మనకవి కాటూరి - ఏజికె నివాళి
పన్నీటిజల్లు (ఖండకావ్యముల సంపుటి)
కాటూరి వెంకటేశ్వరరావుగారి మరణంతో పలచగా ఉన్న తెలుగు పండిత కవుల కూటమి మరింత పలచబడింది. కవిగా, పండితుడుగా, పెద్దమనిషిగా కాటూరి ప్రసిద్ధి గాంచాడు.వయస్కుడైనా, వయస్సు ముదిరికాదు పోయింది. రుగ్మతవల్ల. కవిగా అనువాదకుడుగా, శిష్యుడుగా, స్నేహితుడుగా గణన కెక్కినవాడు కాటూరి.సమాసాలు లేని, అన్వయకాఠిన్యంలేని, అర్థ విపరిణామం లేని, శ్రావ్యకవితాగానం చేయగలిగి, గురుతు మీరిన కుదురు గల్గిన రచన చేయగలిగినవాడు కాటూరి.
వ్యుత్పత్తి తక్కువగాని, ఉత్తమ శ్రేణికి చెందిన రచన చేసినవాడు కాటూరి.గురువుల మాదిరి జంటకవిగా ప్రసిద్ధికెక్కాడు. గురువుల్లో మాదిరి ఒకరు ముందు రాలిపోయారు. ఆ రాలినది కాటూరి, ఆచుట్టరికమే యిక్కడగూడా అన్వయింపగలడేమో.
జంట కవుల జీవితం గమ్మత్తుగా ఉంటుంది. ఆద్యంతాలు యీ జంట నడిస్తే అదొకరకం. కాక, కొన్నేళ్ళే నడిచి, తరువాత యెవరికి వారు వేరు వేరు రచనలు చేస్తూవుంటే జంటకవుల విమర్శకుని చేతిలో చిక్కిపోతారు. కవిత్వాన్ని బట్టి జంటను విడిచేసి, విరగగొట్టి చూడవచ్చు. అప్పుడు, జంట కవిత్వాలలోని లబ్జు జారిపోతుంది. ఎటూ నిలువని జంటా బయట పడిపోతుంది.
ఆ చిక్కు కాటూరి – పింగళ జంటలో వచ్చింది. మొదట్లో కలసి వ్రాసినవారు మధ్యలో చీలిపోయివారు. చీలి వేరు వేరు కవిత్వాలు వ్రాసుకున్నారు. విమర్శకునికి చిక్కిపోయారు.కాటూరి మనిషి నిబ్బరంగా ఉంటాడు. ప్రసన్నుడు. కవితగూడా నిలకడగా చిక్కగా, నిబ్బరంగా, ఒడుదుడుకులు లేకుండా ఉంటుంది. శైలి, భావము తొణికసలాడుతూ ఉంటవి దేన్ని యేది మించుతుందో చెప్పటం కష్టమైనంత సారళ్యతను కలిగి ఉంటవి.
“తొలకరి”ని విమర్శక శిఖామణి కట్టమంచి రామలింగా రెడ్డిగారు పరిచయం చేశారు. “సౌందరనందం” తనకు తానే పరిచయం చేసుకుంది. “సౌలస్త్య హృదయం” ప్రత్యేకించి వినిపించింది. “సౌందర్యలహరి” విహారం మొదలు పెట్టింది. అనువాదాలు అనువాదాలే!
కాటూరి రచనల్లో సౌకుమార్యం, ప్రసన్నతలు బారులు తీర్చి ఉంటవి. వారి కవిత్వం, ఒక ప్రచార సాధనం కాదు. వారి కవిత్వం ప్రచార కవిత్వం కాదు. అది కేవల కవిత్వం. అందువల్ల మరింత హృద్యం, వేద్యం గూడా.పాతకు పాత, క్రొత్తకు, క్రొత్త గల కవి కాటూరి. సంకలన కర్తగా కాటూరి చూపిన నేర్పు నిరవశేషమైనది.హెచ్చుగా వ్రాసే గుణం లేదు. వ్రాసిన దానిలో గుణం చూపగల కవితల్లజుడు కాటూరి.
కవి అస్తమించిన సమయంలో వ్రాసినది. (ప్రజావాణి నుండి)
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి