెరుగుదుంగాని, సాహిత్యరంగంలో వాటిని యెరుగము. కాని జరిగే కుట్రలకు సాహిత్యం మాత్రం అడ్డుతగులుతుందా?
అట్టి గిడుగును గూర్చి శాస్త్రిగారు తమ “ఆంధ్రాభ్యుదయం”లో
“గిడుగు రామమూర్తి వడిగల పిండంబు”అని
“తెల్గు గ్రంథముల బఠించి సాహితి విధం
బది యెంతయు సంగ్రహించి” అనీ,
“అచ్చు పడియున్న గ్రంథములన్నియు గొని
చదివియందరి దోషముల్ సంగ్రహించి
యున్నవాడుగావున నవిన్నిన్ని యనుచు
జెప్పు నారామమూర్తి విశేషధిషణ”
అని వ్రాశారు. వాదోపవాదాలు చాలాకాలం రేగి, చాలా దూరం సాగినవి. “కళాప్రపూర్ణ” త్రిపురాన సూర్యప్రసాదరాయ కవి, తమ మాతృ భాషా సందేశంలో, శ్రీపాద వారిని వారిస్తూ, తమ బృహలద్గంథ నిర్మాణానికి యీ అవరోధాల్ని కల్పించుకోవద్దు అంటూ.
“గ్రామ్య పిచ్చుక గొంతుగోయ
వజ్రాలయుధమేల యెత్తితివయా”
అని సర్దుబాటు చేశారు.
కందుకూరి వారి వుద్యమం తరువాత తెలుగు భాషా లోకంలో హెచ్చు సంచలనాన్ని కలిగించింది. గ్రామ్య గ్రాంథిక వాదోపవాదాలు. గిడుగు రామమూర్తి, జయంతి రామయ్య గారలు వుద్యమ నాయకులు. వేదము, శ్రీపాద, పానుగంటి మొదలైనవారు రచయితలుగా విమర్శలో పాల్గొన్నవారు. దానికొరకై ఒక పత్రికను గూడా పెట్టి ప్రచార దుమారంలో దూకినవారు శ్రీపాదవారు.
శాస్త్రిగారు నిష్టాగరిష్ఠాత్ములు. చిన్నతనము నుండియు నియమబద్ధంగా చదువు సాములు నేర్చినవారు. సంస్కృతమున తెలుగున వుద్దండులైన పండితులు. తెలుగులో 250 గ్రంథాలు వ్రాశారు. సంస్కృతంలో గూడా రమారమి ఏబది గ్రంథములు వ్రాశారు. వీరి సంస్కృత శైలి అత్యంత సరళంగా, హృద్యంగా వుంటుంది. తెలుగునాట, కోనసీమ వాస్తవ్యుడైన, సంస్కృత సాహిత్యఖని జగన్నాథ పండితరాయని గురించి వ్రాస్తూ, శాస్త్రిగారు, .
...కావ్యాలంకరణజ్ఞ మజ్ఞ జనతాహం కారనిర్వాపణే
దక్షం రక్షిత సర్వశాస్త్ర విషయజ్ఞానైక దీక్షా గురుమ్
మత్యానేమి మహేశ్వరాంశ కలితం మంత్రాది దేవప్రభా
భాస్వద్థీజిత భాస్కరం వర జగన్నాథం మహా పండితమ్...
అన్నారు.
వారు ప్రభుత్వాస్థాన పండితులుగా నుండి మరణించారు. వారొక వీలునామా గూడా వ్రాశారు. ప్రభుత్వం, యితర పనులేమి చేసినను చేయకున్నను, వారి సంస్కృతాంధ్ర గ్రంథముల సమగ్ర పట్టీన తయారు చేయించి, ప్రచురించి, ఆయా గ్రంథాల్ని తాము ఆంధ్ర సాహిత్య అకాడమీలో వుంచి, శ్రీపాద సాహిత్య భాగంగా దాన్ని పరిగణించి, తమకు, తమ ఆస్థాన కవి స్థానానికి గౌరవం చేసుకోవలసి వున్నది.
శ్రీపాదవారు రమారమి డెబ్బదియైదు వత్సరాల కాలం రచనలు చేశారు. అంటే మూడు తరాలపాటు వీరి కాలంలో సాహిత్యంలో కందుకూరి వుద్యమం గిడుగువారి లేవ్య సాహిత్య (లేక, భావకవిత్వ) వుద్యమం, అభ్యుదయ ప్రజాహితోద్యమం, అతివాస్తవిక కవిత్యోద్యమం వచ్చినవి. త్రిపురనేని వారి విప్లవ కవితోత్సవం వచ్చింది. ఇవెన్ని వచ్చినా, శ్రీపాదవారు శ్రీపాదవారుగానే వున్నారు. మారలేదు, కదలలేదు, కదిలించలేదు.
శ్రీపాదవారి కాలంలో సాహితీ ప్రభంజనం జరిగింది. అది తిరుపతి వేంకటేశ్వర, కొప్పరపు సోదర కవుల అవధాన పోరాటంవల్ల కలిగింది. ఎందరెందరో అందులో పాల్గొన్నారు. కవితా సాహితీ జనంలోకి, జనం కవితా సాహితిలోకి మరలింపులు జరిగినై. గురుపరంపరలు, శిష్యపరంపరలు బయలుదేరినై కాని, శ్రీపాదవారు శ్రీపాదవారుగానే వుండిపోయారు. వారి రచనలు వారివేగాని, వారికొక వుద్యమం, పరంపరలు లేవు. కావలనన్న బాదర బందీలేదు. వారు పండితులు, ఏకైకులైన పండితులు. అటులనే నిలచిరి, నిలచిపోయిరి.
కృష్ణమూర్తి శాస్త్రిగారి రచనలు బహుళములు. వచనములు, నాటకములు, ప్రబంధములు, పురాణములు, జీవిత చరిత్రలు ప్రాయికములు. మరెన్నో రీతులు కలవు.
శాస్త్రిగారు సంస్కృత కవుల జీవితములను వ్రాసిరి. కాళిదాస విలాసము, తెనాలి రామకృష్ణ చరిత్రముల వ్రాసిరి. చారిత్రక దృక్పథంవున్నా, లేకున్నా వారి కవుల చరిత్రలు విషయ గర్భితములు, హృదయం గల వ్యక్తి గతాన్ని చూచిన సందర్భేచితి కనబడుతుంది.
బొబ్బిలి యుద్ధము, వేణీ సంహారము, కలభాషిణి, రాజభక్తి, భోజరాజ విజయము, శ్రీనాథ కవిరాజీవము అను నాటకములు ప్రశస్తములు. అందు ...బొబ్బిలి... ఆంధ్రుల మన్నన పొందిన నాటక రాజము.
గౌతమీ మహత్మ్యము, సత్యనారాయణోపాఖ్యానము, గజానన విజయము, శ్రీకృష్ణ కవిరాజీయము, సావిత్రీ చరిత్రము, అమృతానందము, మధుకర విజయము, అచ్చ తెనుగున ”బ్రహ్మానందము” అను ప్రధాన ప్రబంధములు రచించిరి. ఇందు “అమృతానందము”, “శంకర విజయము” మాదిరిగానూ, “మధుర విజయము”, “కళా పూర్ణోదయము” మాదిరిగానూ వుండును. “మధుకర విజయము” ప్రశస్త ప్రబంధం.
శ్రీకృష్ణమూర్తి శాస్త్రిగారి పెద్దకృతులు, వారి “శ్రీకృష్ణ భారతము”, “శ్రీకృష్ణ రామాయణము”, “శ్రీకృష్ణ మహాభారతము”, “శ్రీకృష్ణ భగవద్గీత”, “గణేశ పురాణము” మొదలైనవి. ఈ పెద్దకృతులే రమారమి 1,50,000 పద్యాల దాకా వుంటవి.
యీ పై రచనలు ముఖ్య రచనలు. ఇవిగాక శతాధికాలుగా, మరెన్నో గ్రంథాలున్నవి. అచ్చు పడని భాగాలుగా వున్న గ్రంథాలు  చాలా కలవని ప్రతీతి. కాని వివరాలు తెలియవు. ఒక్క గ్రంథమందైనను వారి రచనలు సమగ్రమైన పట్టీయైనను లేదు. ప్రచారము తెలియని పెద్దమనిషి, కేవల పండితులు!
శాస్త్రిగారు సమకాలిక, వర్తమానాంధ్రావనిని గూర్చి “ఆంధ్రాభ్యుదయం” అన్న పరిచయ, వ్యాఖ్యాన సంపుటీక కావ్యాన్నొకదాన్ని వ్రాశారు. సమకాలిక పండితుల, కవుల, సాంఘిక వేత్తల, పట్లనూ పూర్వాంధ్ర కవుల పట్లనూ వారి అభిప్రాయ వేదికగా దీనిని సంతరించిరి.
బహుళ గ్రంథ నిర్మాత, జనమంచి శేషాద్రి శర్మగారిని గురించి.
“బ్రహ్మాండ పురాణంబున్
బ్రహ్మ పురాణంబు లలిత భాగవతాదుల్
బ్రహ్మయయి సృష్టిచేసిన
బ్రహ్మణ్యుడు శేషశర్మ ప్రస్తుతికెక్కెన్
మూలానుసారముగా లలివ్రాసె
చాలిరామాయణ సాధుకావ్యంబు”
అని వ్రాశారు. ఆంధ్ర వాల్మీకి, వాసుదాసుడు వావికొలను సుబ్బారావుగారిని గురించి.
“ఉపాధ్యాయుడై చేసి ఘనతరంబు
లైన రామాయణాది కావ్యములు పెక్కు” అన్నారు.
