29, ఏప్రిల్ 2011, శుక్రవారం

అచరణకో ఆణిముత్యం- AGK


    తీర్మానాలు  - సిద్ధాంతాలు

AGK playing games
AGK enjoying while playing games with villagers
    నా  తీర్మానాలకు, సిద్ధాంత నమ్మకాలు ప్రధానాలు. నా సిద్ధాంతం నాకు నచ్చినట్లు యితరులకు నచ్చకపోవచ్చు. కొందరకు నచ్చినా అది శ్రేయస్కరమైన సిద్ధాంతం కాక పోవచ్చు. అందువల్ల నా తీర్మానాలను యింకొకరి మీద రుద్దటం అంటే నా సిద్ధాంతాలను పరాయివారి మీద రుద్దటమే అవుతుంది. అందువల్లనే జాగ్రత్త అవసరం. అంతే కాదు సిద్ధాంత విశిష్టతలకు విప్పారిన హృదయాలతో వ్యక్తం చేసుకోవాలి. అన్వయం చేసుకోవాలి. అన్వర్థం చెయ్యాలి.
*             *           *
    స్వేచ్ఛా  వాతావరణం
    మనిషిని మనిషిగా మననివ్వగల స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించాలి. మనిషిని కొరముట్టుగా కాక ఒక ధ్యేయంగా యెంచి ప్రచారం సాగించి, నా చుట్టూ వాతావరణాన్ని బూజులు దులిపి స్వేచ్ఛకు పునాదులు త్రవ్వాలి.
*             *           *
    హేతువాదం  - నీతి
    మతపిచ్చి  రెచ్చి మానవుణ్ణి మరగా చేసి ఆసేతురూ వినాయకుణ్ణిగా  చేస్తుంది. అడ్డం తిరగాలి. అడ్డీలు వేయాలి. యీ మత ప్రచార వాహినులకు బ్యారేజిలు కట్టించాలి.
    దేశమంటే కేవలం మట్టిగాదు. దేశమంటే  కేవలం మనుజులు కాదు. కండగలిగి వుండటమే, మానవతకు కారణం  కాదు. చైతన్యం కావాలి. నీతికావాలి. నీతి హేతువుచే ఉత్పన్నమయ్యేది, హేతువాదమే నీతి అంటే, హేతువాది కానిది చైతన్యం కాదు. వ్యక్తిత్వంలేనిది హేతువాది కాజాలడు. మానవత్వం ఆసరాగా వుంటే తప్ప వ్యక్తిత్వం నిలవదు.
*             *           *
    జాతితో, మతంతో, మౌఢ్యంతో, ఆచారంతో  నీతిని నేర్పలేం.
*             *           *
ప్రజాస్వామ్యం
    ప్రజాస్వామ్యాన్ని పార్టీ స్వామ్యం ద్వారా నిలుపలేము. ఎన్నికల్లో జరిగే ఓట్ల కొనుగోలుతో ప్రజాస్వామ్యం ధన స్వామ్యంగా మారిపోతుంది.
*             *           *
ద్విజిహ్వత్వం
    పాములకు రెండు నాలుకలు వుంటై, ద్విజిహ్వలని సంస్కృతీకరించాము. మనిషికి  ఒకే నాలుక ఉన్నా ద్విజిహ్వత్వాన్ని  – కాదు – బహుజిహ్వత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. పాముకన్నా యిట్టి నాలుకలవాళ్ళు అత్యంత ప్రమాదమౌతున్నారు. మనిషేకాదు పార్టీలకు కూడా ద్విజిహ్వలు ఏర్పడుతున్నవి. దాంతో నా చుట్టూ ప్రపంచం కల్లోలాన్ని పొందుతున్నది. అట్టి కల్లోలాన్ని నివారించటం  మన కర్తవ్యం.
*             *           * 
పార్టీలు  లేని వికేంద్రీకృత పాలన
    హేతుగుణం  వ్యక్తిత్వం, సామాజికం కాదు. ఆలోచనాశక్తి హేతువుకు పునాది. అందువల్ల జాతీయత, కమ్యూనిజం, ఫాసిజం, సోషలిజం వగైరా సిద్ధాంతాలన్నీ సమిష్టి భజనలు. అవి వ్యక్తి వికాస ప్రాదుర్భావానికి వ్యతిరేకాలు. పార్టీలు సమిష్టి కృతులుగా హేతువాదానికి భిన్నాలు, వ్యతిరేకాలు, అందువల్ల పార్టీలు రద్దు చేయాలంటాము. పార్టీలు లేని వికేంద్రీకృత పాలన కావాలంటాము.
*             *           *
    మనవారసత్వం
    మనకు  పూర్వులు నేర్పిన కొన్ని దుర్గుణాలు వున్నై. మనకూ, మరొకనికి విరోధంగా వుంటే వుభయులకూ సమానంగా యెవ్వరం స్నేహితులుగా వుండ వీలులేదు.  నాకే స్నేహంగా వుండాలంటాము. నాకు స్నేహంగా, నా విరోధికి విరోధిగా వుండకపోతే, నాకే విరోధిగా వారిని నిర్ణయిస్తాము. యీ రోగం మనవారసత్వం.
*             *           * 
    స్వాతంత్ర్యేచ్ఛ
    దేశభక్తి  గీతాలకన్నా, స్వాతంత్ర్యేచ్ఛమీద జాగృతిక దృక్పథం అవసరం. దేశభక్తి పేరుతో మతోన్మాదులు కీడు తేవచ్చు. పరదేశభక్తి పేరుతో సిద్ధాంతోన్మాదులు కీడు తేవచ్చు. స్వాతంత్ర్యేచ్ఛ, స్వేచ్ఛా పిపాసలు పునాదులుగా  వుద్యమం నడిపించాలి.
*             *           *
