quotations in Telugu from Avula Gopala Krishna Murty writings
పునాదులలో సౌరుగల పాలన ప్రజాస్వామ్యం. తల బరువు దానికి పనికిరాదు. ప్రజలు తమ తమ పనులను, విధులను బాగా చేసుకోగలరనేదే ప్రజాస్వామ్య పాలనకు మూలం.
* * *
పత్రికా రచన ఒక నైతిక విక్రియ, పత్రికాలోకం పతితమైతే జాతి జీవనాడుల్లో ఒక ప్రధాన నాడి దెబ్బతిని పోయి జీవనగమనం సురిగిపోయినట్లు భావించవలసివుంది.
* * *
అనుశ్రుతలోకం మార్చదలచిన వాణ్ణి మాటలంటుంది. ఆడిపోస్తుంది. మొరాయింపగా, మొరాయిపంగా అంగీకరింపక పోయినా, హర్షింపకున్నా, ఆడిపోయటం అని, సహింప నారంభించి, క్రమ క్రమేణా సహనాన్ని సహకారంగా, హర్షంగా అంగీకరిస్తుంది. లోకవృత్తం అది.
* * *
స్వేచ్ఛాపిపాస విద్యకు ప్రాతిపదిక, స్వేచ్ఛకు విద్య కూడా అంతే.
* * *
సంస్కృతి అనేది ఒక నామ వాచకం కాదు, అది ఒక క్రియ.
* * *
మానవత, వ్యక్తిత్వం, హేతువాదం – యీ మూడు సూత్రాల్ని ప్రధానంగా దృష్టిలో వుంచుకొని, ఆచరణలో అన్వయం చేయగలిగిన విధానాలు, తద్విధానాల ప్రచారకులు రావాలి – అదే నేటి యుగ సమస్య.
* * *
మానవుని మనస్సును విప్పార జేసి, స్వేచ్ఛగా భాసింపజేసే, అవరోధాలను తొలగించి, అన్వయాన్ని ప్రథానంగా గరపి, పరులకు నొప్పిలేని రీతిలో నడిపేదీప్తి సంస్కృతి, అది దేశీయము కాదు, జాతీయము కాదు. వర్నయము కాదు. ప్రాంతీయము కాదు. అది జాతి, మత, దేశ, కాలావచ్ఛిన్నంగా నడిచే వికాస, పునర్వికాస వుద్యమం.
* * *
స్వేచ్ఛా సక్తులు స్వేచ్ఛకోసం పోరాడాలి. లేకుంటే స్వేచ్ఛ మరణిస్తుంది. స్వేచ్ఛాసక్తులు మరణిస్తే – స్వేచ్ఛ ఆగిపోతుంది – ఈ మాటలతో నాకు ఏకాభిప్రాయం.
* * *
విద్య, ధనం ఈ రెండూ వున్నై, వీటిల్లో విద్య గరీయసి అనే మాటల విలువను మనం గ్రహించాలి.
ఒక దేశపు పౌరుసంపదలు వ్యక్తం కావాలంటే, ఆ దేశానికి భవిష్యత్తు ఉన్నదో లేదో తేలాలంటే అచ్చటి విద్యా విధానాల్ని పరిశీలించి చూస్తే కథ బోధపడుతుంది.
* * *
విద్య నెరుంగని వాడు మర్త్యుడే అనే మాటల్ని నేనంగీకరించను. విద్య నెరుంగనివాడు మర్త్యుడు కాకపోడు. కాని విద్య మనలో విలువల్ని పెంచగలిగితే, విద్యాధికులకున్న స్థానాలు వేరు. వారి సంచాలకత్వంలో రాగలమేళ్ళూ వేరు.
* * *
ప్రజాస్వామ్యం సరిగా పరిఢవిల్లాలంటే విద్యావిధానాల్లో ప్రభుత్వం కనీస జోక్యం మాత్రమే కలిగివుండాలి.
* * *
పుస్తకాలు జాతీయం చెయ్యడం అంటే బుర్రలు జాతీయం చెయ్యటమే. బుర్రలు జాతీయం చేయటం కన్న కారణం ఏముంటుంది?
* * *
భేదాభిప్రాయాలపట్ల మన్ననగలిగి ప్రక్కవాని వ్యక్తిత్వాన్ని గుర్తించి మనం వర్తించ గలిగేటట్లు చూడటం విద్య మూలసూత్రాల్లో వొకటి.
విద్య, స్థానిక సంస్థలు, న్యాయస్థానాలు ప్రజాస్వామ్య సౌధానికి మూడు స్తంభాలు. నాలుగో స్తంభము పత్రికా లోకం, యీ నాల్గుస్తంభాల గురుతు మీదగా ప్రజాస్వామ్య పరిరక్షణ కావించాలి.