తిరుపతి వేంకటేశ్వరులను గురించి
    తిరుపతి వేంకటేశ్వరులు తియ్యని
    కైతర చింపనేర్చి వా
    రిరువురుకూడి కొన్ని యగు
    నెన్నగ వచ్చిన నాటకాదులన్
    బరువడి వ్రాసి దేశమున బ్రస్తుతి
    కెక్కు శతావధానముల్
    పరంగనొనర్చి పేరుగలవారయి
    రంచువచింపనయ్యెడిన్
    భువిలో దంట కవీంద్రులన్నానుడి
    మై బొంగారి రంగారగా
    దివిషల్లోకము మర్త్యలోకమును
    గీర్తిన్ ముంచి రంచద్గతిన్
అంటూ వ్రాశారు.
శ్రీపాద సర్వేశ్వర దీక్షితుల వారిని ప్రస్తుతిస్తూ
      సర్వోక్తిజ్ఞనుత శ్రుతి ప్రచయ
             శాస్త్రశ్రౌత సంగీత సా
      హిత్య జ్యోతిష వైద్య దర్శన
             కలాహృద్యుల్ల సత్పర్వభా
      షాత్యర్థార చతుర్విధాధిక కవి
             త్వాంచ త్పంధేఘని
      ర్మిత్యత్యంత విశారదుల్వోలుతురా
             శ్రీపాద వారున్నతిన్
      సకల ప్రస్తుత నిస్తులోన్నత
             తపోంచత్తేజుడై వేదమా
      తృక కూర్మిన్ ఋషియయ్యె సృష్టికి
             బునసృష్టిన్వి నిర్మించె
      గౌశికుడమ్మౌని వరేణ్య గోత్రభ
             వులా శ్రీపాద వారుర్వి నెం
      తకు నుంజాలి ధీరులంచు మఱి
             యున్వర్ణింపగతానేటికిన్.
అని వ్రాశారు. అందు ఆత్మ వంశీయుల పరామర్శయు కలదు. కట్టుదిట్ట వచస్సుల పొదవినారు.
కందుకూరిని గురించి శ్రీపాద వారన్న మాటలు
పూర్వాచార పరాయణుల్ తనన్
      సంపూర్ణారి భావంబునకు
సర్వా రంభములందు నడ్డుపడు
      చున్ శత్రుత్వముం బూనినన్
సర్వసంబు హరింపబూనిననుగా
      సంతైన సంకోచమున్
నిర్వీర్యంబును బొందకొతడున
      డున్ ధీరత్వముం జూపుచున్
కవితా కన్యక పుట్టినిల్లగుచు లోక
      ఖ్యాతి కిందానకం
బవు నీ రాజమహేంద్ర పత్తన మునం
      దానైషధ గ్రంథక
ర్త విరాజిల్లిన వెన్కనాదికవియై
      ప్రఖ్యాతినింగాంచె సూ
రి వరేణ్యుండల కందుకూరి
      కులవర్ధిష్ణు డురోచిష్ణుడై.
ఈ విధంగా మరెందరినో వరించి, వారి మనోగతి భావాల్ని సువ్యక్తం చేశారు. అంతేకాదు. పూర్వ కవీంద్ర సంస్కరణ చేస్తూ నన్నయ, తిక్కన, శ్రీనాథాది కవుల ప్రశస్తి వారి భావ గతాభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తూ చేశారు.
నన్నయను కీర్తిస్తూ
      సంహితాభ్యాసుడై సంతత జపహోమ
      తత్పరుండయ్యెనే ధర్మమూర్తి
      బ్రహ్మాండ ముఖ్య పురాణముల్ దెలిసిలో
      కజ్ఞుడైతనరె నే ఘన చరితుండు
      సకలార్థ శబ్దాను శాసనుండై జగ
      న్నుత మూర్తియెయ్యెనే వితతి కీర్తి
      యుభయ భాషాకావ్య విభవ నిర్మాతయై
      ప్రతిభకు నెక్కెనే పండుతుండు
      జగతి మత్యమరాధిపాచార్యుడ నగ
      బొగడితకు నెక్కెనే మహా పురుషుండు
      నన్నపార్యుడు లోకైక సన్నుతుండు
      ధనుడాంధ్ర కవిత్వ విద్యాగురుండు.
తిక్కన స్తవము చూడుడు
      ఏ మనీషి వదాన్యతా మహత్వముదెల్పు
      విప్రార్చితాగ్రహార ప్రసక్తి
      యేసూరి వేదమార్గాసక్తింబ్రకటించు
      సప్తతంతు క్రియాచరణ రక్తి
      యే ప్రాజ్ఞును భయభాషా షక్తిణతజాటు
      జార్వంధ్ర భారత శబ్దశ
      మే ధీరువదైత బోధ దెలముసేయు
      హరి హరార్పిత కృతి కరణభక్తి
      ఆ సుకృతి యాదృఢ వ్రతుడా సుధీరు
      డా మహాత్ముడు తిక్కన సోమయాజి
      కవితకుం బహ్మకల్పుడు జ్ఞానమూర్తి
      సన్నుతింపగ నొప్పడే సత్కవులకు
ఇక తన శ్రీనాథుణ్ణి గురించి శ్రీపాద వారిట్లా పులకించారు.
      చదువగ సంస్కృతాంధ్రములు
      సారతంరంబగు పద్యంక్తిలో
      బోదలచు శ్రోత్ర పర్వమయి
      ముందుడు ముట్టగ నిచ్చ గొల్చున్
      గదనము చేయునట్లు సుఖ గానము
      నృత్యము సేయునట్టులా
      సవనుల సాహితీ సహితు సత్కవి
తాసవి నన్నుతుల్ గొనున్
తన పాండిత్యము కవిత్వముల్
తనదు మేధాశక్తియున్ యుక్తియున్
ఘనులెల్లన్ వినుచుండగా విమల
వాక్చాతుర్య మేపాఖినా
జననాధాగ్రణి గద్యపద్యములతో
సంస్తోత్రముం జేయుచున్
దెనుగున్ సంస్కృతమున్ సమాన
గతులన్ సంధిల్లంజేసెన్ సభన్.
సమకాలీయుల్ని గమనించి రీతి, ఆదర్శ ప్రాయుల్ని నుతించే తీరులు వేరు. కవి తన అభిమానాల్ని దాచకుండా నిగదించే నాజకలవాడు.
కవి ఒక విచిత్రమైన వ్యక్తి. వ్యక్తిగా తనకున్న విశిష్టతలను, సామాజికంగా అవసరమైన అభిరుచులకు మేళవించి, ఒక ప్రయోజనాన్ని వుద్దేశించి, శ్రేయస్సును ఆకాంక్షించి, కావ్యోన్మీలన చేస్తారు. కవిజగత్తు, వేరువేరుగానూ వుంటవి. ఒకటిగానూ వుంటవి. కవి కవిత్వమంటే మంచి శబ్దాల్ని మంచివరుసలో నుంచి, మంచి అర్థస్ఫూర్తి రసస్ఫూర్తి కలిగేటట్టు చేయటం, ఆనందాన్ని అందియ్యగలగటం ఒక రకమైన వుద్వేగాన్ని ప్రశాంతస్థాయిలో భావించి, భాసింప చేయటం కవిత్వం. వ్రాసింది ప్రతిదీ కవిత్వం కాదు. అక్షర రమ్యత ఉన్నా, ప్రత్యక్ష రమ్యత చూపనలవిగాదు. కేవలం అహంకారము తప్ప.
కవిత్వం అప్రయత్నం కాదు, కానీ ప్రయత్నాన్నే, అప్రయత్న ఫలితంగా వుండేటట్టు చెయ్యాలి. అప్పుడు సరళత యేర్పడుతుంది. కవిత్వమంటే, ప్రకృతికి ప్రతిబింబంలాగా వుంటూ, ప్రకృతికి భాష్యంగానూ, మానవునికి దేశికుడుగానూ పనిచెయ్యగలగాలి. జీవితాన్ని ప్రతిబింబిస్తూ, సత్యాన్వేషణ మార్గాన్ని సూచించటం, కవిత్వం సత్యస్వరూపాన్ని భిన్నంగా చూడటం సహజం. అందుకే కవిత్వంలో యెంతో భిన్నత్వం కనబడుతుంది. కవిత్వంలో కవుత్తాన్ని పరిశీలింపజేస్తూ, ఒక నూతనత్వాన్ని ప్రదర్శిస్తుంది. పాతవస్తు సందర్శనమే, కవితారంగంలో, కొత్తదిగా వుంటుంది. నిత్య నూతనత్వాన్ని భాసింపజేయటం కవిత్వానికి జీవనోపాధి. గొప్ప కవిత్వంలో జ్ఞానదీప్తి కలగాలి. ఆనందం తప్పనిసరిగా వుంటుంది. కవిత్వం, తన వంగడంలోని ప్రతివస్తువునకు ఒక నూతనత్వాన్నే కాక, ఒక ఉన్వేషతనే గాక, ఒక ఆనందాన్నే గాక, ఒక జ్ఞానప్రదీప్తినేగాక, ఒక ఆకలంకస్థాయిని చేకూర్చి, కొత్తదనాల ఆగారాన్ని నిర్మిస్తుంది. కవిత్వంలో కన్ను తెరిపించనూ వచ్చు, మూపించనూ వచ్చు. కవిత్వం శబ్దవేదిలాంటిది. అందుకనే షెల్లీ కవి యన్నట్లు, కవులు శాసనకర్తలు, శాసనసభల్లో లేని శాసన కర్తలు. వారి శాసనాలు, కాలదేశావృతాలు కావు.
అయితే మనుష్యుల తెలివితేటల్లో అభిరుచిలో అంతరాలు ఉన్నట్లే, కావ్యాల్లో, కవిత్వాల్లో కూడా అంతరాలు వుంటవి. కవిత్వం ఒక రూళ్ళబద్ద కాదు, అదొక జీవనవాహిని. జీవితంలో మాదిరిగానే, యీ వాహినిలో గూడా మంచి వుంటుంది, మాలిన్యం ఉంటుంది. నిర్మలత వుంటుంది. నీటుతనం వుంటుంది. అందం వుంటుంది. అన్ని హంగులూ, రంగులూ వుంటాయి. లేకపోతే భిన్నత్వం వుండదు. కాని భిన్నత్వంలోనూ కొన్ని ప్రాథమిక సూత్రాలు వుంటై. ఆ సూత్రాలే ఏకత్వాన్ని పెంపొందించేస్తవి.
అందువల్ల శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి రచనలను సమగ్ర దృష్టితో పరిశీలించినప్పుడు, ఇట్టి భావాలను మనస్సులో నుంచుకొని, సమన్వయ దృష్టితో విచారిస్తాము. శాస్త్రిగారు ప్రాయికంగా పురాణ కవి. వారిని ఆత్మాశ్రయ కవిత్వరీతుల దృష్ట్యాగానీ, అభ్యుదయ రీతుల ద్వారా గానీ పరిశీలిస్తే విమర్శకు సరసతరాదు. శాస్త్రిగారే దృష్టితో ప్రమాణాలతో రచన చేశారో ఆ దృష్టితో, ప్రమాణాలతో వారిని పరామర్శించటం వుచితం కాదా, మన దృష్టితో, ప్రమాణాలతోనూ చూడవచ్చు. లేక తదన్య దృష్టులతోనూ చూడవచ్చు, ప్రమాణ ప్రతిపాదనలు చేసి చూడటం న్యాయం. అట్టి శాస్త్రీయ దృష్టితో విమర్శలు రావలసిన అవసరం యెంతైనా వుంది.
తెలుగుదేశంలో, శాస్త్రిగారి కాలంలో, పురాణ సాహిత్యం చాలాబాగా ఉత్పన్నమైంది. శాస్త్రిగారు భారత, భాగవతం, రామాయణాల్ని వ్రాశాడు. వావిలికొలను సుబ్బారావుగారు వాల్మీకి రామాయణాన్ని అనువదించారు. జనమంచి శేషాద్రి శర్మగారు బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాదులేగాక రామాయణాన్ని సంపూర్ణంగా అనువదించాడు. ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి ఆంధ్రమహాభారత నవనీతం అన్న పేర 13 పర్వాలు వ్రాశారు. మతుకుమల్లి నృసింహ కవి, కవి పితామహుడుగా “అభినవ భారతం” ఆది పంచకం వ్రాశారు. తాడూరి లక్ష్మీనరసింహకవి విరాటోద్యోగాలు వ్రాశారు. విశ్వనాథ సత్యనారాయణగారు రామాయణ కల్పవృక్షాన్ని నిర్మించారు. మానికొండ రామాయణ మొకటి వచ్చినది. రామాచార్యుల వారి రామాయణమొకటి. పూతలపట్టు శ్రీరాములు రెడ్డిగారి “కంబ రామాయణం” వెలసినది. దేవీ భాగవతములు, త్రిపురాన సమ్మయ్య హిములగు పాపయారాధ్యులు దాసు శ్రీరాములు, తిరుపతి వేంకటేశ్వర కవులు, నోరి నరసింహ శాస్త్రిగారలు వ్రాసిరి. భాగవతము గంధం శ్రీరామమూర్తి, ఇఱ్ఱంకి నరసింహమూర్తి గారలు పూర్తిచేసిరి. అమ్మిశెట్టి లక్ష్మయ్యగారొక భాగవతాన్ని తయారు చేయుచుండిరి. ఇట్టివి యెన్నో రాగా, విప్లవ పురాణములైన “సూతపురాణము” త్రిపురనేని, “కలి పురాణము” కొత్త సత్యనారాయణగారలు రచించిరి. వాటి మార్గము, తీరుతెన్నులు వేరు.  
సామాన్య పురాణ కవులలో శాస్త్రిగారు వుద్దండులైన పండితులు. ధారాశుద్ధిగల కవులు. కవిత్వమున కన్న పాండిత్యము మిన్నగాగల కవులు. వావికొలను, జనమంచి, శ్రీపాదవారలొక కోవకు చెందిన పురాణ కవులు.
శ్రీపాదవారి కృతుల్లో భారతం బృహద్గ్రంథము. కవిత్రయం వారి కృషి వీరొక్కరే చేసిరి. కవిత్రయ భారతం కేవలం అనువాదం కాదు. “శ్రీకృష్ణ భారతం” కేవల అనువాదం. అందువల్ల మూలం స్థూలంగా వుంటుంది. శ్రీపాదవారు తప్ప పద్యంగా తిరిగి భారతామ్నాయాన్ని పూర్తి చేసినవారు కవిత్రయం తర్వాత లేరు. శ్రీపాదవారి సాహితీ రంగంలోని స్థానం ప్రాయికంగా దీని మీదనే ఆధారపడి వుంది.
అట్టి పెద్ద కావ్యములెట్టు వ్రాయబడెనో శాస్త్రిగారు చెప్పికొనిరి.
“నేనీ భారత కవిత్వమంతయుజిన్ని చిన్ని కాగితముల మీద వ్రాసితిని. అందుగొంత కొంత భాగము పెన్సిలుతో గూడజిత్తు చిత్తుగా దుడుపులతో, హంసపాదులతో గుర్తులతో మరియు ననేక సంజ్ఞలతో వ్రాసినదియుగలదు. చిరకాలము క్రిందట వ్రాసినదగుటచే అవినాకే తెలియుట దుర్లభమైనది. అది చూచి ముద్రణార్థము నా మనుమడు లోనగు కొందరు పిల్లవాండ్రు సాపు వ్రాసిరి. ఆ వ్రాతలలో ననేక దోషములు పడినవి.  కొన్ని కొన్ని స్థలములలో గణములు, యతులు, ప్రాసములు, లోనగునవి తప్పినవియంగలవు. కన్ను చక్కగా గానరాని వాడనగుటచే నేను ప్రూఫులు చూచియు సరిచేయలేక పోయితిని. పత్రము వ్రాయుటకును నాకు వ్యవకాశము దొరికినది కాదు.
ఈ బాధలు యీతి బాధలకు మించిన కృతుల బాధలు. అక్షయ సంవత్సరము (1926) నాటికే కృష్ణ భారత రచన పూర్తియైనది. వారికి యిరువది సంవత్సరములు పట్టినది. తమ నలువదవయేట మొదలిడి అరువది ఆరవయేట పూర్తి చేసిరి.
వీరి భాషాంతరీకరణ మూలానుసారి. అందుకే వీరు ఆంధ్ర వ్యాసులు. అందులకే, కవిత్రయము వారి భారతమున కన్నను చాలా పెద్దది. రెట్టింపు గ్రంథము శ్రీకృష్ణ భారతము. శాంతి పర్వాన్ని తిక్కన మూడువేల తొంబది నాలుగు పద్య గద్యలతో పూర్తి చేయగా, శ్రీపాదవారు మున్నూట యిరువది మూడధ్యాయ మూలానుసారంగా చేసి తిక్కనకు రెండు మూడింతలు చేసిరి. మూలములోని రచనా వైవిధ్యాలు చెడకుండ, సరియైన తెలుగు పదములకై యత్నించి, అనన్య సామాన్యమైన వైశద్యాన్ని ప్రదర్శించిరి.
ఒకటి రెండు వుదాహరణములు. అను శాసన పర్వంలోని వ్యాసమూలమైన,
యేన ప్రీణాతి పితరం తేన
      ప్రీతః ప్రజాపతిః
ప్రీణాతి మాతరం యేన
      పృథివీ తేన పూజితా
యేన ప్రీణాత్యు పాధాయం తేన
      స్యాద్రహ పూజితమ్
అన్న శ్లోకాన్ని శాస్త్రిగారు
తల్లిందండ్రి గురుండు వీరిముగు
దం దాత్పర్యమే పార సం
ధిల్లం బ్రీతి సమాదరంబునను
భక్తింజేసి భావించు వా
డెల్ల పుం బృధివిం బ్రజాపతిని
నేకేశునం సమర్పించువా
డెల్లన్ ధర్మము లాచిరించునత
డైహ్రీమించు నిందందొగిన్.
అంటూ అనువదించారు.
మరొకచో శాంతి పర్వంలో
      సంతి పుత్రాస్సుబహవో దరిద్రాణా మనిచ్ఛతామ్
      నాస్తిపుత్ర సమృద్ధానాం విచిత్రం విధిచేష్టితమ్
అను దీనికి శాస్త్రిగారిట్లాంధ్రీకరించిరి
      బలవంతులు బలహీనులు
గలవారును లేనివారు ఘనవైద్యులు రో
గుల లంతులు ఘనులును విల
సితగనుచుండుదుముగాల చిత్రముగాదే....
శ్రీపాదవారికి కవిత్రయమునందు, అందును తిక్కనయెడ, మిగుల గౌరవము కలదని వారి పోకడలవల్ల అనుకరణలవల్ల, అక్షర సామ్యమువల్ల తెలియగలదు. ఉదాహరణ జోలికి పోయిన మరొక గ్రంథమగును. కాని ఒకటి రెండు మాత్రముటంకింతును.  ఆశ్రమవాస పర్వంలో శాస్త్రిగారు
కొండికవాడు నాకు గడు గూర్చె
డు వాడు మృదు స్వభావుడు
గొండొక నేర్వడొక్కడు కు
గుఱ్ఱడు నీకనురక్తుడెప్పుడే
నొండన బోడువాని పయినుగ్రత
సూపక కోపదృష్టి మై
నుండక ప్రేముడిం గనుచు
నుండును నానుడికార మొప్పగన్
ఇది తిక్కన రచనలకు ప్రతిబింబము. అటులనే నన్నయను, ఎఱ్ఱయ్యను విశేషము బింబించిరి. శ్రీనాథుడు శాస్త్రిగారి అభిమాన ధనము. వీరభినవి శ్రీనాథులు. శ్రీనాథుని శయ్యా పాటవాదులకైనకృషి శ్రీపాదవారిలో నెన్నిచోట్లనో కలదు. రామాయణము, భారతముకన్న హెచ్చుకలదు. పోతనానుకరణ భాగవతమున కలదు.
శాస్త్రిగారు శ్రీకృష్ణ రామాయణమును 4000 పద్యగద్యాలను రెండున్నర మాసములలో వ్రాసిరి. కొన్ని మార్పులు చేసిరి. లోకము మంధరా కైకేయులను పరమ ద్రోహులనుగా భావింప, ఆయపప్రధ తొలగించి, వారిపట్ల దోషమిసుమంతయు లేదని, నిరూపించిరి. అంతేకాదు. శంబూక వధను పరస్పర విద్వేషకరముగా నెంచీ వాల్మీకినేగాక వశిష్ఠాదులను శ్రీరామచంద్రునింగూడ దిట్టింప జేయునట్టిదని, అయినను జగద్విశ్రుతంబగుటచే విడువక, యీ కథను శంబూకుడొనర్చు తపస్సు ఘోరమైనదని, నది నెట్టివారును వచరింప రాదనియు నెంచి వానిచేయు తపస్సును వారించుటయే శిక్షించుటయని తపోవిఘ్నము మాత్రము చేసినట్లు వ్రాసిరి. యిది ఫలములేని భేదము. యీ కృతికేవల అనువాదం కాదు. భాస్కర రామాయణపు రీతిగానున్న స్వేచ్ఛానువాదం. కాని భాస్కర రామాయణ స్థాయిలేనిది.
రామాయణంలో శ్రీపాద శ్రీనాథానుకరణం చేశారు. అయోధ్యాపుర వర్ణనలో-
సరయూతుంగ తరంగిణీతటల సత్సౌధోపరి సాపితో
త్తర పజ్రోపల ఘర్షణచ్ఛీత మహోదగ్ర ప్రభాతి దిత్యమై
వరణాభా విశదీకృత క్షణదమై భాసిల్లు సాకేతమన్
పురమొక్కండల కోసలక్షితిగళ స్పూర్జతు రత్నంబునాన్
అన్నారు.
మరొక చోట, మునిపాలుండు దశరథు శబ్దవేదికిలోగిన ఘట్టంలో దశరథు విలాపాన్ని వర్ణిస్తూ...
వనముల కేలవచ్చితిని వచ్చితి వెంటన పోక వేటన
ల్పను మనసేలపట్టితి బట్టితి నంత సపోక యేన్గులన్
కనుగొననేలకాచితిని, గాచితినేనిక యంచు నమ్మహోత్ముని
                                        మునినేల త్రుంచితిని
ద్రుంచితిని కేయలేదు దైవమా..
అని హృదయ విదారకంగా వివరించారు. ప్రత్యర్థి రావణుని సామర్థ్య పాండిత్యాల్ని వివరిస్తూ...
ఆచార్యునొద్ద విద్యాభ్యాస మొనరింప
సమరుచు నాల్గు వేదములు మరియు
నాఱు శాస్త్రంబులు నఱువది నాలుగు
కళలు ప్రకృతి శాస్త్ర గతులు విలు
విద్య శాస్త్రాస్త్రముల్ వివిధ పురాణముల్
ధర్మశాస్త్రంబులు తవిలి చదివి
సంగీత సాహిత్య చతురుడై కవితలో
గ్రంథ రచన యండు గుండు మిగిలి
రాజకీయ ప్రసంగ విరాజమాన్
నయవిదుండయ విద్వజ్ఞన ప్రశస్త
దండనీతి కోవిదుడయి దశ ముఖుండు
బుద్ధి మత్ప్రవరుండయ్యె భూతలమున్
న్యాయాన్ని పాలించి, రాక్షస్సుడైన రావణున్ని గుణ గణాల్ని పొగడినారు. ఒకచో క్షీర సముద్ర వర్ణము చేయుచూ కవిత్వ విజృంభణం చేసి పురాణాల్లో ఆత్మాశ్రయ కవితా రీతుల్ని వెలువరించారు చూడండి.
అల్లన సిరులల్ల తల్లి తల్లికినెద్ది
మురువల్ల వెదజల్లు పుట్టినిల్లు
ఎల్లలోకములేలు నల్లజేజేకెద్ది
కడునుల్లసిల్లెడు పడకయిల్లు
అల్లిబిల్లిగజెల్లునెల్ల లేల్పులకెద్ది
వడలనిబ్రదుకల్లు వంటయిల్లు
యిల్లటమై వెళ్ళునల్లగట్టునకెద్ది
హల్లకల్లోల మౌనాట యిల్లు
గర్భజామృతో చ్సైశృవః కల్పవల్లి
సిరులనీనెడు దివ్యవీచీమతల్లి
లీలసురలెల్ల మెచ్చిరప్ఫాల వెల్లి
అనుకరణా ప్రత్యక్షంగా వున్న, రచన తీరుకలదు.  విధంగా యెన్నో చూపవచ్చు, యితర కృతులెన్నో కలవు.
ఇన్ని గ్రంథములు, అందునూ యిన్ని బృహద్గ్రంథములు వ్రాసిన శ్రీపాద కవిసార్వభౌముని రచనల దృష్ట్యా వర్తమానాంధ్రమున వారి సేవస్థానము ఎట్టిదన  పరిశీలింప, వివిధముల, విభిన్నములగు నిర్ణయములకు రావచ్చును.
హెచ్చు కావ్య నిర్మాతగా వారిది అగ్రస్థానము. మూడు తరములపాటు రచనా వ్యాసంగంలో నిమగ్నులైయుంట వారి సాహితీ తపస్సుకు నిదర్శనం. వారిది గుణములేని రచన కాదు. అంతయూ గుణమున్న రచనమూ కాదు. కాజాలదు. పురాణ రచనలో నున్న చిత్రమది. శాస్త్రిగారి అభిరుచులు అంతగా బహుళములు కావు. మత దృష్టి, వైదిక తత్పరత పౌరాణిక సంప్రదాయజ్ఞత, ప్రధానములు. పండితులగుట, అందునూ భాషా పండితులౌట, చారిత్రక దృష్టి కవుల జీవిత విషయకంగా కానబడును. ఉన్న భారతమునే వ్రాసి, వున్న రామాయణమునే రచించి, వున్న భాగవతమునే చెప్పి, వున్న భగవద్గీతనే వువాచించుటలో విశిష్టత యేమిటి? సంస్కృతమురాని వారికి వీరి భారతము గురుతు మీరగా నుపకరించును. అన్ని కృతులలో, యెటు జూచిన అటు కవిత్వము లేదుగాని అందందు మంచి ఘట్టములు కలవు. మొత్తము మీద కవిత్వం పలచని పురాణా పాకములో నుండును. ప్రబంధముల యందునూ, పురాణాశైలియే కన్పడును.
శ్రీపాదవారికి వర్ధమానాంధ్ర సాహిత్యంలో సుస్థిర స్థానం వుంది. భవిష్యత్తులో శ్రీకృష్ణ భారతం మీద ఆధారపడి ఉంటుంది. వారి కృతులుగాని, మనిషిగాని అంతగా ప్రచారంలో లేవు. పద్యంగా సాహిత్యాన్ని చదివేవారే తక్కువ, అందులో పెద్ద కృతులు చదువువారు మరీ తక్కువ. అసలు లేరేమో! అదీగాక, సాహిత్యాన్ని యింటికి తీసుకొని వస్తే స్థాలీపులాక న్యాయంగా చూస్తారేగాని మరింత కాదు. పైగా వాడవాడా ఆ కవి గ్రంథాన్ని చూప జాలినవారి మీద వుంటుంది.
తెలుగు దేశంలో సాహిత్యాభిరుచి సరిగా లేదు, కలిగే సూచనలు లేవు. ఏదో ఒక సాహిత్య వివాదురావాలి, వస్తే ఆ అభిరుచి కలుగవచ్చు.
రచయితలు, క్రొత్త పుంతలలో యానంచేసి, నూతన భావుకతకు వుద్దీపకులు కాకపోతే సాహిత్యాసంగం కుంటి గుర్రాల బండి మాదిరే అవుతుంది.
పాత వల్లింపు పద్ధతి మారాలి. అందువల్ల గాని కొత్త శోభలు రావు. టి.యస్.యిలియట్టు అన్నట్లు కొత్త మార్గాన్వేషణ లేనిది భావంలో గాని, భాషా రీతులలో గాని కొత్త లోకం సృష్టి కాదు. శ్రీపాద వారు భావుకులు. పాత రచయితలు. కాని, భాషా సామ్రాజ్యం వున్నవారు.
తెలుగునాట, యిట్టివారి యితర పెద్ద రచయితల కవిత్వతత్త్వ విచారణలు చేసి, తెలుగు డాక్టరు డిగ్రీలు వ్యాసరచనలు జరగాలి. తిరుపతి వేంకటేశ్వరుల మీదను అంతే. అప్పుడు కూలంకషంగా విమర్శ చేయవచ్చు. శ్రీపాదవారి సంస్కృత భాషా పాండిత్యాన్ని వారి అనువాదనలో పరిశీలించాలి. వారి కావ్యత్వాన్ని తిక్కనతో, నన్నయ్యతో, ఎఱ్ఱన్నతో, పోతన్నతో, భాస్కరునితో పోల్చి, సమకాలికుల్ని పరికించి నిర్ణయించుకోవాలి. అప్పుడు వారి విలువకట్టినట్లు.
నా యీ చిన్న పరిశీలనలో – కాదు – సమీక్షలో ఆస్థాన కవిగా అంతరించిన ఒకానొక సాహితీ వ్రతుని గూర్చిన చిన్న అభిప్రాయ వేదికను నిర్మించటమే కర్తవ్యంగా యెంచుకొన్నాను. విలువలు కట్టుటకు విపుల పరిశీలన కావలెను. దానికై ప్రకోపించుటే నా అభిమతము.
By Avula Gopalakrishna Murty
AGK always commented that Sripada`s telugu translations of Bharatam, Ramayana, Bhagavata are true to original without distortions.-----