3, ఏప్రిల్ 2011, ఆదివారం

చల్లా పిచ్చయ్య శాస్త్రిగారి కవితా కల్పనా విన్యాసం

చల్లా పిచ్చయ్య శాస్త్రిగారి ప్రతిభావ్యుత్పత్తులు

రచన వృత్తిగా చలామణిగాగల తీరుతెన్నులు సమకాలికాంధ్రావనిలో లేవు. అందులో, కేవల పద్యరచన వృత్తికారికంగా వుండగలగటం అసంభవం, పద్యరచనకు యించుమించు మార్కెటు లేదు. కాగా, ఆ పద్యరచన మతైక దృష్టి ప్లుతమైనప్పుడు, వున్న కొలది సావకాశం సంక్షిప్తం కాక తప్పదు.
శతావధాని, అభినవజయదేవ బిరుదాంకితులు, రసహృదయులు, శాంతశీలురు అయిన చల్లా పిచ్చయ్యశాస్త్రిగారు కేవల కవితారచనలో నిమగ్నులైయుండి, తమ అరువదియేడవ యేట గూడా, కవితా కల్పనా విన్యాసంలో దోబూచులాడుచూ వుండి, నూతనత్వాన్ని కోల్పోకుండా నిగదించ గలిగారు. యిది కవిత్వంలోని నిగ్రహ పాటవ స్థితి.
శాస్త్రిగారు 40 పుస్తకాలదాకా అచ్చు వేశారు. ఇంకా అముద్రితాలు చాలా వున్నై. పెద్దవి గూడా వున్నవి. దానికి వదాన్య శేఖరులు జాలువారు కరుణా విశేషం కావాలి. సమయం రావాలి. ఇప్పటి ముద్రిత కృతులు గూడా పలువురి శ్రేయోగాయక వితరణవల్లనే సంభవమైనవి.
శాస్త్రిగారి కృతుల్లో ముఖ్యమైనది గీతగోవింద కావ్యము గీత గోవింద రహస్యము దీనికి వ్యాఖ్యానతుల్య రచన. గీత గోవిందం అత్యంత మనోహర కావ్యసంతతులలో నొకటి. దానికి మించిన మాధుర్యాన్ని కలిగిన కావ్యాలు సంస్కృతంలో అరుదు. అసలు లేకపోవచ్చు గూడా. అట్టి కృతిని, మధించి, చిలికి, నవనీతము తీసి, చల్లా వారు తెలుగు లోకానికి మహోపకారం చేశారు. పద్మావతీ చరణ చారణ చక్రవర్తులనేకులున్నారుగాని, యీ పనికి పూనరైరి. శాస్త్రిగారి కృషిఫలితం చూడండి.
లయతాళరాగాభి నయగతి గమకాది
        సంగీత శాస్త్ర ప్రశంసిగాని
రసభావకల్పనా రంజనౌచిత్య శృం
        గార కావ్య విధాన కలనగాని
తైలధారాభిన్న తాత్త్వికధ్యానయో
        గాచ్యుత భక్తియోగమునగాని
విద్వత్కవీంద్ర హృద్విక సనాపాదన
        ప్రకృతి సాక్షాత్కృతి ఫణితిగాని,
కృష్ణలీనాత్మ జయదేవ కృతికవీంద్ర
శక్తి శోధింత్రుగాత యష్టపదులొప్పు
గీతగోవింద కార్య నిరతి రీతి
బుద్ధిమంతులు సత్కళాపూర్ణులెలమి
అన్నారు.
గీతగోవిందం కవితకు ఆనుపానులు దీర్చిన గీటురాయి, కవిత్వాన్ని అనువదించటం కష్టం. కవితాహృగయాన్ని మరొక భాషలోకి అనువదించి ఆకృతి చెడకుండా, రూపురేఖలు వికసించునట్లు చేయటం, కవికి తప్ప సాధ్యం కాదు. ఆపనిని మన పిచ్చయ్యశాస్త్రిగారు చేశారు.
కావ్యారంభంలో కావ్యగతి తొలగనీయని రీతుల్లో శాస్త్రిగారు
అల్లిబిల్లిగ శబ్దపల్లవంబుల గూర్ప
       బ్రఖ్యాతిగనె నుమాపతి ధరుండు
శృంగార కావ్య నిర్మిత రసపుష్టి బే
ర్వడశె నాచార్య గోవర్థనుడు
సద్భావ చంద్రిక శారద సంపత్తి