* * *
వ్యక్తి స్వేచ్ఛ అన్నిటికన్నా ముఖ్యంగా లోకం పుట్టిన నాటనుండి ప్రజాస్వామ్యంలో యెంచబడుతూ వుంది. వ్యక్తి స్వేచ్ఛ వున్నదా లేదా అని తెలిసికోటానికి ఆ వ్యక్తికి వాక్స్వాతంత్ర్యం ప్రధానంగా యెంచబడుతుంది. వాక్సాస్వాతంత్ర్యం వున్నదా లేదా అని తెలిసికోటానికి రెండు స్వాతంత్ర్యాలు ముఖ్యం. అందులో మొదటిది పత్రికా స్వాతంత్ర్యం. రెండోది సమావేశ స్వాతంత్ర్యం. పత్రికా, సమావేశ స్వాతంత్ర్యాల్లో వాక్స్వాతంత్ర్యానికి రూఢిమ యేర్పడుతుంది.
* * *
స్వేచ్ఛను విప్పారజేసి, విస్తృతపరచటమే నా జీవిత లక్ష్యం.
* * *
పత్రికాలోకం యెక్కడైనా ప్రజల దృక్పథాలను ప్రభుత్వానికి, ప్రభుత్వ విధాన దృక్పథాలను ప్రజలకు అన్వయం చేస్తూ, యేది యేవేళల వుచితమో వుభయులకు చెప్పుతూ, లోపాలను దిద్దే వేదికగా పనిచెయ్యాలి.
రంగుకు మతంగాని, మనిషిగాని కారణం కాదు. రంగుకు ప్రకృతిలోని శీతోష్ణతలు తప్ప మరొక కారణం లేదు. యిది గ్రహింపని లోపమే జాత్యంహంకారుల బలం! అజ్ఞానం ఆనందాన్నిస్తే, జ్ఞానార్జనకోసం తాపత్రయ పడటం వెర్రికాగలదు.
* * *
నియత భావం పనికిమాలినది. ముఖ్యంగా విద్యా రంగంలో అదిమరీ అరిష్టంగా మారుతుంది.
* * *
మనకు మతాలవారీ ‘లా’ పోయి, సివిల్ లా వచ్చి, దేశ పౌరులందరికీ ఒకే చట్టం అన్వయం కావాలి. అప్పుడు వ్యత్యాసం లేని శాసన రాజ్యం ప్రారంభమౌతుంది.
* * *
ప్రజాస్వామ్య గతాలే నా రాజకీయాలు, నా సాంఘికాలు – ఆ లెక్క కొస్తే నా మానవీయాలన్నీ.
* * *
సాంఘిక న్యాయం జరగాలంటే ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ప్రజాస్వామ్యాలు ఆచరణలోకి రావాలి. కేంద్రీకృత విధానాలు పోయి, వికేంద్రీకృత విధానాలు రావాలి.
నాలో కులపర్వతాలే ఘూర్జిల్లిపోతై. ఇక చిన్న చిన్న సమస్యలు, పెద్దపెద్దపార్టీ లేమి పనికివస్తై.
* * *
సమాజాన్ని విప్పారే రీతుల్లో నిర్మించటం జరగాలి. సమాజంలో వికాసం రావాలంటే, భావుకత క్రిందనుంచి పైకి రావాలిగాని, పై నుంచి క్రిందికి నియతరీతిని రాగూడదు.
* * *
మానవుడు వ్యక్తిగా వికాసాన్ని పొంది, తాను భావసమాజ నిర్మాణంలో పునాదిగా వుండగలిగిన యేర్పాట్లను మనం పరిశీలించి, గమనించుకోవాలి. నినాదాలు కృషికి ప్రత్యామ్నాయాలు కావు.
* * *
ప్రభుత్వం తనకుతానై అన్నిరంగాల్లోకి రాగూడదు. ప్రభుత్వం వచ్చిన చోట సమిష్టిపేరుతో వికాస భ్రష్టత జరుగుతుంది.
* * *
మానవుణ్ణి వ్యక్తిగా, సమిష్టి ఆచారదారునిగా మనం పునః పరిశీలన చేసి, శాస్త్రీయ విజ్ఞానంతో తిరిగి కొలవాలి. మానవుణ్ణి అట్లా కొలవగా నిలిచిన నవీన విలువలు సమాజ నిర్మాణానికి ప్రాతిపదికలు కావాలి.
పెండ్లిలో నక్షత్రాల పెత్తనం, గోళాల పెత్తనం, గోళాల యజమాయిషి, చంద్ర సూర్యాదుల నిమిత్తం ఏమీ లేదు. పంచాంగ నియత బద్ధులమైనన్నినాళ్ళూ యీ సాంఘిక వృత్తంలో శాస్త్ర దాస్యయుగం జరుగుతున్నట్లే యెంచాలి.