    అవినీతిని మరో అవినీతితో ఎదుర్కోరాదు. అవినీతిని అవినీతితోనే  కొట్టగలం.
*             *           *
యుద్ధం
    యుద్ధం  కావాలని నేను కోరను. యుద్ధం వస్తే నాకు యిష్టం లేకపోయినా, నాకంత భయమూ లేదు. యుద్ధం కావాలని  నేనంటే నేను యుద్ధోన్మాదిని. యుద్ధం యెవరో తెచ్చి నా నెత్తిన పెడితే, దాన్ని చూచి నేను కంగారుపడితే నేను పిరికివాడిని. నాకండ్లలో పిరికితనం లేదు. నా రక్తంలో వుడుకుతనం లేదు.
*             *           *
    మతాలు
    మతాలు మానవ వికాసానికి ఆరంభంలో  కొంత వుపకరించినా, రోజులు గడవగా, ప్రతిబంధకాలుగా తయారైనై. దానివల్ల మానవుని వ్యక్తిత్వం శూన్యత్వంలో కలసిపోయింది. బుద్ధుడు ఆ మానవుని వ్యక్తిత్వాన్ని పునరుద్ధరించాడు. మానవుడు చేయవలసింది దేవునికి వూడిగం కాదు. మంచి ప్రవర్తనతో నాన్యతో దర్శనీయ వికాసాన్ని పొందవచ్చునన్నాడు. మనమే మన పనులకు ఉత్తర వాదులమన్నాడు. కర్మను, వేదాలను, పారలౌకిక పాపపుణ్యాలను, కులాలను, మతాలను ఒక్కసారిగా డుల్లిపుచ్చాడు. లోకం విహ్వలించి, గౌతముణ్ణి బుద్ధుడన్నది. ఆ బుద్ధుడు అహింసావాదానికి కాణాచి.
*             *           *
    మనకు  మంచి ఆదర్శం వుండాలి. మనకున్న  మంచి ఆదర్శం ఆచరించడానికి మంచి వ్యక్తులు వుండాలి. ఆదర్శాన్ని త్వరలో అందుకోడానికి మంచి సంస్థ వుండాలి.
*             *           * 
    చట్టాలు కావాలి. చట్టాల్ని అనుసరింపజేయగల  సహృదయతగల జనాంగాలు కావాలి.
*             *           * 
    అస్పృశ్యత
    పూర్వం  ఉన్న సాంఘిక అస్పృశ్యతస్థానే  యిప్పుడు వచ్చే రాజకీయ అస్పృశ్యతను  మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు. సాంఘిక అస్పృశ్యత నశించాలని మనం నిర్భయంగా అంటాము. అట్లాగే రాజకీయ అస్పృశ్యత నశించాలి అని మనం నిర్భయంగా అనాలి.
*             *           *
    మనిషి మారుతున్నాడు. మనుగడ మారుతోంది. వ్యవహార వ్యాసంగాలు తాత్విక  వైజ్ఞానిక దృక్పథంవైపు  మలుపు తిరుగుతున్నవి. కాని సాంఘిక జీవనంలోని నిమ్నోన్నతాల దూరం లేకుండా పోవటానికి  ఆశించినమార్పు జరగకపోవటం  శోచనీయం. ఆలోచింపతగ్గ విషయం.
*             *           *
    మానవుని స్వేచ్ఛను హరించే చట్టం, అదెంత ఉత్తమ లక్ష్యంతో  కూడుకున్నదైనా మూర్ఖులు సమర్థించవలసిందే గాని హేతువాదులు అంగీకరింపజాలరు.
*             *           *
    మానవునిలో మానవుని, సమాజంలో మానవుని, ప్రకృతిలో మానవుని ఆవిర్భావానికి  మన ఉద్యమం సాగాలి. అందుకుగాను మనం విజ్ఞాన చంద్రికలను వెదజల్లాలి.
*             *           *
    వికేంద్రీకరణ
    రాజకీయ  రంగములో కేంద్రీకృత విధానములపై పెత్తనము పోయి, ఆర్ధిక విషయాలలో కేంద్రీకృత విధానాలు ఉంచేటట్టు  చెయ్యటం విడ్డూరంగా వుంది. అన్ని రంగాలలోనూ వికేంద్రీకరణ జరిగి సామాన్య మానవుని శ్రేయస్సే కొలబద్దగా కృషి జరగాలి.
*             *           *
    వర్ణం, వర్గం, కులం, మతం, జాతి, వర్గం  ఇవన్నీ సమిష్టి భావనలు – సంకుచిత భావనలు – వ్యక్తి అయిన మానవుని కుంచింప చేసేందుకు ఏర్పడ్డ కృతక వలయాలు. వీటిని అధిగమించాలి.
*             *           *
    మన  రాజ్యాంగం షెడ్యూలులో వున్న  అన్ని భాషలనూ ఆంగ్లంతో సహా  జాతీయ భాషలుగా పరిగణించటమే  మన భాషా సమస్య పరిష్కారానికి  హేతుబద్ధమైన మార్గం.
*             *           *
    రాజకీయ, ఆర్థిక, సాంఘిక విప్లవాలకు, హేతుబద్ధ సంస్కరణలకు మూలకందం  తాత్విక విప్లవం. తాత్విక  విప్లవం వెనక – మిగిలినవి ముందు అనటం హేతుబద్ధం కాదు.
*             *           *
    మతం నల్లమందు వంటిదని కారల్  మార్క్సు అన్నాడు. మతంతోబాటు  రాజకీయపార్టీ కూడా నల్లమందువంటిదేనని హ్యూమనిస్టులము అంటాము.