       దనియించెశరణ సత్కవి విభుండు
కవిలోకమునకు శాత్రవశబ్ద మెండును
       శ్రుతి..జేర్పకలరెను శ్రుతి ధరుండు
అని రసపుష్ఠికి తుష్టి గూర్చే కలుపుగోలు తనాన్ని ప్రదర్శించిన అష్టపదుల ఆంధ్రీకరణ సాధ్యంకానిపని, జయదేవుని కవిత, సంస్కృతమయ్యూ ఆంధ్రానికెంతో దగ్గర కానీ తెలుగుకు దూరం అందువల్ల, అష్టపదుల ఆంధ్రానువాదం తేలికయేగాని, తెలుగు అనువాదం కష్టతరం ఆ పనికి శాస్త్రిగారియ్యకొని కృతకృత్యులగుట ప్రశంసార్హం.
శతక కవిత్వము మీద శాస్త్రిగారికి ప్రత్యేక ఆస్థ కలదు. వారి కభిరుచుల కనుకూలంగా అనేక శతకాల్ని విస్మరించారు. శ్రీ హేరంబ శతకము. దీనికన్న హేరంబ స్తుతి బాగుంది. కందంమీదకన్నా, వృత్తంలోనే  శాస్త్రిగారు బాగా పాదుకున్నారు. హేరంబ స్తుతిలో.
గగనమ్మందు రవీందు రూపుగను
       నాకమ్మందు దేవేంద్రు రూ
పుగ విధ్యాత్మను బ్రహ్మలోకమున
       సంక్షోజాక్షి, భావమ్ముచే
రగ వైకుంఠమునందు శూలిగను
       శ్వేతక్ష్మాథరన్బొల్చు ధీ
! గణేశా! మిము నెంచగాదమె
       హేరంబా కృపాంబోనిధీ..
అన్నారు శతకంలో కవిత్వానికి పాదులు త్రవ్వారు. భావప్రసారం మాత్రం ప్రాచీనం, లాంఛనాయుతం.
శ్రీ బాలకోటీశ్వర శతకంలో
కంఠేకాల! భవత్సమాహ్వయమణి
       గ్రెవేయమున్ దాల్పదు
త్కంఠన్ బంగరుతీవెలో జిలుగు
       మకాహార మోదాల్పు నీ
కంఠంబే గతినేని నీవు కృపభక్తి
       ప్రేమవారాశి! యీ
కుంఠన్ దారికి ద్రిప్పుమోయ
       సుర చిచ్చూ! బాలకోటేశ్వరా!
అని అత్యుత్కంఠతతో కవి ఝరీప్లా వింతగా ఆలాపించారు.
సీతానగర హనుమచ్ఛతకంలో
       చేతులు మోడ్పెద తండ్రీ!
       గోతులకై యీడ్పుతమము గొల్పుము కృప ఖ
       ద్యోత మహామండల మటు
       సీతానగరాంతరస్థ! శ్రీ హనుమంతా! అని భూనభోంతరాళాలు సంచరించి, హనుమంతుణ్ణి చూస్తూ, ప్పచ్ఛిస్తూ వుంటాడు. హనుమచ్ఛరిత్రగూడా వ్రాశాడు.
సర్వజ్ఞాన స్వరకల్పవల్లరి వారణాశి రామసుబ్బయ్య శాస్త్రిగారి జీవితాన్ని శాస్త్రిగారు వ్రాశారు. దానిలో, వారు చూపిన సౌజన్యమేగాక, శాస్త్రిగారికి సంగీత శాస్త్ర రహస్య ప్రబోధంలోని సర్వ ప్రస్తారాల్ని బాగా మేళవించి, లగించారు.
సంగీతం చాలదన్నట్లు చాణక్య నీతి దర్పణము వ్రాశారు. చాణక్యంలోని నీతి, సాంఘిక దృష్టి శాస్త్రిగారికి నచ్చి, వారు దానిని ఆంధ్రీకరించారు. రచన సరళ ప్రశస్తితో వుంది.
       వేదవేదాంగ తత్తజ్ఞం విజ్ఞం లోకజ్ఞ సంసది
       అర్థశాస్త్రాధ్వని ప్రాజ్ఞం చాణక్యజ్ఞం మహర్నుమ
అని సూక్తి సుధలు, తెలుగు పాఠకలోకానికి అవసర కార్యాలుగా అందచేయబడినవి.
హంసల దీవి ప్రభావము చంపూకావ్యము. ఇది గూడా భక్తిప్రపూరిత కావ్యం, కృష్ణాసాగర సంగమాన్ని వర్ణిస్తూ కవి
కృష్ణా సాగర సంగమంబు భువి
       సంకీర్త్యంబు సుజ్ఞానదృ
జ్నిష్ణాతుల్ సములైవసించి రచటన్
       శ్రీ వేణుగోపాలునిన్
విష్ణుంజూచిన యోగిహంసయని యు
       డ్వేల ప్రహర్షంబునన్
తూష్ణీంభావముదృష్టనుం దఱిమి
       భక్తుల్ భక్తి సౌధంబులన్
చూపుతూ, కృష్ణాసాగర సంగమ స్వరూపాన్ని సంకీర్తించాడు.
చాటూక్తి రత్నాకరము శాస్త్రిగారి శతావధానిత్వాన్ని, కవితా పటుత్వాన్ని ప్రదర్శిస్తుంది. చాటుక్తి రత్నాకరం కావ్యం కాదు. కావ్యం గూడా. ఇది పరశృతి రూపంలోని ఖండకావ్యం. సాహితి శ్రీగణనార్హ భారతవిశేష మహాశు కవిత్వ లేఖకున్ రవములు భావముల్ గుణపరం పరవృత్తులుత్ర  ప్రసవ పరీమళమ్ములు.... చూపబడినవి. 200 పేజీల పద్యకృతి. పోతన ఫణితిలో, పాతకారు వాసనలతో, ఏరసమేని గైత జగదీశ సమర్పిత మిందుగానిచో నీరసమౌను అని కవి తన రంగును విప్పి చెప్పుకుంటాడు.
శ్రీమదధ్యాత్మగేయ రామాయణ కృతి ప్రశఁసలో శ్రీ పిచ్చయ్యశాస్త్రి పుంస్కోకిల గానస్రవంతి వెలార్చాడు.
గౌరీశంకర వాదరూపముగ
       తోకధ్యేయగాథేయ నా
గారంభంబుల దేవియల్ చిలుక
       నా యధ్యాత్మ రామాయణం
బారూఢిన్ దెనిగించి కీర్తనలుగా
       నాబాలగోపాలమున్
పారంబడని వేడ్క ముంచితిని
       సుబ్రహ్మణ్య విద్వత్కవి.
అంటూ వృత్త నియమాపాయ స్థితిలో లాగాడు. త్యాగరాజును రూపు తీర్చాడు. పలువురు కవి, పండిత ప్రశంసలు, భక్తిగీతాలు, రూప చిత్రణలు చేసిన అనేక ఖండికలు వున్నవి. వారి కృతులలో గీత గోవిందము, చాటూక్తి రత్నాకరము అత్యంత గౌరవస్థానాన్ని ఆక్రమించగల కృతులు.
కవి పాతకారువాడు. భావములు మతపూతములై నడయాడును. కవి సరసుడు. రసహృదయుడు, సంగీతమన్న చెవురిక్కించువాడు. వయస్కుడయ్యును, యువ భావుకుడు. వారి గ్రంథాల కన్నింటికి ఆకృతికలినమేలు. వారి దృక్పథముతో నేకీభవించని వాడనయ్యు, వారి సౌజన్యాకృతి జూచి, కవితాగుణాన్ని చూచి నా భావన వారిపట్ల చేసితిని. వారు ఇతివృత్త ప్రాధాన్యతతో కావ్య నిర్మాణం చేసిన బాగుండెడిదను భావన నన్ను వీడనిది.
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు, పిచ్చయ్య శాస్త్రిగారిమీద వ్రాసిన పద్య భాగం స్మరిస్తూ.
చల్లని సుస్వభావమును చల్లని
       సత్యవచ: ప్రసంగమున్
చల్లని దృగ్విలాసమును జల్లని
       సత్కవితా ప్రపంచమున్
చల్లని సత్ప్రవర్తనము చలని శాస్త్ర
       సమాఖ్య కలుటన్
Avula Gopalakrishna Murty assessment published in Andhra Patrika daily during 1960s----

1 కామెంట్‌లు:

astrojoyd చెప్పారు...

మా తాతగారి గురించి ఇంత చక్కని పోస్ట్ అందించినందుకు శతకోటి వందనాలు మీకు.అయన పేరే నాకూ పెట్టారు మాతాతగారు.చల్లా.జయదేవ్ నా నామధేయము.