* * *
సమాజంలో పెండ్లి మనలో యిద్దరి వొప్పదంగా, కంట్రాక్టుగా నడవాలి. ఒప్పందందార్లలో సమాన ప్రతిపత్తి మాత్రమే వుంటుందని గ్రహించాలి. వివాహం యిద్దరి మేలికలయిక.
* * *
వివాహానికి మతం ప్రాతిపదికగా అనాదినుంచి వుంది. అది మారాలి. మతానికి, పెండ్లికి నిజానికి సంబంధం లేదు. సివిల్ వివాహ పద్ధతులు రావాలి. దేశపౌరులందరకు ఒకే విధమైన సివిల్ ‘లా’ వర్తించాలి. అప్పుడు మనదేశం పూర్వ చరిత్ర గతుల నుండి బయటపడి నవీనపు రంగుల్ని తాల్చగలదు.
* * *
‘మీ పెండ్లికి యేమి కావాలండీ’ అన్నారొక పెద్ద, నేనొక పెండ్లి చేయించటానికి వెళ్ళగా. ‘పెండ్లికొడుకు, పెండ్లి కూతురు కావాలి – మరేమీ అవసరం లేదు’ అన్నాను. అ పెద్ద కొంచెం తమాయించి, ‘సూత్రం సంగతేమంటా’రన్నాడు. ‘అవసరం లేదు’ అని అన్నాను.
పెండ్లి దైవదత్తం కాదు. మనిషి కృషి. పెండ్లిండ్లు స్వర్గంలో దైవసన్నిధిలో జరుగవు. లోకంలో, సమాజంలో జరుగుతై.
* * *
లోకం మారాలి. లోకాన్ని మార్చాలి. మారిన విధులూ, మంచి విధులూ రావాలి.
* * *
పెండ్లి కుటుంబ వ్యవస్థకు, సమాజవ్యవస్థకు మూలం. పెండ్లి లేక నాగరికతగాని, సరియైన అభ్యుదయంగాని వుండవు.
* * *
భార్యాభర్తలిద్దరు సమానమైన ప్రతిపత్తిగల వారై యుండాలి. న్యూనతకు చోటులేని సాహచర్యం నాందిగా వుండాలి. అట్టి సమాన సంపత్తి, ప్రతిపత్తిగల స్త్రీ, పురుషుడు యిష్టపూర్తిగా తాము ఒక సంబారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకోవాలి. వారికి అంగీకారం, ప్రేమ, అనురాగాలు బంధాలుగా వుంటై. దీనికి మతం గాని, నమ్మకంగాని, మౌఢ్యంగాని, ధనంగాని మూలంకాదు, కారాదు. పెండ్లిలో స్వార్థం వుంది. సాంఘికత వుంది. వ్యక్తి కుటుంబంలోకి, కుటుంబం సంఘంలోకి పొడిగింపబడే అదనేగదా పెండ్లి. నిజానికి జీవితంలో వ్యక్తికి పెండ్లికి మించిన పండగలేదు.
హ్యూమనిస్టుగా నేను యుద్ధానికి వ్యతిరేకిని. అయితే యుద్ధం వచ్చినప్పుడు ప్రతిఘటించరాదనే పసిఫిస్టును కాను. మనం ఇతరుల భూభాగాలను ఆక్రమించాలనిగాని, కబళించాలనిగానీ నేను కోరను. దురాక్రమణను హింసతో అవసరమైన మేరకు నేను ప్రతిఘటిస్తాను. నాది సైనిక మనస్తత్వం కాదు. ఏ హ్యూమనిస్టూ సైనిక మనస్తత్త్వానికి చెందడు.
* * *
పెద్దవాళ్ళకు వికారాలు జాస్తి, పిల్లవాళ్ళకు విహారాలు జాస్తి. వినోదాలు పిల్లల ఆస్తి. విక్రీడలు వారి సొత్తు. వారి సహజాతాలను పెంచటమే, వరపిడిలేని రీతిని సమన్వయించటమే మన ప్రధాన కర్తవ్యం.
* * *
నేను లేక సంఘంలేదు. సంఘం లేకుండా నేనువున్నాను. వుండగలనన్న నైసర్గిక యాదార్థ్యతను గుర్తించిన వాణ్ణి అయినా, సమాజంలో, సంఘంలో నేను ఒక పూసను. ఆమణి మేఖలలో, ‘నాస్థానం నాదే’ అన్న అహం కలిగి, అహంకారం లేకుండా, ‘అహం బ్రహ్మాస్మి’లోని రాగరహిత భావాన్ని గ్రహించాను.
* * *
Unique quotations from the writings of AGK
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి