పెరుగుతున్న జ్ఞానం మనలో కొత్త తరహా నైతిక విలువలకు ఒరవడి దిద్దుతుంది.
వ్యక్తికి మించిన సంఘం లేదు. వ్యక్తికి మించిన దేశం లేదు. వ్యక్తిభద్రతతో సమిష్టి శ్రేయాన్ని కోరే రాడికల్ ప్రజాస్వామ్యబాట యీ యుగంలో స్వేచ్ఛామార్గం. మానవుడు సాంఘిక జంతువు స్థితినుంచి బయటపడి, ఆర్థిక జంతువుగా తయారు కారాదు.
* * *
మానవుడు సాంస్కృతిక జీవి. అట్టి సాంస్కృతిక జీవుల్ని తయారు చెయ్యటమే యీ యుగ సమస్య. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి వికాసం ప్రజాస్వామ్యానికి కీలకాలు. జాగృతి దానికి రక్షణ. యివి దృష్టిలో పెట్టుకుని మన పంచాయితీ రాజ్య పరిపాలన జరగాలి.
* * *
ప్రజాస్వామ్య నిర్మాణాలు సమాజంలో పై నుండి క్రిందికి రావు. క్రిందినుండే పైకి పెరుగుతై. పెరగాలికూడా. అధికారానికి, ప్రజలకు మధ్య అంతరం తగ్గటం, మధ్య బేరగాళ్ళు లేకపోవటం ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.
* * *
మన దేశంలో వివాహచట్రంలో కులతత్వం పేరుకొని, కరుడుగట్టింది. మనం దీనిని బ్రద్దలు చెయ్యాలి. లేకపోతే సాంప్రదాయబద్ధమైన సాంఘిక శృంఖలం నుండి మనకు విమోచనం కలుగదు.
పంచాయతీ రాజ్య నిర్మాణం అత్యుత్తమ స్థానిక వ్యవస్థ. పాలనా యంత్రాన్ని వికేంద్రీకరణ చెయ్యాలి అన్న భావం వుదాత్తమైనది.
* * *
అధికార వ్యామోహ రాజకీయాల నుండి మానవుణ్ణి, మానవ సంఘాన్ని తప్పించితే తప్ప, మానవుని భవితవ్యం యుద్ధమయం కాక తప్పదు. కాబట్టి ప్రతివ్యక్తి శక్తివంచన లేకుండా యుద్ధాన్ని ఆపటానికి కృషి చెయ్యాలి.
* * *
భాషకు జాతిలేదు. వర్గంలేదు. వర్ణం లేదు. అది మానవవేద్యమై, ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి వాడుకునే కొరముట్టు. అందువల్ల భాషలకు అంటులు, ప్రాంతీయతలు, దేశీయతలు ప్రవేశపెట్టటం వాంఛనీయంకాదు, ప్రాచీనతల త్రవ్వటం యోగ్యమైన పని కాదు. సంఖ్యావాచకాలను ప్రసరింపజేయటం విజ్ఞమైన పనికాదు.
* * *
సాహిత్యానికి, జీవితానికి అవినాభావ సంబంధంవుందని నా విశ్వాసం. సాహిత్యం లేకపోతే జీవితంలేదు.
* * *
మతతత్వం కులతత్వాన్ని దింపింది, పెండ్లి వ్యవస్థతో అది కుదురుకుని, వ్రేళ్లు తన్నింది. ఇది పునాదులతో సహా కదలిపోవాలి.
దేశం మనదైనంత మాత్రాన, ప్రభుత్వం మనదైనంత మాత్రాన పత్రికా రచయితలు ఆ రెంటికీ తాషామర్పా రాయుళ్ళుగా వ్యవహరించటం తగదు. జీవితానికి విమర్శ వెలుగు. పత్రికా రచయితలు విమర్శకు జ్యోతులు, స్వరాజ్యం వచ్చింది గనుక జరిగే మాయాబజారును కప్పిపుచ్చి, ప్రజల భవితవ్యానికి వురిత్రాళ్ళు మనకుగాను మనమే తయారు చేసుకోజాలము. సత్యాన్వేషణ, స్వాతంత్ర్య పిపాస, సర్వసమానత్వం మనకు ధ్యేయము కావాలి.
* * *
సాంప్రదాయ బద్ధత అనేది విడనాడాలంటే ఉపరి భాగాన్ని చికిలీ చేస్తే సరిపోదు. చికిలీ అడుగు మట్టాన్ని సైతం కదిలించివేయగలగాలి.
* * *
సాంప్రదాయత అనేది మానవుని మతపూరితమైన అడవిజంతువుగా మారుస్తుంది.
* * *
శాస్త్రమూ, శాస్త్రీయ దృక్పథమూ అనేవి మాత్రమే సాంప్రదాయక ప్రామాణికతలనే వాటిని బదాబదలు చేసి అభివృద్ధి సోపాన ప్రాయాలు కాగలవు.
* * *
సాంప్రదాయికతను భేదించాలంటే, మార్గమేమిటి? ఆ మార్గ విద్య – ప్రధానంగా శాస్త్రీయ విద్య.
కులాంతర, మతాంతర, రాష్ట్రాంతర వివాహాలు సాంప్రదాయం అనే ఘనీభవించిన మంచుగడ్డను ముక్కలు చేయగలవు.
* * *
ఆధునిక సమాజ రీతులు పై కొనాలంటే, సనాతన సాంప్రదాయ భావాలు తొలగిపోవాలి. ఆ మేరకు మనం కృషి గట్టిగా సాగించాలి.
* * *
మతం వ్యక్తిగత విషయంగా వుండాలి. ప్రభుత్వ స్థాయిలో మత ప్రచారం జరగటం ఎంతో ప్రమాదకరం. దానివల్ల ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు కలుగుతుంది.
* * *
ప్రజలు తమతమ పనులను, విధులను బాగా చేసుకోగలరనేదే ప్రజాస్వామ్యపాలనకు మూలం. ప్రజలవల్ల కాదు, ప్రభుత్వం తనకు తానుగా పనుల నిర్వహణ జరిపించాలి అనుకునేది ప్రజాస్వామ్యం కాదు. అది ప్రజల పేరుతో జరిగే పాలన. ప్రజల పేరుతో జరిగేది, అడుగులు సాగినకొద్దీ నియంతృత్వంలోకి లాగుతుంది. ఒక్కసారి నియంతృత్వం కుదురుకొనెనా, అది సర్వకాలానికి పాదుకుపోవాలని పెనుగులాడుతుంది. దాంతో ప్రజాస్వామ్యం నశిస్తుంది.
వ్యక్తిత్వం వమ్ము కాకుండా సంఘంలో వ్యుత్పత్తి తసరబు అయ్యేటట్టు చూడవలసి వుంది.
* * *
బుద్ధుని సిద్ధాంతాలు తిరగరాయాలి. నేడు మనకు కావలసిన మానవత ఆయన నుండి గ్రహించాలి.
* * *
నీతిని మోక్షానికి, మతానికి అంటగట్టకుండా మనిషికే అన్వయించాలి.
* * *
నీతిభయంవల్ల, భక్తివల్లరాదు. వచ్చినా నిలవలేదు. నీతి చైతన్యంవల్ల రావాలి. చైతన్యం వ్యక్తికం.
* * *
పాపాణపాక ప్రభుత విశృంఖల విహారం చేస్తున్నది. మనం జాగరూకులమై మెలగాలి.
* * *
క్రింది నుండి చైతన్యం రావాలి. పరివర్తన జరగాలి. సాంఘిక విముక్తి ఉద్యమం సాగాలి.
* * *
మౌఢ్యాన్ని బ్రద్దలు కొట్టాలంటే విజ్ఞానం మార్గం కాని నియంతృత్వం మార్గం కాదు, మార్చటం మార్గం కాని మొత్తటం కాదు, జాగృతి మార్గం – కాని నియతం చేయటం కాదు.
మంత్రిపదవుల్లో దేవాలయ ధర్మాదాయశాఖ వుండరాదు. ఒకస్టాటరీబాడీ వుంటేచాలు.
* * *
లోకం ఆజ్ఞగా, విజ్ఞంగా, మిశ్రమంగా వుంటుంది. విజ్ఞులకు ఒక ప్రగాఢ బాధ్యతవుంది. అది అజ్ఞ లోకాన్ని ప్రయోజనాత్మక దృష్టికల దానినిగా చేయటం, మిశ్రగతిలోని వారిని మందలించి మంచిగా మార్చటం, అయితే ఆజ్ఞలోకానికి మోతాదు హెచ్చుకావలెను.
* * *
సాంఘిక, మానసిక వర్తనలు భావదీప్తి పెంపొందిన గాని రావు. భావవిప్లవాలు, అన్ని పరివర్తనలకు నాందీ ప్రస్థావనలు. భావవిప్లవ కృషికులు స్వేచ్ఛాన్నేషణాసక్తులు.
* * *
కవి యెప్పుడైనా చేయబడతాడుగాని, పుట్టడు. అయితే కొందరిలో యిమిడే శబ్దపాటవాన్నిబట్టి శ్రావ్యత అబ్బుతుంది. కొందరికది అబ్బదు. అబ్బినవాణ్ణో ‘పుట్టుకవి’గా, అబ్బని వాణ్ణి ‘చేతకవి’గా వర్ణించుట పరిపాటిగా వుంది లోకానికి, అది న్యాయంకాదు.
* * *
మనది నిచ్చెనమెట్ల సమాజం. ఉచ్ఛనీచాలతో అసురుసురౌతున్నది. అంతరాలతో దిగజారుడు లేని నూతన సమాజ నిర్మాణం మనధ్యేయాల్లో వొకటి.
* * *
తప్పును మరొక తప్పుతో దిద్దలేము. తప్పును ఒప్పుచేయటం విజ్ఞానానికి మార్గం, శాస్త్రానికి రీతి, చరిత్రకోబాట. నా చుట్టూ ప్రపంచం ఎంత గింజుకున్నా, మన మార్గం మాత్రం శిష్టంగా వుండాలి.
* * *
ఒకడు తప్పు చేసి గూడా, దానికి కారణం యింకొకరి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తాడు. యింకొకడు యితరుల తప్పునుగూడా తన నెత్తిమీద రుద్దుకుంటాడు. మరొకడు తన తప్పు తన మీదికి రాకుండా చూచుకుంటాడు. యిటువంటి ప్రవృత్తి అందరి మానవుల్లోనూ వుంది. కొందరు వాటిచేత పని బాగా చేయించుతారు. మరికొందరు జాగర్త చేస్తారు. యీ శావాస్యోపనిషత్తు నుంచి సుమతీ శతకం దాకా యీ భావాల్నే చెప్పారు. దాన్నిబట్టి మన వేదాంతులు వుత్తమ, మధ్యమ, నీచాధికారుల్ని నిర్ణయించారు. ఈనాటి రాజకీయరంగంలో యిదే కనబడుతుంది. అయితే చూడాలి. చూచినట్లు కళ్ళు తెరిస్తే లాభం లేదు.
* * *
మితిమీరిన జనాభామను కనుట నైతికంగా మంచిదికాదు. సాంఘికంగా చిక్కులు మీరి వ్యవహారం రాజకీయంగా ప్రభుత్వాన్ని సమస్యలలో మ్రగ్గచేయటం అవుతుంది. సాంఘిక న్యాయం కావాలని, చేకూర్చాలని కోరేహక్కు మనం చేయవలసిన చేయదగిన పనులు చేయటంలో వుంటుంది.
చేయవలసిన పని చేయటానికి జంకే వారివల్ల యెక్కువ కీడు సంఘానికి వస్తుంది. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా యిట్లాగ నీకు, నాకు, మనందరికి అన్యాయం జరుగుతూ వుంటుంది. యెవడి అన్యాయం వాడు చెప్పితే స్వార్థమంటారు, వొకడి అన్యాయాన్ని గూర్చి యింకొకడు చెప్పితే నిష్కామకర్మ అంటారు.
* * *
ప్రధానంగా స్త్రీ పురుషులంతా మార్గాన్వేషణ చెయ్యాలి. మార్గాన్వేషణకు విషయ పరిజ్ఞానం కావాలి. విషయ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని చైతన్యం పొంది, ఆ పొందిన చైతన్యాన్ని మార్గాన్వేషణకు మలచుకోవాలి. పూర్వాచారాల్ని వర్తమానానికి అడ్డుపెట్టి భవితవ్యాన్ని చిక్కుల్లో పెట్టరాదు. రానున్న తరాల అభ్యున్నతికోసం కలవరపడాలి.
