13, ఏప్రిల్ 2011, బుధవారం

AGK humanist aphorisms


ఎ.జి.కె. సూక్తులు






ప్రచురణ
కవిరాజు ఎ.జి.కె. భావవికాస కేంద్రం
తెనాలి





అంకితం
మానవతా మార్గగాములకు




ప్రస్తావన
ముద్రితాలు, అముద్రితాలు అయిన ఎ.జి.కె. రచనల నుండి ఆణిముత్యాల సరాలను కొన్నిటిని ఏర్చి, సూక్తులుగా కూర్చి ప్రచురించాలనే మా సంకల్పానికి యీ నాడు రూపకల్పన జరిగింది. వివిధ విషయాలను గూర్చి, వివిధ సందర్భాలలో ఎడనెడగా వున్నవి సేకరించి సంకలనం చేశాము. ఆ ఫలితమే ఈ చిన్న కావ్యదర్శనం. మానవీయుడు గోపాలకృష్ణ మూర్తి సుభాషితాలను సూత్రప్రాయంగా మాత్రప్రాయంగా కుదించి చదువరుల ఆలోచనకు ఉద్దీప్తిని కలిగించాలనే ఆకాంక్ష ఈ ప్రచురణ ప్రధాన లక్ష్యం. విజ్ఞాన లోకానికి ఉడుగరగా అందిస్తున్నాము. స్వీకరించాలి.
గోపాలకృష్ణమూర్తి వ్యక్తి. వ్యక్తిగా సమగ్ర వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్న మనోజ్ఞ వ్యక్తి. వివిధ జీవితరంగాలలో ప్రౌఢిమలు, రూఢిమలు వెలార్చిన ఉదాత్తవ్యక్తి. వ్యక్తి వ్యవస్థగా విప్పారి ఆ సౌరభాన్ని పలురీతులలో వెదజల్లిన విశేషవ్యక్తి. హేతువాద సాధనం ద్వారా విజ్ఞాన చంద్రికలను వెలార్చిన విశిష్టవ్యక్తి. మానవతాదీప్తికి నిండు జీవిత ప్రమాణాన్ని కరిగించి, అర్థ జీవితంలోనే సురిగించిన ఆదర్శవ్యక్తి. అట్టి వ్యక్తి మరణించాడు. మరణించని మరణంగా మరణించాడు. ఆయనకివే మా నమోవాకాలు.
ఎ.జి.కె. పేరు భావస్వాతంత్ర్య కృషికి ప్రతీకగా స్వేచ్ఛాస్ఫూర్తికి ప్రతిరూపంగా మానవతా దర్శనానికి దర్పణంగా సమగ్ర దృక్పథానికి సంకేతంగా నిత్యనూతన పల్లవమై నిలిచిపోగలదని మా అభిప్రాయం. అందువల్లే మా సంస్థ పేరులో అదొక అంతర్భాగం కావటానికి ముఖ్యకారణమైనది.
పదార్థగతిలో మరణించిన ఎ.జి.కె. భావజగతిలో జీవిస్తున్నాడు. జీవిస్తాడు. ఆయన నడిచిన బాటనే ముందుకు సాగటం మనకర్తవ్యం. మనం ఆ పనిని చేయగలిగిన మేరకైనా చేస్తున్నామా అని నా ప్రశ్న. ఈ ప్రశ్న నా ఆవేదనకు నివేదన మాత్రమేనని మనవి చేస్తున్నాను. శాస్త్రీయ మార్గావలంబకులు పరిశీలన చేయండి.
ఎ.జి.కె. ఏ ఉన్నత లక్ష్యాలకు మడమ త్రిప్పని మన్నీడు వలె పోరాడి అసువులర్పించాడో ఆ లక్ష్యసాధన మార్గంలో చిత్తశుద్ధితో మనం పోగలిగిన మేరకైనా పోవాలి. అట్లా జరగనినాడు కేవలం వర్థంతులు లాంఛనప్రాయంగా మారవచ్చు.
భావవికాసానికి ప్రతిబంధకాలు చాలావుంటై. ఆ బాట ఎంతో కంటకావృతం కూడా. అగడ్తలూ, అగాధాలూ మరెన్నో వుంటై. అయినా మన ఎదురీత మనం సాగించక తప్పదు.
ఈ గ్రంథం ఆకృతిలో చిన్నది. కృతిగా యెట్లుండునో గుణగ్రహణపారీణులు నిర్ణయించాలి.
ఇది మా తొలిపూవు. ఈ గ్రంథసంకలనకు ప్రోత్సహించి, సారధ్యం వహించిన మిత్రులు పి. అచ్యుతరామ్.గారికివే మా అభినందనలు. ఈ సందర్భంలో తమ సంపూర్ణ సహాయ సహకారాలందించిన ఎ.జి.కె. కుటుంబంవారికి, ప్రత్యేకంగా డాక్టర్ మేకా రాజగోపాలకృష్ణగారికి మా కృతజ్ఞతలు. గ్రంథం ముద్రణకు ప్రత్యేక శ్రద్ధ వహించిన మిత్రులు తోట కుటుంబరావుగారికి మా ఉత్తమాశంసలు.

తెనాలి                                           గురిజాల సీతారామయ్య
6-9-68                                    కవిరాజు ఎ.జి.కె. భావవికాసకేంద్రం




మానవీయుని మాటలు

ఎవరైనా నా అభిప్రాయాలతో ఏకీభవింపనివారు హేతుపూర్వకంగా, కారణాన్ని చెప్పే భిన్నాభిప్రాయాలు కావచ్చు. అట్టివారితో నాకు తగువు లేదు.
*             *           *
ధర్మం యెదుట వ్యక్తుల మధ్య తారతమ్యముండదు. పాలించేవారు, పాలింపబడేవారు అన్న భేదం లేదు.
*             *           *
న్యాయస్థానాలు లేక ధర్మస్థానాలు ప్రభుత్వచర్యల్లో ప్రజల హక్కులు నిర్లక్ష్యం చేయబడకుండా కాపాడాలి.
*             *           *
అది మావూళ్ళో వుంటేనే మంచి లేకుంటే కామంచి అనే వైఖరి లోకంలో ప్రాయికంగా వుంది. ఆవైఖరి నాకు నచ్చదు. మంచికి ప్రాంతీయతలు అడ్డుగోడలు కాజాలవు. అది ఎక్కడైనా వుండొచ్చు.                                   
*             *           *

మానవుడు వ్యక్తిగా వికాసాన్ని పొంది, భావిసమాజ నిర్మాణంలో పునాదిగా ఉండగలిగిన ఏర్పాట్లను మనం పరిశీలించి గమనించుకోవాలి.
*             *           *
పిల్లలు ఎక్కడున్నా పిల్లలే. వారికి వికారాలు లేవు. ప్రాకారాలు లేవు. అంచులు లేవు. పరిధులు లేవు. వారిహృదయాలు కోమలంగా, పేశలంగా వుంటవి.
*             *           *
లోకం, టక్కు నేర్పెడి కవుల గంటాల వ్రాతాలను తిరస్కరించి, చారిత్రక దృష్టితో, సత్య దృష్టితో చూడటం నేర్చుకోవాలి. వ్యత్యాస దృష్టిపోయి, న్యూనతా భావాలు సమసిపోయి మానవతా విలువలను నిలబెట్టుటకై కృషి ప్రారంభించవలసి ఉంది.
*             *           *
స్వాతంత్ర్యం అనేది ఆదర్శంకాదు. అనే ఒక ఆదర్శానికి మార్గం మాత్రమే... ఆదర్శనం స్వేచ్ఛ.
*             *           *
సంఘంలో జరిగే ప్రతివిషయము, ప్రతిసంఘటన మానవుని శ్రేయస్సు కోసమైనదిగా వుండి. ప్రతివిషయానికి మానవుడే కొలమానంగా వుండాలి. మానవుని భవిష్యత్తు నిర్ణయించే హక్కుదారు మానవుడే కనుక, మానవాదర్శమైన స్వేచ్ఛావ్యాప్తికై సర్వప్రణాళికలు దాసోహమనాలి.
*             *           *
నిలకడగల ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే పత్రికా లోకానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వుండాలి.
మూకుమ్మడి దృష్టితోగాక, ఏసమస్యను ఆ సమస్యగా విడమరచి చూడగలిగిన మానసిక నైపుణ్యాన్ని, క్రమశిక్షణను యువకులు నేర్చుకోవాలి.
*             *           *