* * *
ఒక వాతావరణం సమాజంలో సృష్టింపబడాలి. ఉద్యమానికి చేయూత నిచ్చేవారు. ప్రచారకులు వారి వారి అనుభవాల్ని నిరాఘాటంగా చెప్పుటకు సిగ్గుపడరాదు. ప్రభుత్వము వైపుకు చూడకుండా నేను యిప్పుడు యిక్కడే యేమి చేయగలనో అది చేయాలన్న దీక్షాపరుల సంఖ్య ప్రాంతప్రాంతాల్లో పెరగాలి.
* * *
మానవుణ్ణి తోటి మానవుడు నమ్మక, తాను తోటివానికన్నా ప్రతిభుడని అహంకరించి, తన ఆలోచన మీదనే లోకం నడవాలని భావించి, మానవునిలోని వికారాల్ని రెచ్చగొట్టి, అధికారాన్ని చేబట్టి నియంతలుగా తయారౌతున్నారు. అది పోవాలంటే, మానవునిలో నమ్మకం కుదిరే విధానం వుండాలి.
* * *
మానవుడు ప్రాయికంగా హేతువాది. అందువల్లనే అతనిలోని హేతుత్వం పెరగగల విధానంలో అతను నైతికకీలిగా వుండగలడు. నీతికి అతని హేతువేచాలును. దేవుడు అవసరం లేదు. మతం అవసరంలేదు. యితర మందులు అవసరం లేదు.
* * *
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛపునాది. స్వేచ్ఛకు భావ స్వాతంత్ర్యం మూలకందం, భావస్వాతంత్ర్యానికి వికారాలు లేని వ్యక్తులు మూలం. వ్యక్తివికాసం సమాజానికి భూషణం.
* * *
చిన్న పెద్దరికాలకేమిగాని, చేయనెంచినది చెప్పి, చెప్పినది చేయగలిగిన నాయకత్వం వుంటే కథాకథనవృత్తి మారుతుంది. చిత్తశుద్ధిగల రాజకీయ, సాంఘిక వాతావరణం కావాలి.
మనపని మనం చేసుకొని పొరుగువాళ్ళ కొంపలకి ఎసరు పెట్టని వాతావరణం కావాలి. కాబట్టి అట్టి వాతావరణంతో గుణైక మార్పుగల ప్రకృతి అవసరం, దానికే నా చుట్టూ ప్రపంచం పరిశీలించాలి, ప్రయత్నించాలి, పయనించాలి. అపుడు సమస్యాపరిష్కారం జరుగుతుంది.
* * *
వెనుకబడిన జాతుల ఉద్యమమంటే సాంఘిక విముక్తి ఉద్యమంగా నేను భావిస్తాను.
* * *
సాంఘిక దౌష్ట్యభావాలన్నీ పునర్వ్యవస్తీకరణ పొందందే, నూతన సాంఘిక దృక్పథం రాందే యీ భావ విప్లవం జరుగదు. వెనుకబడిన జాతుల ఉద్యమానికి ముందు ఒక భావవిప్లవం జరగాలి. యీ సాంఘిక తాత్విక విప్లవాన్ని ఆర్థికత్వంతో ముడిపెట్టి అది జరగంది ఇది జరగదని అసలు ఉద్యమాన్ని వెనక్కు నెట్టే గమనం నాకు నచ్చదు.
* * *
తత్వశాస్త్రాన్ని, విజ్ఞా శాస్త్రాన్ని జీవితంలో మేళవించి సమగ్రత్వాన్ని కావ్యాల్లో ప్రతిబింబింప చెయ్యాలి. యీ ఆశయం యే రూపంలోనైనా వుండవచ్చు.
* * *
సత్యాన్వేషణ, స్వాతంత్ర్యేచ్ఛలను హేతువాదం ద్వారా పరిపక్వంచేసి, మానవునిలో యిమిడివున్న హేతువాద నైతిక ప్రవృత్తులను ప్రకోపింపచేయటమే సాహిత్యపరమావధి.
గాంధీ చెప్పి వుండవచ్చు. ఎం.ఎన్.రాయ్ సిద్ధాంతీకరించి వుండవచ్చు. ధ్యేయాలు, ధ్యేయాన్ని చేరే మార్గాలూ సమంగా వుదాత్తంగా వుండాలని లోకం బాగా గ్రహించలేదు.
* * *
AGK is known for his aphotistic saying in Telugu.
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి